యందలి శ్రీకృష్ణ దేవరాయ గ్రంథనిలయము కనులు మూసి తెరచుచున్నదట. మడకసిరాలోని వెనుకటి సరస్వతీవుస్తక భాండాగారము దీర్ఘనిద్రను బొందినది. ఈవల వెలసిన రవీంద్రుని పఠనాలయ మివుడివుడు తన నవీనోత్సాహము బ్రకటించుచుండుట గమనించుచున్నారము. ప్రజాసమితి కత్యంతోపయోగకరములగునీ భాండాగారము లిటు లధోగతినందుటకు బౌరులలో వైషమ్యములు ప్రబలుటయు కార్యకరులయందు మాత్సర్యములు రేగుటయు గ్రంథాలయముల స్థిర ప్రతిష్ఠకు దగిన యాధారములు లేక పోవుటయు గారణములు కావచ్చును. పైన బేర్కొనిన యుత్కృష్టాదర్శముల ననుసరించి సక్రమపథమున నడచుచు రాయలసీమయందెల్ల నద్వితీయమగు స్థానము వహించియుండిన ధర్మవరమునందలి రెండుగ్రంథాలయముల గతియేమైనదో?కోటలోనినిలయము కోన యూపిరితో నున్నదనియు బేటలోనిది రూపు చెడి నశింపనున్నదనియు వినికిడి. ఇందులకు ధర్మవరపౌరులుగాక మరెవ్వరు బాధ్యులు? ఈగ్రంథాలయముల పూర్వస్థితి నూహించి యిప్పటి పతితదశను గూర్చి యోజించుచో పౌరులు కనులు మూసికొని పోయిరాయను నంతటివిచార మెట్టివారికైన గలుగకమానదు. నేను ముఖ్యముగ నందలి పేట గ్రంథాలయ (క్రియ శక్తి) పతనదశను మదినుంచుకొనియే మనవి చేయుచున్నాడను. ధనాఢ్యులైన వైశ్యయువకుల హ స్తవశ మొనర్పబడిన యీ భాషానిలయమున కింతటి యధోగతిగల్గెననిన నెంత సిగ్గుల చేటు !
— సీరిపి ఆంజనేయులు (ఐంద్రావతి)
శ్రీరామచంద్ర బాలభక్త పుస్తక భాండాగారము, కొణకంచి
ఈ గ్రంథాలయముయొక్క పదమూడవవారికోత్సవము 2-6-1929 తేదీన శ్రీరాజా వాసిరెడ్డి దుర్గాసదాశి వేశ్వర ప్రసాద్, బహద్దర్, మన్నెసుల్తాను జయంతిపురం జమీందారుగారి అధ్యక్షతక్రింద జయప్రదముగ జరిగెను.