గ్రంధాలయముల ఆవశ్యకము
(ఆంధ్రపత్రిక సంపాదకీయము. 22-1-84)
దేశమునందలి ప్రజలకు విజ్ఞానాభివృద్ధి కలుగుటకు సహాయకము లగువానిలో గ్రంథాలయములు ముఖ్యముగ పేర్కొనబడదగిన వనువిషయ మిపుడు ప్రపంచము నందన్ని నాగరక దేశములలోను బాగుగా గ్రహింపబడినది. పాశ్చాత్య దేశములలో గ్రంథాలయాభివృద్ధికి ప్రజలును ప్రభుత్వమువారును గూడ సత్యధికముగా తోడ్పడుచున్నారు. మన దేశములోగూడ గ్రంథాలయోద్యమమున కిపుడు చాల ప్రాముఖ్య మొసగబడుచున్నది. మన దేశమునందు బరోడా సంస్టానము వారీవిషయమున సర్వవిధముల ముందంజ వేయుచున్నారు. తక్కిన సంస్థానముల వారుగూడ వీరిమార్గము ననుసరించు టవసరమై యున్నది. కనీసము ప్రాథమిక విద్య నభ్యసించినవారికందరికిని గంథాలయముల వలన చాలమేలు కలుగగలదు. అందులకు బాలురకును బాలికలకును ప్రాధమిక విద్య ఉచితముగాను నిర్బంధము గాను నేర్పబడుట ముఖ్య కర్తవ్యమై యున్నది. ప్రతి పల్లెలోను గూడ ప్రాధమిక పాఠశాలయును గ్రంథాలయమును విధిగా నుండవలెను. దేశభాషలో విద్య బోధింపబడవలెను. అపుడు ప్రాధమిక విద్య నభ్యనించినవారు జ్ఞానాభివృద్ధిని బడయుటకు గ్రంథాలయములు బాగుగా నుపయోగించుటకు తగిన దేశభాషా గ్రంథములు గ్రంథాలయములలో లభించుటకు తగిన యేర్పాటులు జరుగవలెను. ఈ గ్రంథములు వ్యావహారిక భాషలో అనగా మామూలు వాడుక మాటలతో సులభశైలిని వ్రాయబడవలెను. కులవిద్యలు వృతి విద్యలు చేతిపనులు మున్నగువాటిని నేర్చుకొనగోరు వారికి తొడ్పడగల గ్రంథములుగూడ నుండవలెను. నీతి మత రాజకీయ సాంఘిక విషయములకు సంబంధించిన గ్రంధములు గూడ నుండవలెను. గ్రంథాలయములలో వార్తా పత్రికలుగూడ నుండవలెను. ఈ గ్రంధములను పత్రికలను ప్రజలు ఉచితముగా బడయగలుగు చుండవలెను. ప్రతిగ్రామమునందును గ్రంథాలయము ప్రజలకు కూడలి స్థానముగా నుండవలెను. స్త్రీలును పురుషులును గూడ వీనిని పూరిగా నుపయోగించుకొనుటకు తగిన సౌకర్యము లుండవలెను. వీటిని ప్రజలు ఉపయోగించుటకు గట్టి ప్రచారము జరుగవలెను. ప్రజల నధికముగా నాకర్షింపగల యేర్పాటు అన్నియును జరుగవలెను. ఆంధ్రదేశము నందుగూడ గ్రంథాలయము లిపుడు హెచ్చుగా నేర్పడుచుండుట సంతోషప్రదము. వీటి కింకను ప్రజలతోడ్పాడు హెచ్చుగా లభింపవలెను. భారతదేశమున గ్రంథాలయాభివృద్ధికి బరోడా సంస్థానము తరువాత ఆంధ్రదేశమే పేర్కొనబడదగి యున్నదని నల్లూరులో 18వ తేదీని జరిగిన ఆంధ్ర బాల సరస్వతీనిలయ తృతీయ వార్షికోత్సవ సంబంధమున గ్రంథాలయ ప్రదర్శనమును ప్రారంభించుచు శ్రీయుత మాగంటి బాపినీడు గారు నుడివిరి. ఇది ఆంధ్రులు సంతసింపదగిన విషయమేగాని యీఅభివృద్ధి చాలదనుట నిశ్చయము. ప్రతి గ్రామమునను విష్ణ్వాలయ శివాలయములతో పాటు ఈ శారదాలయములుగూడ ముఖ్యముగా నుండవలెనను విషయమును ఎల్లవారును ముఖ్యముగా గుర్తింపదగును. ఇపుడు కాకినాడలో శ్రీయుత వేమవరపు రామదాసు పంతులు గారి అధ్యక్షతక్రింద ఆంధ్రదేశ గ్రంథాలయ సభ జరుగుచున్నది. ఈ సందర్భమున జరిగిన గ్రంథాలయ సేవకసభకు సన్మాన సంఘాధ్యక్షులగు శ్రీయుత నేట్రకంటి యోగానందరావు గారు గ్రంథాలయోద్యమాభివృద్ధికి ప్రకాశవంతమైన భవిష్యత్తు కలదని నమ్ముటకు సూచనలు స్పష్టముగా కన్పించుచున్నవని నుడువుట లో సత్యమునే వెల్లడించిరి. ఆంధ్రదేశమున శ్రీపిఠాపురముమహారాజావారు ఆంధ్రభాషాభివృద్ధికి సర్వవిధముల తోడ్పడుచున్నారనుటకు వీరేర్పరచిన ఆంధ్రసాహిత్య పరిషత్తే ప్రబల నిదర్శనము. విద్వత్కవివరేణ్యులును జయపురాధీశులునునగు శ్రీ విక్రమ దేవవర్మ మహా రాజాగారు ఆంధ్ర విశ్వవిద్యాలయమునకు భూరి విరాళముల నొసగుచున్నారు. శ్రీ బొబ్బిలి మహారాజు గారు ప్రోఛాన్సలరుగా నుండి చాల సహాయపడుచున్నారు. స్వర్గీయులైన శ్రీ పోలవరం జమీందారు గారు తమ జీవితమునంతను భాషాసేవకే వినియోగించిరి. కవిపుంగవు లగు శ్రీ తిరుపతికవి ప్రముఖులను ఆదరించిరి. వీరిపేరిట నేయిపుడు కాకినాడలో నొక గ్రంథాలయము నడుపబడుచున్నది. ఆంధ్ర దేశమునందుగల మహారాజులు జమీందారులు భూస్వాములు ధనికులు మున్నగువారం