మనయదృష్టవశమున రాబోవు డిశంబరులో యాంధ్ర దేశమున కాకినాడ పట్టణములో దేశీయమహాసభ సమావేశము కానున్నది. ఆసందర్భమున ఆంధ్రగ్రంథాలయోద్యమ ప్రచారకులందరును పూనుకొని రెండవ అఖిలభారతసభను సమావేశము చేయుట ముఖ్య కర్తవ్యము. ఇట్టి సూచనలు ఇదివరకే ఆంధ్ర గ్రంథాలయ సంఘమునకు వచ్చుచున్నవి. గ్రంథాలయోద్యమము యొక్క ప్రాముఖ్యత భారతదేశమందంతటను దశదిశలను, అంగీకరించబడియే యున్నది. గడచిన సంచికలో ఈయుద్యమము దేశమంతటను వ్యాపింప చేయుటకు దర్భాంగా సంస్థాన భాండాగారికులను గుహఠాకూరుగారు చేసిన సూచనలు ముద్రించియుంటిమి. గయలో జరిగిన జాతీయమహా సభతో పాటు అఖిలభారత గ్రంథాలయసభ జరుపవలెనని ప్రయత్నములు జరిగినవి. కాని అట్టి సభ సమావేశము కాలేదు. దేశమందఁతటను నూతన గ్రంథలయములు వెలువడుచున్నవి. ఇదివర కేర్పడియున్న సంస్థాపనలు చేయుచున్న కృషినిగూర్చియు, పత్రికా ముఖమును తెలుసుకొనుచున్నాము. ఇట్లు పలు ప్రదేశముల జరుగుచున్న పనిని ఏక ముఖమునకు తెచ్చి భారత దేశమందలి గ్రంథభాండాగారులు ఏకత్ర సమావేశమై తమ కర్తవ్యమును నిర్ణయించుకొనుట అవసరముగ చేయతగినపని. అఖిలభారతసభ మద్రాసుపట్టణమున జరిగినపుడు అఖిలభారత గ్రంథాలయసంఘ మొకటి నిర్మాణముచేయుటకు తీర్మానింపబడినది. అందుకొరకై చిత్తు చట్టములు వ్రాయబడి, అభిప్రాయముకొరకు పంపబడినవి. పిమ్మట అట్టి సంఘము నిర్మాణమైనట్లు ఊహించతగియున్నది. ఈ సంఘమునకు మద్రాసు నారాయణ మొదలివీధిలో వసంత గ్రంథాలయమునకు సంబంధముగల ఎన్.ఎన్. రాయనుగారు తాత్కాలిక కార్యదర్శి. వీరీ సంఘమును పునురుద్ధారణ చేయుటకు ప్రార్థితులు. ఆంధ్రగ్రంథాలయోద్యమాభిమానులందరును తమ విధులను గుర్తెరిగి కాకినాడ యందు అఖిలభారతసభను సమావేశపరిచి జయప్రదముగా నొనరించుటకు కోరుచున్నాము.
హిందూయువజనగ్రంధాలయము - ఏలూరు
ఈ సంఘము ఇతర పట్టణములయందువలె ఇంగ్లీషు విద్యాధికులచే స్థాపింపబడి వారలచే నడిపింపబడుట లేకుండ వర్తకశిఖామణుల చేతను భూస్వాములచేతను స్థాపింపబడి వారలచే నిర్వహింపబడుచున్నది. ఆంగ్లేయ విద్యాధికులు ఇందు సభ్యులుగా లేకపోలేదు గాని వారి యాజమాన్య మిందు చాలతక్కువ. ఇదియే ఆదర్శప్రాయమగు విషయము. పౌరగ్రంథాలయములు ప్రజాసామాన్యమునకొరకై యవతరించిన ప్రతిస్థాపనలు. వానివలన నిజమైన యుపయోగము కలుగుటకు వానియాజమాన్యము సామాన్యప్రజలయందే సుక్రమించి యుండవలెను. ఈ సంఘమున కిదివరకు స్వంత భవనములేదు. లక్ష్మీపుత్రులును ప్రజాహిత కార్యములకు ఉదార భావముతో ద్రవ్య సహాయము చేయువాడును అగు మోతే గంగరాజుగారిని ఈసంఘమువారు ప్రార్థించి భవనమును నిర్మించుటకు వారివలన వాగ్దానమును ఈ సంఘమువారు తీసికొనిరి. స్థలమును సంఘమువారు మ్యునిసిపాలిటీ వారినికోరి సంపాదించు కొనిరి, అందుపై గవర్నమెంటు వారికి కూడ హక్కు కలదు. ఆహక్కులు ఎంతవరకు వారు చెలాయించెదరో ముందు నిర్ణయించుకొనకుండ అవిచారితముగా తాము సంపాదించుకొన్న స్థలములో శ్రీ గంగరాజుగారిచే ఈ సంఘము వారు భవననిర్మాణము ప్రారంభించిరి. భవనము అతి విశాలము. కడురమణీయము. పట్టణమునకు నడిబొడ్డున యున్నది. పురమునకు నాయకమణిగానుండి అత్యంతశోభ నొనగూర్చగలదు. ఇట్టి భవనముపై పదిపదునైదు వేలవరు ద్రవ్యము దాతలు వెచ్చించిన పిదప భవనపు స్థలముమీద నాలుగువందల పైచిల్కు పన్నును గవర్నమెంటువారు విధించినట్లు ఉత్తర్వు వచ్చినది. అంతటితో భవననిర్మాణ మాగిపోయినది. నిల్వయున్న కారురాయి వగైరాలనమ్మి ఈ సంవత్సరపుపన్నును కట్టిరి.
ఇది యంతయ ఎక్కువ విషాదకరము. దొరతనమువారవల బించిన దారుణకృత్యమునకు కారణమూహించగా సంఘమున యసహాయ వాదులు సభ్యులుగానుండుటయే నని తెలియుచున్నది. ఇదియేనిజమైనచో ఇట్టిపనిదొరతనమువారి హస్వదృష్టిని చూపుచున్నదిగాని వారి కుండితీరవలసిన విశాల భావమును తెలుపుట లేదు. దొరతనము వారు చూడవలసినది గ్రంథాలయపక్షమున జరుగు కృషి ఏది? అందు రాజద్రోహ పూరితమగునదేమైన యున్నదా? అంతియగాని సంఘమందిలి సభ్యుల కులమేది? వారిస్థితితులేమి? వారి రాజకీయాభిప్రాయము లెట్టివి? యనువిషయము లెన్నటికిని కాకూడదు. నేటి దినమున ఆసహాయవాదులీ సంఘమున సభ్యులుగా గా నున్నారు. రేపు వీరందరును రాజభక్తిపూరితులు కావచ్చును; లేదా ఇప్పటివారందరును సభ్యత్వము మాచుకొని రాజభక్తులే అందు సభ్యులు కావచ్చును. గ్రంథాలయసంఘము శాశ్వతమైనది. దానియాశయములు సర్వజన సమ్మతమైనవియు, అవశ్యమనుష్టింప తగినవియునై యున్నవి. దొరతనము నిజముగా ప్రజలహస్తగతిమై యున్నప్పుడు పౌరగ్రంథాలయములం ముఖ్యముగా