Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.3 (1934).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓరుగంటి దృశ్యములు*[1]

[శేషాద్రి రమణ కవులు]

1.ఇది యాంధ్రనగర మిదియే, గద యాంధ నృపాల శాతకరవాలరుచుల్
మొదలంట వెలిఁగి యారిన, సదనము కీర్త్యంగనాశ్మశానంబు సఖా!


2.శ్రీకాక తీయభూపుల, ప్రాకటసత్కీర్తి చిహ్నబంధురమగు నీ
యేకశిలానగరము నీ, రాకకు ముదమందెఁ జూడ ర మ్మాంధసుతా!


3.ఇది ప్రోలభూపతికదనంబునందు జ,గదేవు నోర్చి మేల్గన్న నెలవు
ఇది రుద్రభూపునాఁ డేన్గుగున్నలకు సా,ధన మావటీండు నేర్పిన పొలంబు
ఇది మహారాష్ట్రులతుదిఁ జూచి రుద్రాంబ, అని ముగించిన విజయాంక భూమి
ఇది గణపతినృపుం డెదురేగి తిక్కన, కవి కాళ్లు గడిగిన సవనభూమి
ఇది నవలక్ష ధానుష్కు లేక హేల, సంగరంబునఁ దొలుదొల్త చాఁపకూడు
కుడిచినతలంబు మది నెంచుకొన్న మాత్ర, నొడలు పులకించు నిచటి గాథోత్కరంబు

  1. హనుమకొండ రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషానిలయ రజతోత్సవ సందర్భమున పాడబడినవి