Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.5 (1924).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాయక్వారుగారిని అనుకరించి తమతమ దేశములందు నిరక్షరకుక్షుల సంఖ్యను తగ్గించి ప్రజలయందు జ్ఞానాభిలాషను అభివృద్ధి జెందించుచున్నారు. అక్కడ ప్రజలకును రాజులకును విరుద్ధప్రయోజనములేదు. కావున మనకు ఆంతరాయములుగానున్న కొన్ని ప్రతిబంధకములు వారికి లేకుండుటచే అచ్చట ఈ ముద్యమము ఎక్కువనుకరముగా వ్యాప్తి జెందుటకు సావకాశములున్నవి.

ఆంధ్ర దేశమున బెజవాడపట్టణము గ్రంథాలయోద్యమమును అభివృద్ధికి దెచ్చుటకు నిరంతర కృషి సలుపు చున్నది. మద్రాసునందు జరిగిన ప్రథమ అఖిల భారత గ్రంథాలయ సభయందు ఆంధ్ర దేశమున ఇందునుగూర్చి చేయబడుచున్న కృషియు, అందు ముఖ్యముగ శ్రీ సూరి వేంకట నరసింహశాస్త్రి గారి దేశసేవయు, మిక్కిలి పొగర్తను గాంచినవి.

దేశమునకు పల్లెలు పునాది. కావున పల్లెటూరు గ్రంధాలయములనుగూర్చి ఎక్కువ కృషి చేయవలసి యున్నది. స్థానిక స్వపరిపాలక సంఘములు తమవిధ్యుక్తమగు ఈ పనిని నెరవేర్చినచో అంతయు సులువుగానే యుండును. ఈ గ్రంథాలయముల అభివృద్ధిమీదనే స్వపరిపాలక సంఘములు అభివృద్ధిగూడ ఆధారపడియున్నది. ప్రజా సామాన్యము విద్యావంతులు కానియెడల తగిన ప్రతినిధులు ఈసంఘములకు ఎన్నుకొనబడరు. వోటర్లు అజ్ఞానులైనచో ఈ సంఘములు కూడ నిరర్థకములుగానే యుండును.

మూడునాలుగు గ్రామముల వారు చేరి చందాలు వేసికొని, చిన్న గ్రంథాలయమును స్థాపించుకొనవచ్చును. ఇందుకు ముఖ్యముగా అచ్చటి విద్యావంతులు శ్రద్ధ తీసికొనవలెను. వీలైనయెడల నెలసరిజీత మిచ్చిగాని, వార్షికముగా ధాన్యము నిచ్చిగాని, ఒక గ్రంథభాండాగారికుని నియమించుట ఉచితము. కొద్దికాలము క్రిందటివరకు ఈపద్దతిని అవలంబించి ఉపాధ్యాయులు నియమింపబడు చుండిరి. అప్పటివారు ఇప్పటివారి కంటె ఎక్కువ సమర్థులైయుండిరి. వీలైనంతవరకు దేశభాషయందు ప్రచురింపబడు పత్రికలను తెప్పించి పఠన మందిరమును గూడ స్థాపింపవలెను. స్థానిక పాఠశాల ఉపాధ్యాయుల సాహాయముతో ప్రజలను జ్ఞానవంతులుగా జేయుటకు గ్రంథాలయములును, పఠన మందిరములును ఎన్నియోవిధముల ఉపకరింపగలవు. పాటకపుజనుల ఉపయోగము కొరకు రాత్రిపాఠశాలలు స్థాపించవలయును. ప్రకృతిశాస్త్ర రహస్యములను వెలిబుచ్చుటకును, వర్తమానపరిస్థితులను దెలుపుటకును, తరుచు ఉపన్యాసములను జరుపుచుండవలయును. ఈ సంస్థలకు అనుబంధముగ పంచాయతీకోర్టుల నేర్పరచి వ్యాజ్యముల సంఖ్య తగ్గింపవలెను. పల్లెటూళ్ల గ్రంథాలయములు అచ్చటచ్చటి ప్రజలకు చేయగల మహోపకారములు అనంతములు. స్థానికులకు దేశాభిమానుల కార్యదీక్ష ఎంతవరకు విజృంభించిన ఈ సంస్థలవలన సంస్థలవలన కలిగెడి లాభము అంతయెక్కువగా వృద్ధి జెందగలదు. ఇట్లు ప్రవర్తించినచో గృహకల్లోలములు, పల్లెటూళ్ళ తగాయిదాలు రచ్చకెక్కినగాని తీరవను తగవులు కూడ అనుకూలముగ పరిసమాప్తి నొందగలవు. పురాణకాలక్షేపములు, హరికధలుకూడ గ్రంథాలయముల యాజమాన్యమున జరుపవచ్చును.

ఈ విధముగ ఒక జిల్లాయందు స్థాపింపబడిన గ్రంథాలయములన్నియు చేరి, జిల్లా గ్రంథాలయమును నిర్మాణముచేసి దానికి అనుబంధముగా చేరవచ్చును. అవసరమైనచో ఒకేజిల్లాయందు రెండు మూడు కేంద్ర గ్రంథాలయములు కూడ ఉండవచ్చును. ఈజిల్లా గ్రంథాలయములు స్థానికముగా చేయవలసిన పనియేగాక, జిల్లాయందలి గ్రంథాలయములన్నింటిని అన్యోన్యాశ్రయములుగజేసి, అన్ని సంస్థలు చేయుపనిని ఏకముఖమునకు ప్రసరించనట్లు చేయవలయును. దేశాభిమానులగు లక్ష్మీపుత్రులును, భూస్వాములును, దేవాలయ ధర్మకర్తలును, దేవాదాయ ధర్మకర్తలునుకూడ ఈ ఉద్యమమునకు సహాయము చేయునట్లు వారలను ప్రార్థించవలయును. ధనసంపత్తి యున్నచో మాజిక్కులాంతరు సహాయమున ప్రజలకు జ్ఞానాభివృద్ధి చేయుటకు సంచారప్రవర్తకుల నేర్పరచవచ్చును. ఆరోగ్యము, రాజకీయపరిస్థితులు మొదలగు విషయములనుగూర్చి సులభశైలిని కరపత్రములు ప్రచురించి గ్రంథాలయముల మూలమున మన దేశమును వ్యాపింపజేయవలయును. ఈ జిల్లా గ్రంథాలయములపైన రాష్ట్రముల రాజధాని పట్టణములందు స్థాపింపబడెడు రాష్ట్రీయ గ్రంథాలయము లుండవలెను. ఈ రాష్ట్రములన్నియు భాషాప్రయుక్తముగా నుండవలయును. ఈ రాష్ట్రీయ గ్రంథాలయములు రాష్ట్రభాషయందు కరపత్రములను ప్రచురించవలెను. ఇంగ్లీషునందుండు అమూల్యములగు గ్రంథములు కొన్నింటిని తర్జుమా చేయించి సరసమగు ధరలకు గ్రంథాలయములకు పంచిపెట్టులు ఉచితము.