Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.2 (1921).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముగ నుండుటవలన నచ్చట నివసింప సాగెననియు మరి కొందరు చెప్పిరి. ఇది నిజమని మన మొప్పుకొన్నను 4, 5 మంచు యుగములు వరుసగనెట్లు తటస్థింప గలవు. కొంతకాలము మంచుయుగములును మధ్యమధ్య మరికొంత గాలము సమశీతోష్ణ యుగములును తటస్థించు టెట్లు? కనుక యీ సిద్దాంతిమునుకూడ మన మొప్పు కొనజాలము. ఇట్టి సిద్ధాంతముల నన్నిటిని త్రోసివేయగ నింకను మిగిలినవి రెండు సిద్ధాంతములు గలవు. ప్రస్తుతమొక విధముగ నిలిచియున్న వీ రెండు సిద్ధాంతములే. మీ రెండు సిద్ధాంతములను చర్చింపకుండ నాపివేసి ముందు చర్చించెదము.

ఈ సిద్ధాంతము లెట్లున్నను - యీ మంచుయుగము సంభవించుటకు గల కారణము లెట్లున్నను ముంచుయుగములు తటస్థించిన వనుమాట మాత్రము సత్యము. భూగర్భ శాస్త్ర పరిశోధనల వలన నిది ఋజువు చేయబడినది గాన తోసి వేయుటకు వీలు లేదు.

తృతీయాధ్యాయము

[ఉత్తర ధ్రువ ప్రాంత దేశలక్షణములు]

హిమపద్యుగమునకు పూర్వయుగములలో యీ భూమియొక్క పైయాకారము యిప్పటివలె లేక వేరుగ నుండెననియు, అప్పటి భూజలభాగములు వేరుగ నుండెననియు చెప్పియున్నాము. ఈ సిద్ధాంతము భూగర్భశాస్త్ర పరిశోధనలవలన ధృవపరుపబడినది. దీనిని త్రోసివేయుటకిక వీలు కాదు. కనుక పూర్వయుగములలో నుత్తర ధృవమును చుట్టి కొంత భూభాగముండెనని మనము తలంప వచ్చును. ఈ విషయమును కూడ భూగర్భశాస్త్రమే ఋజువు పరుచుచున్నది. ఇప్పుడుత్తరధృవముచుట్టునున్న “నోవాజెంబ్లా” “స్పిట్స్ టల్సుబర్గెన్” మొదలగులంకలన్నియు, పూర్వము సముద్రముపైకి కనుబడుచుడిన భూభాగము మిూది పర్వత శిఖరములనియు, ఆభూభాగము నీటిలో మునిగిపోగా యీ పర్వతశిఖరములు మాత్రము పైకి కనుబడుచు సముద్రము మధ్య లంకలవలెనిలిచి యున్నవనియు భూగర్భశాస్త్రవేత్తలు నిర్ధారణచేసిరి. మరియు చతుర్థయుగమునందంతటను యీ యుత్తర ధృవప్రాంత భూభాగములపై పశుపక్ష్యాదులును నరులను నివసించుచుండినట్లుకూడ భూగర్భశాస్త్ర పరిశోధనలవలన ఋజువైనది. ఇక నిచ్చటి శీతోష్ణస్థితి విషయమై ప్రజలు నివసించుట కనుకూలముగనె యుండెనని రెండవ యధ్యాములో చెప్పియుంటిమి. అచ్చటి శీతోష్ణస్థితి “సంతత వసంతసమయ” మన్నట్లుండెనని కొందరు శాస్త్ర వేత్తలు పలికయున్నారు. ఉత్తరధృవము చుట్టును పూర్వ మొకప్పుడు ప్రజలు నివసించుట కనుకూలమైన శీతోష్ణాది స్థితులుగల భూభాగముండెనని మన మొప్పుకొంటిమి. అంతమాత్రము చేత ఆర్యసంతతివా రాకాలములో నాదేశములలో నివసించుచుండిని మనమెట్లు చెప్పగలము? దీనికై మన వేదములను పరీక్షించి చూడవలెను. ఉత్తరధృవ ప్రాంతదేశలక్షణము లేవైన యీ పూర్వగ్రంధములలోను వారి యాచారములలోను, వారి గాధలలోను కనుపించినయెడల మనవారొకప్పుడచట నివసించియుండి యుండవలెనని మనము నిర్ధారణ పరుపవచ్చును. ఋగ్వేదమునందు కొన్ని కొన్ని చిత్రమైన అంశములును, గాధలును గలవు. వీనికన్నిటికిని చాలభాగ మేదోవిధముగ, అతుకులు పెట్టి ప్రాచీనభాష్యకారులు అర్థమును చెప్పిరి. ఈ యర్థము లెంతమాత్రమును తృప్తికరములు లేవు. అదిగాక, యేవిధముగ విరిచి అతుకులు పెట్టి అర్ధము చెప్పుదమన్నను సాధ్యపడని కొన్ని కొన్ని యంశము లింకను ఋగాదివేదములందు మిగిలియేయున్నవి. పోనీ, యీఋక్కుల యందేమైన పదకాఠిన్యముగాని, అర్థకాఠిన్యముగాని యున్నదేమోయనిన అదియును లేదు. పైకి చూడబోయిన అన్నియును తెలిసినమాటలే; అన్నియు తేలికమాటలే. కాని, వాని నిజభావ మేవిధముగ జూచినను మనయీ దేశకాలపాత్రములతో సమన్వయింపజాలము. కాని యీ ఋక్కులలోని యంశములనే ఉత్తరధృవప్రాంత దేశములతో పోల్చిచూచినప్పుడు మాత్రము సర్వమును సంపూర్ణముగ సమన్వయమగును. ఆవర్ణనలు, ఆదేశకాలాది వ్యవహారములు, ఆచిత్రవిచిత్రములగు రాత్రింబవళ్ళ తారతమ్యములు ౼ అన్నియును ఉత్తరధృవదేశములకే సరిపోవును గాని మన యీ హిందూదేశము మొదలగుదక్షిణ భూభాగముల కెంతమాత్రమును సరిపోవు. పూర్వమొకప్పుడు మన యార్యులీ యుత్తరధృవప్రాంత దేశములలో నుండిరను అనుమానము మన భాష్యకారుల మనస్సులకు తట్టనందున, పైకి బహుతేలికగనుబడుచున్న కొన్ని కొన్ని వేదవాక్యములకు నిజార్థమును చెప్పలేక వారు ఉక్కిరిబిక్కిరియైరి. ఈ కీలకము నెరింగినయెడల వీనికన్నిటికిని అర్థము కరతలామలకమగును. కనుక యీ వేదవాక్యము లన్నిటినిగూర్చి విచారించుటకు ముందు ఉత్తరధృవ లక్షణములేవియో,