Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.2 (1922).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృతజ్ఞతాభివందనములతో — పుష్పతాంబూలసమర్పణముతో — విజయవంతముగ సభ ముగిసెను.

మాగ్రామమందు యీపుస్తక భండాగారమును నెలకొల్పి యిందుకు సుమారు నూరు రూపాయలకు మించిన అమూల్యమైన గ్రంథములను యిచ్చి యిందుకు తన శక్తికొలది తగు సహాయము చేస్తూ దేశోపకారముచేయు నట్టి మా గ్రామనివాసులును మాగ్రంథాలయ అధ్యక్షులగు మహారాజశ్రీ మాచిరెడ్డి వెంకటస్వామిడ్డిగారి ఉదారగుణము చాలా ప్రశంసించవలయును. ఇదే విధముగా మా గ్రంథాలయమును, మా గ్రామమును అభివృద్ధికి తెచ్చునట్లు పాటుపడుటకు, ఈశ్వరుడు వీరికి ఆయురారోగ్య ఐశ్వర్యము లిచ్చుగాక.

౼ చిన్నప రెడ్డి

కార్యదర్శి.



నవీనాంధ్రకవులు

II తిరుపతి వేంకటకవులు

తెలుగుబాసలో నిటీవల మొలకెత్తి, నలుమొగముల నల్లికొని, క్రొత్తపోకడల మించి మెరయు, కవితారంభంపుమొగసాలఁ దిరుపతి వేంకటేశ్వరులు నిలచియున్నారు. ప్రాచీనాంధ్రసారస్వత సారమంతయు లక్ష్యలక్షణ సమన్వితముగ వీరిలో జీర్ణించియుండెను. వర్తమానకాలమున మానవజాతులలో కావ్యకళాదులగూర్చి జరుగుచున్న భావవిపర్యయములు జక్కగ గుర్తించు వివేకము వీరికమఱి యుండెను. ప్రాచీనాంధ్రభాషా సంప్రదాయముల నూతనకాలోవిచితవిషయముల కుపకరింపజేసి, ప్రాచీనలక్షణమర్యాదల నవీనాదర్శములకు జతపఱచి, కావ్యములయొక్కయు, లక్షణగ్రంధముల యొక్కయు, పరస్పర సంబంధముల గుట్టుమట్టుల గమనించి, స్వతంత్రించి, క్రొత్తపోకడల మించి దారిజూపెడి మేటిగంటిమి వీరి కొప్పుచుండెను. స్వతంత్రించి మొదలిడిన కావ్యవైఖరుల దిగంతముల వ్యాపింపజేసి, భావిప్రయత్నములకు వలయు నుత్సాహోద్వేగముల నుత్పత్తిజేయదగు ఆత్మవిశ్వాసము, ఔదార్యము, పట్టుదల, వాదోత్సాహము, ధైర్యము వీరియందుండెను. ఆంధ్రకవితోపాసకుల భూత వర్తనూన భావిజీవితగతులు వీరి జీవనములో గోచరింపు, నవ్యాంధ్ర కావ్యరీతులు వీరి మానసారామనిబంధముల బలుతెరువుల వెలయ తిరుపతి వేంకటేశ్వరు లీనాఁటి తెలుగుపోకడల నాయకులై, నేతిలై, సూత్రధారులై యుగకర్తలై వెలుగుతున్నారు.

వీరి జీవితాంశములు తెలుగువారెల్ల పెరుంగుదురు గాన వాని నీయెడ విస్తరించము. ప్రాచీన గురుశిష్యసంప్రదాయముల నేటివరకు నిలుపుచు, నిరుపమశిష్యవాత్సల్యమునను, పరహితాపేక్షచేతను, వేలకొలది శిష్యులు సంపాదించి, సత్స్నేహధర్మములచే నిలుపుకొనజాలు సత్పురుషులు, చమూనాధులకుండు ఆశ్రితపక్షపాతము, నిరాఘూట ప్రచారము, నిర్భయ సమరోత్సాహము గల్గి వీరకరుణారసముల కాలవాలమయి, శాపానుగ్రహశక్తు లొప్పుచు, నాయకస్వరూపమును నిండువెలుగున బ్రకటింప గల ధీమంతులు. వీరు నిరంతర కావ్యరసోపాసకులు. ప్రాచీనకవులయెడను, తమ కావ్యములపట్లను, ఆరనియుత్సాహ ముత్పత్తిజేయగల తన్మయత్వము వీరి కలవడెను. ప్రాచీన కావ్య సాంఘిక మర్యాదలందు గౌరవముంచుచు, వాని ననవసరముగ నిర్హేతుకముగ ఖండింపక, ప్రాతవని పొడువెట్టక, వాని శృంఖలముల జిక్కికొనక, సమయోచితముగ నుపయోగించుచు స్వతంత్ర జీవితసూత్రముల నేర్పరచగలిగియుండిరి. ఇందుచే వీరు ప్రాచీన నవీన మర్యాదావలంబకులగు నాంధ్రభాషా సేవకు అందరివిశ్వాసమునకు గుదురైరి. వీరి యాదార్యము, బాలకవులయెడ జూపెడి వాత్సల్యప్రోత్సాహములు, మాటలసొబగు, స్నేహధర్మములు వీరిప్రతిభ నెల్లెడల జాటినవి.

శ్లో౹ కేచిత్ శ్రీపతి వేంక టేశ్వరకవి దృష్ట్వాధ శుశ్రూష
   యా | కేచిత్ కేచిదమిత్రతా ముపగ తాః కేచిత్పరి