మామూలుగా అందరు సభాధ్యక్షులకు ఆచారమై నట్లు అచ్చునుండి మీకు ఉపన్యాసమును నేను చదువకుండినందుకు కొంత సమాధానము చెప్పవలసియున్నది. హావభావ విలాసములతో కూడి నా యెదుట ప్రత్యక్షముగానున్న సభ్యులతో నేను ముచ్చటించుగును గాని వారి మమోభావములు ఇట్లుండవచ్చునని ముందుగా నామనోఫలకమున చిత్రించుకొని వారిపక్షమున నాయుపన్యాసమును సిద్ధపరచు నాచారము నాకు సరిపడదు. వర్తమానకాలపు నవనాగరికపుస్త్రీ తాను కల్పించుకొన్న ఇతరవ్యావృత్తులచే నియమిత కాలముల యందు మాత్రము శిశువువకు స్తన్యమునిచ్చు అస్వాభావికపు పద్ధతి? యదలంబించవచ్చును గాని శిశు సందర్శన మాత్రముననే స్తన్యము స్రవించుటయే స్వాభావికము. వివిధ స్వభావములుగల సభ్యులు పరిషత్తులయందురు గాన వారివారి రుచుల వైచిత్ర్యమును వక్త అనుసరించ వలెను. కావున ఆశువుగా ఉపన్యసించినందుకు నన్ను మన్నించవలెను.
కేవల రాజకీయములు కాని ఇతర సభలంలో నేను జోక్యము గల్గ చేసుకొనుటకు కారణమును ఇప్పుడు చెప్పియుంటిని, మానవజీవితము ప్రభిన్నమైనదని వాదము నేనంగీకరించను. ఈ రెండు సంవత్సరములనుండియు ఇతర సాధనముల మూలమున దేశాభ్యుదయము పొందు మార్గముల ననుసరించుటకంటే రాజకీయ వ్యవహారముల యందే దేశనాయకులు నిమగ్నులై యుండిరి. జాతీయాభ్యుదయము పొందుటకు ప్రధమమున రాజకీయ సమస్యలకు సమాధానము కుదుర్చుట అత్యావశ్యకమే యైనను హిందూదేశము యొక్క ప్రత్యేక పరిస్థితులను బట్టి సాంఘిక, విద్యావిషయి జోద్యమములు జయప్రదముగా కొనసాగించుచు రాజకీయోద్యమము కొంతకాలమువరకు వెనుకకు నెట్టుట మనకు నావశ్యకమైనది. కావుననే నేను జయిలునుండి బయటకు వచ్చినప్పటి నుండియు సాంఘికశృంఖలములను సడల్పుటకే నేను కృషిచేయుచుంటిని. మహాత్ముడు నిర్మాణకార్యక్రమమున అస్పృశ్యతా నివారణకును దౌర్జన్య రాహిత్యమునకును ప్రాఖ్యత నిచ్చుటయందలి ఉద్దేశము, సాంఘిక రాజకీయ క్షేత్రములయందు తీవ్రమగు కృషి జరుపవలెనని ప్రజలను పురికొల్పుటకే యని నేనూహించుచున్నారు. గ్రంథాలయోద్యమము మఖ్యముగా విద్యావిషయికమైనది గనుక దానిని మనముచేపట్టి భారత జాత్యభ్యుదయము కొరకు ఈ యుద్యమము ఎంతవరకు సాధనభూతము కాగలదో అంతవరకు అందుమూలమున మనము సంపూర్ణముగ లాభము పొందవలసియున్నది. ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమమునకు మూలపురుషులగు మ.రా.రా.శ్రీ అయ్యంకి వెంకట రమణయ్య గారు ఈ సభాధ్యక్షపదవి నధిష్టించవలసినదని నన్ను కోరినపుడు నేను ఆకోరికను సంతోషముతో స్వీకరించితిని. ఈయుద్యమము యొక్క ఆంతరంగిక మగు వ్యవహారములు నాకు తెలియవుగాని మహాత్ములు స్థాపించిన జాతీయోద్యమము యొక్క జయము చాల వరకు ఈ యుద్యమమూలమున చేగురినని నేనెరుగుదురు. ప్రతిగంథాలయపు అధ్యక్షుడును కార్యదర్శయు గాంధిరాజ్యపు మునసబ్బు గాని కరణముగా గానిమానెను. ఈ రెండు సంవత్సరములలో ఆంధ్రప్రదేశ మందలి చాల గ్రామములయందు నేను సంచారము చేసి యుంటిని. అప్పుడు ప్రతి గ్రంథాలయమును ఈమహదువ్యమమును ప్రజ్వలింపజేయు కార్యక్షేత్రమై ప్రాముఖ్యత వహించి యుండెను. ఈ యుద్యమములో కొంత నిజాతియత లీనమై యున్నమాట నిజమే యైనను దీని మూలమున దేశాభ్యుదయమునకు కల్గిన బలమును బట్టి ఇందును గూర్చి మనము కృతజ్ఞులమై యుండవలసి యున్నది.
ప్రధమ అఖిలభారత గ్రంథాలయసభ చెన్నపట్టణములో జరిగినపుడు గ్రంథాలయోద్యమము జాతీయ ప్రతిష్టాపనమేనా యనునంశము గూర్చి తీవ్రమగు చర్చ జరిగింది. అపుడు సభాధ్యక్షులగు కుడల్కాగుగారు ఆయన పదవినిబట్టి ఆయనకు అదనముగాగల వోటు నిచ్చుటచే ఈ యుద్యమము విజాతీయమని నిర్దారణకాకుండ తప్పించిరి. అప్పటినుండియు నీవిషయమై పత్రికాముఖమున గాని సభలలో గాని చర్చ జరుగలేదు. కడచిన పదిసంవత్సరములనుండియు ఉద్యమ చరిత్రను మనము పరిశీలించితిమేని ఇందు లీనమైన విజాతీయ స్వభావమును పోగొట్టుకొనుటకును జాతీయ ప్రతిష్టాపనగా దీనిని నిర్మాణము చేయుటకును మనజాతీ యాంతరాత్మ చేసినకృషి మనకు బోధపడక మానదు. ఒక గ్రంథాలయము కుస్తీపట్లు, కత్తిసాముకు ప్రాముఖ్యత నిచ్చుచున్నది. ఇంకొకటి గ్రంధప్రకటన కార్యము నవలంబించు చున్నది. కొన్ని గ్రంథాలయములు సంగీతము మొదలగు లలితకళల యభివృద్ధికొరకు కృషిచేయు చున్నవి. ఇంకొకటి స్వచ్ఛంద భటులను లేక రామదండును తయారు చేయుచున్నది. మరియొకటి వడుకు నూలు ఉద్యమమును వ్యాప్తి నొందించుచున్నది. కొన్ని