ఆర్యుల ఉత్తరధృవ నివాసము
(శ్రీ బాలగంగాధరతిలక్ ప్రణీతము)
ద్వితీయాధ్యాయము
హిమవద్యుగము హిమవత్ ప్రళయము వచ్చుటకు కారణమేమి?
ఉత్తరధృవ ప్రాంతదేశమొకప్పుడు, యిప్పటివలె మంచుతో ఘనీభవించుకొని పోక, మానవులకు నివాస యోగ్యముగ నుండెననియు, పిమ్మట కొంత కాలమునకు దేశమంతయు మంచుతో అనేక వేలయడుగుల యెత్తు వరకు నిండిపోయినందున, ప్రజలచ్చటనుండి దక్షిణ దేశములకు వచ్చిరనియు భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారణ జేసిరి. ఈవిషయమై ప్రకృతి శాస్త్రవేత్త లందరును సమ్మతించియే యున్నారు. ఒకటిమాత్రమే గాక యిట్టి మంచుయుగములు 4, 5 సంభవించినవని కూడ చెప్పి యున్నారు. ఒక మంచు యుగమునకును, మరియొక మంచుయుగమునకును మధ్య కాలములో శీతోష్ణస్థితి యనుకూలముగ నుండి మంచుయుగములలో మాత్రము భరింపశక్యము కాని శీతలము ప్రబలినట్లును చెప్పుచున్నారు. కాని యేదియెట్లును క్రిందటి మంచు యుగమునకు పూర్వము ఉత్తర ధృవ ప్రాంతములలో మనుష్య సంచారమున్నట్లును, పిమ్మట మంచు యుగమురాగనే వారచ్చట నుండి లేచిపోయినట్లును స్పష్టముగ నిదర్శనములు గలవు. కాదని త్రోసివేయుటకు వీలు లేదు. కాని యీ మంచు యుగములు తటష్టిచుట కేమి హేతువు గలదు? ఈ అధ్యాయములో నీ విషయమై చర్చించెదము. అనేకులనేక యభిప్రాయములను తెలిపియుంటిరి. దీనినన్నిటిని వరుసగా విచారించి చూచెదము.
(1). బహుశః పెనామాభూసంథి యొకప్పుడు సముద్రములో మునిగియుండి యుండవచ్చును. అందువలన “గల్ఫుస్త్రీము” అని యిప్పుడు చెప్పబడు ఉష్ణసముద్ర జలప్రవాహము ఉత్తర దేశముల వైపునకు బోక దక్షిణముగ ప్రవహించుచుండెడిది కాబోలు. ఆ కారణము చేత ఉత్తగధృవప్రాంత దేశములు మంచుతో, ఘనీభవించు కొనిపోయియుండవచ్చును అని కొందరు చెప్పిరి. కాని పెనామాభూసంథి సముద్రములో పూర్వమొకప్పుడు మునిగి యున్నట్లు నిదర్శనము లెంతమాత్రమును లేవు. కానీ యీ సిద్ధాంతమును తోసివేసిరి. (2) మరియొక రింకొక సిద్ధాంతమును బయలు దేర దీసిరి. ఈ భూగోళము యీ బ్రహ్మాండ గోళములో తిరుగుచున్న సమయములలో ఒకప్పుడు బహుశీతల ప్రదేశములగుండను మరియొకప్పుడు ఉష్ణ ప్రదేశముల గుండను సంచారము చేసి యుండవచ్చును. అందువలన ఒకప్పుడు మంచుయుము, మరి యొకప్పుడు సమ శీతోష్ణస్థితియు తటస్పించి యుండ వచ్చును. కాని భూగోళమీవిధముగ తిరిగినదని చెప్పుట కెంత మాత్రమును నిదర్శనములు లేవు. కాన సిద్ధాంతమును కూడ తోసి వేయవలసినదే. (3) ఇక మూడవ సిద్దాంతమును విచారించుదము. భూగోళమునకు కావలసిన ఉష్ణము సూర్యమండలమునుండి వచ్చుచున్నది. ఇది అందరికిని తెలిసిన విషయమే. ఇట్లు సూర్యమండలము నుండివచ్చు ఉష్ణములో హెచ్చుతగ్గులుండి యుండ వచ్చును. ఒకప్పుడు ఉష్ణమధకముగను, మరియొకప్పుడు తక్కువగను సప్లయి అయిన కారణమున యుగములును సమశీతోష్ణ యుగములును తటసించి యుండవచ్చును. కాని యీ సిద్ధాంతమును ఋజువు పరచుట కేమియును ఆధారములు లేవు. కాబట్టి దీనిని కూడ "త్రోసిరా” జన పలసినదే. (4) ఇంకొక సిద్ధాంతమును విచారించెదము. ఈ భూగోళ మొక ఇరుసు మీద తిరుగుచున్నట్టు తిరుగుచున్నదని అందరికిని తెలియును. మొదటనున్న యిరుసు ఆకస్మికముగ మారిపోయి మరి యొక యిరుసు మీద భూమి తిరుగ నారంభించిన యెడల శీతోష్ణష్టితియం దిట్టి మార్పులు కలుగవచ్చును. కాని మొదటి యిరుసు మారిపోయి, రెండవ యిరుసు వచ్చిన యెడల యీ రెండవ యిరుసుతో బాటు, రెండవభూమధ్యరేఖయు, యీ రేఖచుట్టును భూమి యుబ్బినట్లు ఉబ్బుడు ఆకారమును కూడ తటస్థింపవలెను. అట్టి రెండవ ఉబ్బుడు ఆకారమేమియు కానబడదు. కాని దీనిని నమ్ముటకు వీలు లేదు. (5) ఈ భూగోళము మొదట (సూర్యమండలమువలె) మంటలు మండుచున్న అగ్నిగోళమువలె నుండెననియు, పిమ్మట క్రమక్రమముగ చల్లబడి యిప్పుడీ స్థితికి వచ్చెననియు ప్రకృతిశాస్త్రవేత్తలు తలంచుచున్నారు. ఇట్లే భూమి కాలక్రమమున చల్లబడుటలో తక్కిన ప్రదేశములన్నిటికంటే ఉత్తర ధ్రువప్ర్రాంత భాగములు ముందు చల్లారెననియు అట్లు చల్లారుటవలన వృక్షములు,మృగములు, మనుష్యులు మొదలగు ప్రాణికోట్లుద్భవించి యచ్చట వాసయోగ్యత