Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.8 (1925).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జనులకు ముందు చదువుకొనుటకు రుచిని గలిగింపవలెను. దానిని దోహదము చేయవలెను. ఆమూలకమున ప్రధాన నగరము అందును పల్లెలయందును గ్రామ గ్రంథాలయములేగాక జిల్లాలు నాలుగింటి యందును జిల్లా గ్రంథాలయములను కూడ సాపింపవలెను. ఇట్టి మహత్తరమైన పనియందు బోర్థనుకు మన కథానాయకుడు కుడి భుజమైయుండి విశేషముగ తోడ్పడెను.

1913 సంవత్సరము నందు మహరాజుగారి ఆజ్ఞానుసారము కుడల్కారు గారు ఐరోపా, అమెరికా, జపాను దేశములను దర్శించి ఆయా దేశములందు పని చేయుచున్న గ్రంథాలయముల పద్దతులకు విపులముగా దెలిసికొని వచ్చిరి. వారు ముఖ్యముగా తమ యాత్రయందు విశేషకాలము అమెరికా దేశముందే గడపిరి. ఇతర దేశముల కన్న ఆదేశమునందే గ్రంధాయ వ్యాపన విషయమైన సంగతులు విశేషముగా నేర్వవలసినవి గలవని వారు కని పెట్టిరి. వారు 1915 సంవత్సవమున బరోడాకు తిరిగి వచ్చిన వెంటనే, బోడ్డను దొరగారి స్థానమందు గ్రంథాలయశాఖకు అధిపతిగా నియమింపబడిరి. మహారాజాగారు వీరియందుంచిన గౌరవమును వీరు సార్థక పరిచిరి. వీరు ఈ ఈయుద్యమమునకై చేసిన కృషి వలన సంస్థానము యొక్కయు, మహారాజుయొక్కయు కీర్తి భారతవర్షమునందే గాక, పాశ్చాత్య దేశముల యందుగూడ వ్యాపించినది.

పాశ్చాత్య దేశములందును, అందు ముఖ్యముగా ఆమెరికా దేశమందుకు గ్రంధాలయములు జనులను ఆకర్షించుటకు జేయు ప్రకటన పద్ధతులయొక్క ఉపయోగమును గ్రహించినవారై కుడాల్కారుగారు వానిలో చాల భాగము బరోడాయందు అమలునకు దెచ్చిరి.

కుడాల్కరుగారు ఉత్సాహవంతులును, కార్యదీక్ష గలవారును నగు యువకులు. పత్రికా ప్రదర్శనములను, గ్రంధాలయ ప్రదర్శనములకు, సంగీత ప్రదర్శనములను — ఎన్నింటినొ సమావేశపరచి, గ్రంధాలయోద్యమమందు జనులకు ఎక్కువ ఉత్సాహము. గలుగునటుల జేసిరి.

బరోడా కేంద్ర గ్రంథాలయ పక్షమున అపూర్వ సంస్కృత గ్రంథ ప్రకటనమునకు ఒక గ్రంథమాలను గూడ ప్రారంభింప జేసిరి. గ్రంథాలయ శాస్త్రవిషయములను ప్రకటించుటకై “లైబ్రరీ మిసలేనీ” అనుపత్రికను మిక్కిలి సమస్థితితో ప్రకటించిరి. భారతవర్షమందు ఈవిషయమై ప్రకటింపబడు పత్రిక ఇది యొక్కటియే. ఈ పత్రిక యొక్క ఉత్కృష్టతను గూర్చి ఐరోపా అమెరికా దేశములందలి గ్రంథాలయ పత్రికలఁగూడ మెచ్చుకొనినవి. భారత వర్షమునందు గ్రంథాలయోద్యమునును వ్యాపింప జేయుటకు ఈ పత్రిక మిక్కిలి సహకారి యయ్యెను.

కుడాల్కను గారు మహారాష్ట్ర భాషయందు విద్వాసుడు. ఆభాషయందలి పత్రికలకు తరుచు వ్యాసములను వాయుచుండెను. 1917 సంవత్సరమున ఇండోరు నగరమున జరిగిన తొమ్మిదవ మహారాష్ట్ర సారస్వత మహాసభయందు వీరు “చిన్న పిల్లలకు సారస్వతము" అను విషయమును గూర్చి వ్యాసము నొక దానిని జదివిరి. ఆవ్యాసము చాల మెప్పునుబడను.

ఆవ్యాసమును విని ఆనందించి, ఆసభకు వచ్చిన వారిలోనొకరు దానిని తిరిగి అచ్చువేయించి ఉచితముగా పంది పెట్టించిరి. 1919 సంవత్సరమున పునహా నగరమున జరిగిన "ఓరియఁటల్ కాన్ఫరెన్సు" నకు వీరు బరోడా రాజ్య ప్రతినిధిగ పోయిరి. 1919 సంవత్సరమున అప్పుడు వైస్రాయిగా నుఁడిన లార్డు ఛెల్ మ్సుఫోర్డుగారు బరోడా వచ్చునప్పటికీ, “బరోడా గ్రంథాలయోద్యమము” అను చక్కని గ్రంథమును వారుతయారు జేసిరి.

కుడాల్కరుగారు గ్రంథాలయోద్యమమునకై చేసిన కృషికి ఫలితముగ, 1919 సంవత్సరమున మద్రాసు నందు జరిగిన ప్రథమ అఖిలభారత గ్రంథాలయ మహాసభకు అధ్యక్షులుగ ఎన్నుకోబడిరి.

వారికిగల ఉత్సాహమునకు అంతులేదు. గ్రంథాలయ ఉద్యమమును వ్యాపింపజేయుటకు తగిన మార్గములను అన్వేషించుటకై వారు ఎల్లప్పుడును యోచించచునేయుందురు ఇట్టి మహనీయుడు విషజ్వరముచే బాధితుడై ముప్పదితొమ్మిది సంవత్సరములు నిండక పూర్వమే, 1921 సంవత్సరమున పరమపదించి యుద్యమమునకు తీరని నష్టమును దెచ్చెను. వీరికి భార్య, పుత్రుడు, ఇద్దరు పుత్రికలు గలరు.