Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.6 (1928).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గణింపబడుచున్నవి. అక్కడనుండియే జ్ఞానసంబంధమైన నీతి సంబంధమైన ఆధ్యాత్మిక మైన సాంఘికమైన శరీర సంబంధమైన రాజకీయమైన అవియివి యన నేల అన్నింటికి సంబంధించిన ఉద్యమసుులును ఉద్భవించు ననియును వారి యాశయము. ఈ దేశమునందు ఆంగ్ల విద్యాన్యాపనముతో పట్టణములందును, పల్లెల యందును గ్రంథాలయములు వ్యాపింపదొడంగినవి. సర్వసామాన్యముగా ఈ గ్రంథాలయములు సభ్యుల నుండి, చందాలు వసూలు పరచుట మూలముగా నిర్వహింపబడు చున్నవి. ఇది స్వయం సహాయమునకు మంచి దృష్టాంతర మేను. కాని ద్రవ్యాభావము చేత, గ్రంథాలయముల పనులు వికసించుట లేదు. కొంతకాలమునకు అందరి అభిమానము తగ్గుచున్నది. మరికొంత కాలమునకు ఆగ్రంథాలయ స్థాపన చేసిన ఒక రిద్దరి యొక్క శక్తి పూర్తిగా నశింపుగా, గ్రంథాలయము నశించుచున్నది. అందుచేత ప్రతి మానవుడును, తాను జీవించి యున్నంత కాలమును తన జ్ఞానాభి వృద్ధిని జేసికొనుటకు గ్రంథాలయము తప్పని సరియని భావించి దాని యందు మోజు గలిగి యుండిననేగాని గ్రంథాలయము నిర్వహింపబడదు.

మన దేశమందు పిల్లలలో చాల కొద్దిమంది మాత్రము విద్యను పొందుచున్నారు. మన ప్రాథమిక పాఠశాలలో వారికి అబ్బువిద్య బహు స్వల్పము. ఆ స్వల్ప విద్యకు తోడు పిమ్మట చదువువలన వారి జ్ఞానాభివృద్ధి గానియెడల వారి చదువుమీద ఖర్చు పెట్టినది వృధాగా ఖర్చుపడినట్లేను. వారు జ్ఞానాభివృద్ధిని జేసికొనుటకు సార్వజనిక గ్రంథాలయములు మిక్కిలి సహాయభూతములుగ నుండును. ప్రపంచమునందున్న దేశములందన్నిటి యందును అమెరికా దేశమే గ్రంథాలయోద్యమాభివృద్ధి యందు మార్గదర్శకమై యొప్పియున్నది. ఆ దేశమునందు ముఖ్యమగు గ్రామములందెల్ల ధర్మగ్రంథాలయములు స్థాపింపబడి యున్నవి. ఇంతేగాక, జీవనోపాధికిగూడ తంటాలు పడుచుండెడు కటికి బీద వానికిగూడ గ్రంధములు అందుబాటులో నుండుటకుగాను మిక్కిలి చిన్న వగు పల్లెలకు గూడ సంచార గ్రంథాలయము పేటికల నంపెదరు.