గ్రంథముల చదువరుల అభివృద్ధి
“మెస్సాఛుసెట్సు" అను పట్టణమునందు గల న్యూటను ధర్మ గ్రంథాలయ మందు 1927 వత్సరమున 5,58,870 గ్రంథములు ఇండ్లకు తీసికొనిపోవు చదువరుల కియ్యబడినవి. 1928 సం॥రమున 6, 41, 211 గ్రంథములు చదువరుల కియ్యబడినవి. అనగా నూటికి 15 చొప్పున అభివృద్ధి జెందినవి. గతమూడు సం॥రములు అభివృద్ధియొక్క మొత్తము కంటె ఈ యేటి అభివృద్ధి సంఖ, ఎక్కువగ నున్నది. ఇవి గాక ఈ వత్సరమున 18,000 గ్రంథములు పాఠశాలల ద్వారా చదువరుల కియ్యబడినవి. ఈ సంఖ్యయందుగూడ నూటికి 50 వంతున అభివృద్ధి గనుబడుచున్నది.
డెలావేర్ జిల్లా (అమెరికా)
ఒక స్త్రీ యొక్క విరాళమువలన జిల్లా పట్టణమందుగల ధర్మ గ్రంథాలయమువారు జిల్లాయందున్న పల్లెటూళ్ళకు 1927 సంవత్సరము నుండియు గ్రంథములను పంపుచుండెను. గ్రంథాలయమునకు స్థానిక సంస్థలు విరాళము లిచ్చుటకు వీలులేకుండెను. ఇప్పుడు ఒక చట్టము చేయబడి, ఆగ్రంథాలయమునకు స్థానిక సంస్థలు విరాళము లిచ్చుటకు సావకాశము జేయబడెను.
తాడేపల్లిగూడెం తాలూకా బోర్డు వారు
లోకలు బోర్డులను గూర్చిన ప్రబోధము - పల్లెటూరి ప్రజల విధ్యుక్త ధర్మములు - అను పేరుతో ఈ బోర్డువారు ప్రకటించిన 3 చిన్నపొత్తములను వందనములతో నందికొంటిమి. వీనియందు ఆ బోర్డు వీస్తీర్ణము నందు గల పల్లెటూళ్లను గురించిన యావత్తు వివరములును విపులముగా విశదీకరింపబడి యున్నవి. ఇవిగాక తాలూకా బోర్డు వారు ప్రతివత్సరమును చేసినట్టియు, చేయబోవునట్టియు, పనులను గూర్చి గూడ వ్రాయబడి యున్నది. మరియు ఆయా గ్రామాదుల వారు వారి గ్రామాదులను గూర్చి తెలిపిన సంగతులు గూడ వివరింపబడి యున్నవి. ఈ తాలూకా బోర్డు వారు నూతన పథమును దొక్కి తాలూకాయందలి ప్రజలకు వారి హక్కులను గూర్చి బోధించు చున్నందులకు ఈబోర్డు అధ్యక్షులగు శ్రీ కలిదిండి గంగ రాజు గారిని అభినందించుచున్నారము.