Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.6 (1925).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారతవర్షమునందలి ప్రాచీన సరస్వతీభాండారములు

౧. భారతవర్షము యొక్క యైశ్వర్యము

అనేక శతాబ్దములనుండియు భారతవర్షము యొక్క యైశ్వర్యముచే నితర దేశములవా రనేకు లాకర్షింప బడుచుండుట మన కందఱకును దెలిసిన విషయమే. సోమనాథు, ఢిల్లీ మున్నగు పురములనుండి అమితమగు ధనమును తమ దేశములకుఁ గొనిపోయిన సుల్తాను మహమ్మదు, నాదిర్ షాలను గూర్చియు, దక్షిణ హిందూ దేశ దేవాలయములందు పొతిబెట్టబడియున్న మితి లేని ఐశ్వర్యమును గూర్చియు మనము వినుచున్నాము గాని భారతవర్షమునుండి సంస్కృత వ్రాత గ్రంథములను, గొంపోయి అరబ్బీభాషయందు వ్రాసి మన శాస్త్రములును, గాధలను ఐరోపాయందున్న జాతుల యందు ప్రబలుటకు సహాయభూతులెన "బాగ్దాదు” "ఖాళీఫ్" లను గూర్చి గాని అనేక గ్రంథముల యొక్క వ్రాతప్రతులచే నింపఁబడి మన పూర్వీకులచేఁ ప్రతిష్ఠిఁపఁబడిన భారతీ భాండాగారమును గూర్చి గాని సరస్వతీ భాండాగారములను గూర్చిగాని మనము వినుచుఁడుట లేదు.

భారతవర్షముయొక్క వర్తకమును తమ స్వాధీనము నందుచుకొనవలెనని పాశ్చాత్య దేశములు పెనగులాడుటకు కారణభూతఁబులైన బంగారు, వెండి, వజ్రవైడూర్య, మరకత మాణిక్యాదులతో గాని, పట్టుశేల్లాలు, ఉన్ని శాలువలతో గాని, ఇతర సంభారము మన దేశము యొక్క మైశ్వర్యము సంపూర్ణముగాదు. ముఖ్యముగా సారస్వతమునందును కళలయందును, ఆధ్యాత్మికజ్ఞానమునందును, మన యైశ్వర్యము సంపూర్ణముగ విజృంభించి యున్నది. ఈయాధ్యాత్మిక యైశ్వర్యముచే గూడ, దూరదేశస్తులు నేకులాకర్షింపబడి యుండిరి; అట్టివారి నామములు చరిత్ర యందు మనకు లభింపకపోయినప్పటికిని భారతవర్షము నందు వారు సంపాదించిన అమూల్యవంతంబగు జ్ఞానైశ్వర్యముచే ప్రపంచమునందలి చింతనలన్నియు ఐశ్వర్యవంతములై యున్నవని జెప్పుట కెంతమాత్రమును సందియము లేదు.

౨ భారతవర్షమునిందలి ప్రాచీన భాండారములు

అచ్చువేయుటకు సౌకర్యములు లేని ప్రాచీనకాలము నందు గ్ర౦థ భాండాగారముల నేర్పరచుటకు జనులెంత శ్రమపడియుండిరో యూహించుటకైన నలవి గాదు. వాటిని నేర్పఱచినవారికి విద్యాభివృద్ధియందు గల ఆసక్తియు, భక్తియు వర్ణనాతీతములు. ఆరిందా యగు నొక ముసద్దీ చిన్న గ్రంథమైనచో కొన్ని నెలలను, పెద్ద గ్రంధమైనచో కొన్ని సంవత్సరములును తదేకనిష్ఠతో కష్టపడి వ్రాసినఁ గాని తయారు గాదు. అట్టి స్థితియందు కొన్ని వేల గ్రంథముల నొకచోటఁ గూర్చుట కెంతమంది మనుష్యులు యెన్ని సంవత్సరములు శ్రమపడవలసియుండునో యూహించుటకైన వలవి కాదు. ఇప్పుడన్నమో, దివ్యమైన భవనము నొకదానిని సంపాదించి, అందు కొన్ని వేల గ్రంథముల నొకసారియే కొనిపెట్టిన, అది గొప్ప గ్రంథాగార మగుచున్నది. ఇతర ప్రతిష్టాపనలవలెనే గ్రంథాగారమును నిర్మించుటగూడ ఆకాలమునందు కార్యపరతంత్రులగు మహాపురుషులు వలన మాత్రమే నెరవేఱుచుండెడిది. లిఖితగ్రంథమునకు నకు ప్రతిదాని చివరను, “యదృష్టం తల్లిఖితమ్ ” అను వాక్యమును వ్రాసి గ్రంథమును ముగింపునకు దెచ్చుచుండిరి. ఆనగా ఎట్లు చూచితిరో అట్లే వ్రాసితినని యర్ధము. ఇట్టి కష్టములకులోనై మన పూర్వీకులు భారతవర్షము నందంతటను ప్రతిష్ఠించిన గ్రంథాలయములను గుఱించి కొంచెము తెలిసికొందము.

వివిధ విషయములు

గోదావరిజిల్లా ఆలమూరు గ్రామమందు "కొ ఆపరేటివు యూనియ౯" తరఫున పఠనమందిరము 3-12-24 తేదీన తెరువబడినవి. శ్రీ నరసింహ దేవరి సత్యనారాయణ గారు పఠన మంది రావశ్యకతను గూర్చి ఉపన్యనించిరి. అందరును సభ్యులుగ చేరి చందాలు వేసిరి. ప్రాముఖ్యమగు వార్తాపత్రిక లెల్ల తెప్పింపబడుచున్నవి. సహకారాదర్శములను, సహకారభావములకు, విరివిగా వేదజల్లుటయును, గ్రామవాసులలో పరస్పర సహాయము, సానుభూతి, సోదరభావము పెంపొందించుటయును దేశ పరిస్థితులను తెలియ జేయుటయును ఈ పఠనమందిరము యొక్క ముఖ్యోద్దేశ్యములు.