Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.7 (1929).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభను నిర్వహించిరి. సాయంకాలము ఆరు గంటలకు సభ పూర్తి యయ్యెను. ౧౯౧౯ వ సంవత్సరమునందు మద్రాసునందును, ౧౯౨౩ సంవత్సరమునందు కాకినాడ యందును జరిగిన సభలకు పిమ్మట ఈసారి కలకత్తా యందున జరిగిన సభ మిక్కిలి ప్రాముఖ్యత వహించెను. బెల్గాంనందు జరిగిన సభయును ౧౯౨౭ సంవత్సరమున మద్రాసు నందు జరిగిన సభయును కూడ వ్యవధి లేకుండ జరిగినవి. ఈయేడు సభ రెండుదినములు జరుపుట చేత, విషయము లన్నియు బాగుగ చర్చించి తీర్మానించుటకు వీలుగలిగెను. భారతవర్షముయొక్క అన్ని భాగములనుండియు పలువురు ప్రతినిధు లేతెంచిరి. మైసూరు, బరోడా, పుదుక్కోట, దర్భాంగా సంస్థానముల నుండియు, మహారాష్ట్ర గ్రంథాలయసంఘము, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము, మద్రాసు గ్రంథాలయసంఘముల నుండియు లక్నో, లాహెూరు, పాట్నా, అలహాబాదు, డక్కా, కలకత్తా, ఉస్మానియా విశ్వవిద్యాలయముల నుండియు పలువురు ప్రతినిధు లేతెంచిరి.

రాబోవు సభ లాహెూరు నందు జరుగును.



తీర్మానములు

1 దేశమునం దంతటను ధర్మగ్రంథాలయములను స్థాపించుటకు గాను శాసన నిర్మాణసభలు తగిన శాసనములను చేయవలయునని ఈసభవారు కోరుచున్నారు.

2 ధర్మ గ్రంథాలయములను బోషించుటకును అభివృద్ధి చేయుటకును స్థాపించుటకును రాష్ట్రీయ శాసన నిర్మాణసభలు, షరతులేమియు విధించకుండ, విరివిగ గ్రాంటుల నొసంగవలెనని ఈసభ వారు కోరుచున్నారు.

3 లోకలు బోర్డులును మునిసిపాలిటీలును తమ యాజమాన్యమున ధర్మ గ్రంథాలయములను స్థాపించి, పోషింపవలెనని ఈసభ వారు కోరుచున్నారు.