గ్రంథాలయాదర్శము
కుక్కునూరునందున్న దేశోద్ధారక ఆంధ్రభాషానిలయ వార్షికోత్సవ సందర్భమున
శ్రీ చెరుకుపల్లి బుచ్చి రామయ్య గారిచే నొసంగబడిన అధ్యక్షోపన్యాసము
పూర్వకాలమున మన దేశమందంతటను విద్యావ్యాపకము ఆచార్యులవలనను అంతేవాసులమూలమునను జరుగుచుండెడిది. అట్టి యాచార్యులున్నచో వేరే గ్రంథాలయావశ్యకతయే లేదు. ఆచార్యులే చరమరూపమున నుండు గ్రంథాలయము లనవచ్చును. అనేక గ్రంథములను ఆచార్యులు ధారణజేసి యుండెడివారు. ఏ విషయము కావలసియున్నను వారివలన వినవచ్చును. వేద వేదాంగములు మొదలు సమస్త గ్రంథములలో నుండు విషయములు వారి ముఖమున తెలియ నవకాశము లుండెడివి. కావున అట్టి యాచార్యులను పోషించి వారి సపర్యల జేయుట గ్రామస్థుల విధ్యుక్త ధర్మమని యెంచెడివారు. అట్టి యాచార్యు లుండు కాలమున ఆచార్యగృహమే విద్యాలయము. ఆచార్యులే గ్రంథాలయము, అంతేవాసులే విద్యార్థులు. ఇంటివారలందరు గృహకృత్యములైన తరువాత నొకచో కూర్చుండి ఇహపర సుఖసాధనముల గూర్చి ముచ్చటించు చుండెడివారు. లేదా పురాణములు పఠించెడివారు. అవియే సభలు. ఇందు స్త్రీలు పురుషులు పాల్గొను