అమెరికా సంయుక్త రాష్ట్రములందు గ్రంథాలయోద్యమ విషయమున పాటుబడుటకు మొదటిది ఈ రాష్ట్రమేను. ఈ రాష్ట్రము నందున్న “డిటోయిట్" పట్టణమున ౧౮౧౭ సంవత్సరమున విశ్వవిద్యాలయ స్థావనతో బాటుగ ప్రథమ గ్రంథాలయము స్థాపింపబడెను. పిమ్మట ౧౮౨౮ వసంవత్సరమున రాష్ట్ర కేంద్ర గ్రంధాలయము స్థాపింపబడెను. ౧౮౩౫ సంవత్సరమునం దారాష్ట్రమువారు తమ దేశమందున్న పట్టణములయం దన్నింటియందును ధర్మ గ్రంథాలయములను స్థాపింపవలెనని శాసనము గావించిరి.
నేడు ఆ రాష్ట్రమునందు, కాలేజీ గ్రంథాలయములును విశ్వ విద్యాలయ గ్రంథాలయములును గాక, ప్రత్యేకము ధర్మ గ్రంథాలయములే ౨౧౯ గలవు. ప్రథమమునందు ఈగ్రంథాలయములన్నియు చందాలవలననో, సంఘముల వలననో, వ్యక్తుల వలననో స్థాపింపబడినవే యైనప్పటికిని, క్రమముగా ప్రత్యేకము పన్ను విధింపబడి, అందుండి పోషింపబడుచున్నవి. ఇవిగాక రాష్ట్రమునందెల్లెడల గ్రామము లందును పట్టణము లందును చిన్న చిన్న గ్రంథాలయము లెన్నియో వ్యక్తులవలనను, చందాలవలనను పోషింపబడుచున్నవి గలవు. అవియన్నియు క్రమముగా పన్నులయొక్క పోషణకిందకు వచ్చుచున్నవి.
ఈ రాష్ట్రమునందలి గ్రంథాలయములన్నియు ముఖ్యముగా చిన్న చిన్న గ్రంథాలయము లైయున్నవి; ఒకలక్ష కంటే యెక్కువ జనాభా గలిగిన నగరములందున్న గ్రంథాలయములు మూడింటికన్న ఎక్కువలేవు. పదివేలు మొదలు ఒక లక్ష వరకు జనాభాగలిగిన పట్టణములందున్న గ్రంథాలయములు ముప్పదియెనిమిది మాత్రమేను. అయిదు వేలు మొదలు పది వేలు జనాభాగలిగిన గ్రామములందున్న గ్రంథాలయములు ఇరువదియెనిమిది. అయిదువేల కంటే తక్కువ జనాభాగలిగిన గ్రామములందున్న గ్రంథాలయములు నూటనలువదితొమ్మిది. పెద్దగ్రంథాలయములు మూడింటిలో “డెట్రోయిట్" పట్టణ గ్రంథాలయమునందు ౭,౩౨,౭౩౪ గ్రంథములు గలవు; “గ్రాండురాపిడ్సు” పట్టణ గ్రంథాలయమందు ౨,౭౫,౬౯౮ గ్రంథ