రామ మోహన ధర్మపుస్తక భాండాగారము
(బెజవాడ) యొక్క పదునెనిమిదవ వార్షికోత్సవ సందర్భమున ఆహ్వానసంఘాధ్యక్షులగు
శ్రీ సూరి వేంకట నరసింహ శాస్త్రి గారిచే జదువబడినది. (23–3–29)
శ్రీ రామమోహన ధర్మపుస్తక భాండాగారము 1911 సం॥రం లో స్థాపింపబడెను. ఈసంస్థకు 1912 సం॥రంలో నేనధ్యక్షుడ నైతిని. అప్పటినుండి 1923 సం॥రము వరకు ప్రతిసంవత్సరము అధ్యక్షునిగా ఎన్నుకొనబడు చుంటిని. తిరిగి 1928 సం॥రంలో సభ్యులందరిచే సేక గ్రీవముగా నాపదవి కెన్నబడి, ఇప్పటి కాస్థానమందున్నాను. ఈమధ్యకాలములోకూడ నాకు యాజమాన్యము లేకపోయినను ఈ సంస్థతో నా కేదో విధమగు సంబంధముండియే యున్నది. కావున దీనినంతను పురస్కరించుకొని ఈ ప్రతిష్ఠాపన యొక్క జీవితములో ఇట్టితరి. ఈ సంస్థఎట్టి ఆదర్శములసంసిద్ధి కొరకు వర్థిల్లుచున్నదో, అవి ఎంతవరకు ఫలసిద్ధి నొందుచున్నవో, ముందు జరుగవలసిన కృషి యెట్టిదో, మన దేశమును చీకాకు పరచుచున్న సమస్యలను సమన్వయించుటయందు మా సంఘ మెట్టి స్థానము నలంకరించుచున్నదో మీకు విన్నవించుట ముఖ్యావసరమని నేను నమ్ముచున్నాను.
మనకు స్వరాజ్యము లభించిన వెంటనే తక్కిన సమస్యలన్నియు సమాధానమగునని మనలో చాలమంది తలంచుచు అందుకొరకె కృషి చేయుచున్నాము, ప్రజలలో నున్న మతభేదములును జాతి భేద ములును రూపుమాసినగాని మన దేశమునకు ముక్తిలేదని మన నాయకులు కొందరు వక్కాణించుచున్నారు. అన్నిటికన్న ప్రజల ఆర్థికస్థితి బాగుపడినగాని ఇతర యభివృద్ధికానేరదనియు అందుకు ముఖ్య సాధ