ఉపసంఘములు
అధ్యక్షుల ఉపన్యాసమైనపిమ్మట, మద్రాసు గంథాలయచట్టమును గూర్చి నివేదిక తయారుచేయుటకు ఒక ఉపసంఘమును, గ్రంథ భాండాగారికులకు ఇవ్వ వలసిన తరిబీతునుగురించి నివేదికను తయారుజేయుట కొక ఉపసంఘమును ఏర్పాటు చేసిరి. ఉదయ సమావేశము సమాప్తము చేయబడెను.
మధ్యాహ్న సమావేశము
మధ్యాహ్నము తిరిగి 3-30 గంటలకు సభ సమావేశమయ్యెను. తెనాలి గ్రంథాలయ కార్యదర్శిగారగు జగన్నాధరావు గారు గ్రంథాలయ పరిపాలన యందు తమకుగల అనుభవమునుగూర్చి గంభీరోపన్యాసమిచ్చిరి; పిమ్మట మద్రాసు క్వీను మేరీ కాలేజీయందు గ్రంధ భాండాగారిణియగు కే. శామ్యుయలు గారు 'ధర్మగ్రంథాలయము యొక్క ఉపయోగము' ను గూర్చియు, గ్రామ పునర్నిర్మాణ సూపర్వైజరు గారు కే. నరసింహరాజుగారు 'గ్రామ గ్రంథాలయము' లను గూర్చియు, యాతగిరి లక్ష్మీవెంకట రమణ గారు 'వయోజన విద్యా వశ్యకత'ను గూర్చియు ఉపన్యసించిరి.
ఉపసంఘముల నివేదికలు
ఉదయము ఏర్పాటు అయిన ఉప సంఘములు తమ నివేదికలను చదివిన పిమ్మట, సభవారు వానిని ఆమోదించిరి. అనంతరము ఈ దిగువ వివరింపబడిన తీర్మానములు చేయబడినవి.
తీర్మానములు
1. (క) అఖిలభారత గ్రంథాలయోద్యమమునకును, ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమమునకును నాయకులగు శ్రీ సూరి వేంకట నరసింహశాస్త్రి గారి అకాలమరణమున కీ సంఘమువారు చింతిల్లుచు, వారి ఆత్మకు శాంతి కలుగు గాకయని భగవంతుని సార్ధించుచున్నారు.
(చ) శ్రీవారి కుటుంబమున కీ సంఘము వారు తమ సానుభూతిని తెలియజేయుచున్నారు.
(ట) ఆంధ్ర దేశమునందున్న గ్రంథాలయము లన్నియు శ్రీవారి పటముచే తమ గ్రంథాలయముల నలంకరింపవలెనని ఈ సంఘమువారు తీర్మానించుచున్నారు.
(త) శ్రీవారి స్మృతిచిహ్నముగ సమగమగు “ఆంధ్ర దేశ గ్రంథాలయోద్యమ చరిత్ర" ను తయారు జేయుటకై ఈ సంఘమువారు తీర్మానించుచున్నారు.
(ప) బెజవాడయందు ఆంధ్ర దేశ కేంద్ర గ్రంథాలయ స్థాపనకై శ్రీవారు చేసిన కృషిని వెంటనే ఫలోన్ముఖమునకు దెచ్చుటకు ఈ సంఘము వారు తీర్మానించుచున్నారు.
2. గ్రంథాలయోద్యమమునకు నూతన వికాసమును, ఉత్సాహమును కలిగించుటకుగాను గ్రంథాలయమహోత్సవము అను పేరున సంవత్సరమున కొక వారము దినములు పండుగ దసరాలో జరుపుటకును, అపుడు సరస్వతీపూజ, గ్రంథాలయ భిక్షలు, ఉపన్యాసములు, ప్రదర్శనములు, ఊరేగింపులు జరుపవలెననియు ఆంధ్రదేశ గ్రంథాలయము లన్నిటిని ఈ సభవారు హెచ్చరించు చున్నారు.
3. ఇదివరలో 1926 వ సంవత్సరము లో వలెనే ఈ సంవత్సరం కూడా వ్యవధి చాలనందున ప్రభుత్వ విరాళములు పొందగోరు గ్రంథాలయములు రిజస్ట్రేషను అయి యుండవలెనని నిర్బంధమును తొలగించమని మద్రాసు ప్రభుత్యమువారి నీ సభవారు కోరుచున్నారు.
4. రిజస్ట్రేషను నిమిత్తము 1860 సం 21 నెంబరు చట్టము క్రింది చెల్లింపవలసిన ఫీజు రు 50 లను ప్రజోపయోగ సంస్థయగుటచేత ధర్మగ్రంథాలయములకు మినహాయింపు గావించవలసినదిగా ఇండియా ప్రభుత్వము వారిని ఈ సభవారు కోరుచున్నారు.
5 ఆంధ్రగ్రంథాలయోద్యమమును నూతన వికాసముతో, తేజోవంతముగ విజ్ఞాన ప్రచారము సల్పుటకుగాను ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమునకు శాఖలుగ వివిధ జిల్లాలయందును, తాలూకాలయందును సంఘములు ఏర్పడ వలయుననియును, స్థానిక సంస్థలు సహకార సంఘములు, పంచాయతులు, గ్రంథాలయములు, గ్రంథాలయాభిమానులు ఆ సంఘమునందు