మహావీరుల వర్గంతులను సలుపుటవలనను, హరికథలు, భజనలు, ఊరేగింపులు చేయుట వలనను, కథలు చెప్పించుటవలనను, వీధినాటకముల ఆడించుటవలనను, ఆ దేశమందలి గ్రంథాలయములు ఈ యుద్యమమును వ్యాపింప జేయుచున్నవి. వారు స్త్రీలకు పిల్లలకును కూడ గ్రంథాలయముల నేర్పాటు జేసిరి. సంచార గ్రంథాలయములనుగూడ స్థాపించుటకు నిశ్చయించుకొనిరి.
మహారాష్ట్రధర్మ గ్రంథాలయ సంఘముయొక్క యాజమాన్యము క్రింద ఆ దేశమందీ యుద్యమము బాగుగనే పనిజేయుచున్నది. గ్రంథాలయములును పఠనమందిరములు గలసి 150 స్థాపింపబడినవి. అందు గ్రంథాలయములయందు చదువుకొన జాలని జనులకు పత్రికలను పుస్తకములను చదివి వినిపించెదరు. పూనా పట్టణ పారిశుద్ధ సంఘమువారు ఈసంఘమునకు సంవత్సరమునకు రు 1000 లు విరాళ మిచ్చుచున్నారు. ఈ సంఘము యొక్క ప్రోద్బలము చేతనే బొంబాయి పారిశుద్ధ సంఘసు వారు ఆపట్టణమందు ఆరు గ్రంథాలయములను రు 12,000 లు వ్యయము చేసి స్థాపించియున్నారు. ఇప్పుడు అందు ఒక్కొక్క గ్రంథాలయమునకు సంవత్సరమునకు రు 1,000 లు వ్యయము జేయుచున్నారు. ఇదిగాక బొంబాయిపట్టణమందు స్థాపింపబడు గ్రంథాలయములకు అవి ఖర్చు పెట్టు సొమ్మునందు సగముగాని మూడవవంతుగాని పారిశుద్ధ సంఘమునుండి ఇచ్చుటకు ఏర్పాటు చేయబడినది. మహారాష్ట్రముయొక్క ఇతర భాగములందు గూడ గ్రంథాలయోద్యమము బాగుగా అభివృద్ధి జెందుచున్నది.
వంగ దేశమందున్న పట్టణములందును, పల్లెలందును, అనేక గ్రంథాలయములును పఠనమందిరములును స్థాపింపబడుటకు మన యువకులే కారకులై యున్నారు.. కాని వారు పెద్దవారైనప్పుడు వారి యుత్సాహము సాధారణముగా తగ్గిపోవుచున్నది. ముందుసంతతి వారైన ఈపనిని కొనసాగించిన అవి అభివృద్ధిని బొందగలవు. లేనియెడల ఉత్సాహములేక అవి కృశింపగలవు. దేశమునందున్న గ్రంథాలయములన్నియు పరస్పర సహకారమును గలిగియుండుటయు, ఒక సంఘముగా నేర్పడుటయు అత్యంతావశ్యకము.