Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.3 (1920).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ను, విశాఖపట్టణ మండలమున ౨౩ ను, గోదావరి మండలమున ౧౪౦ లును, గుంటూరు మండలమున ౧౫౧ లును, నెల్లూరు మండలమున 3౧ లును గలవు. చిత్తూరు, కడప, అసంతపురము, బళ్ళారి, కందనోలు (కర్నూలు) మండలములలో ౩౦ గ్రంథాలయములకున్న నెక్కువలేవు. చిత్తూరు ౯, కడప ౧౧, అనంతపురం ౪, బళ్ళారి ౪, కర్నూలు ౧, నేలము ౭, చెంగల్పట్టు ౨, చెన్నపురి ౬, బెంగుళూరు ౪, ఆంధ్రీతర దేశములలో ౧౧, హైదరాబాదు రాష్ట్రమున ౧౯ గ్రంథాలయములు గలవు. గంజాం, విశాఖపట్టణము, గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు మండలములలో మండల గ్రంథాలయ సంఘము లున్నట్లు గన్పడుచున్నది. దీనికి గారణము గ్రంథాలయముల సంఖ్య పెరుగు చుండుట యేగాని మరి వేరు కారణము లేదు. పశ్చిమాంధ్రదేశమున నూతన గ్రంథాలయముల నెలకొల్పుటకయి యాంధ్రదేశ గ్రంథాలయ సంఘము వారు విశేషముగా గృషి సలిపినగాని యాంధ్ర దేశమున సమానాభివృద్ధిగానుపింపదు. అందును కర్నూలు మండలము యొక్క స్థితి మిక్కిలి శోచనీయముగనున్నది. కర్నూలు మండలములో 'శిరి వేళ్ళ' యను గ్రామమున 'సుజ్ఞాన వధ౯నీ గ్రంథాలయ'మను పేరుతో నొక గ్రంథాలయము నల సంవత్సరములో స్థాపింపఁబడినదఁట. అందు ౯౪ గ్రంథములు మాత్రమున్న వఁట. ఆహాహా! ఏమి యీ వింత? ఆంధ్రదేశములో కర్నూలుమండలము సుప్రసిద్ధమైన చరిత్రము గలది. సుప్రసిద్ధ శైవక్షేతమగు శ్రీశైలమును, వైష్ణవ క్షేత్రమగు అహోబలమును కర్నూలు మండలములోనివే. ప్రాచీనకాలమున శ్రీ పర్వతము శ్రీ మహాపట్టణమాగా నుండెను. బౌద్ధయుగమునా డిందొక సంఘారామము గలదు. ఇచ్చట నొక మహావిద్యాలయ మాంధ్ర చక్రవర్తుల పోషణమున వర్థిల్లెను, ఇందుతర్కశాస్త్ర వేది, మహాతత్త్వవేత్త, మహాయాన బౌద్ధమతోద్ధారకుఁడైన నాగార్జునాచార్యుఁ డిందే కొంతకాలము నివసించియుండెను. అంత ప్రాచీనకాలమునకుఁ బోవనేల? ఆంధ్ర భాషాపోషకులగు కందనోలార్వీడు మొదలగు రాజులకు కర్నూలు మండలము నిలయముగా నుండెను. ఆంధ్రభాషలో నుత్తమ కావ్యములు రచియించిన మహాకవియగు పింగలి సూర్యనార్యునకు వాసస్థానముగా నుండెను. ఆంధ్ర మహా కవులగు కుమార ధూర్జటి, అందుకుల వెంకయ మొదలగువారు కృష్ణరాయ విజయము, నరపతి విజయము మొదలుగాగల చరిత్రప్రబంధములను రచించి యిచ్చటి రాజులకే యంకితము గావించి ధన్యులైరి. అట్టి యీ కర్నూలు మండలము మాతృభాషా సేవయందు వెనుకఁ బడియుండుట మిక్కిలి శోచనీయము. ఇంతటినుండి యైన కర్నూలు మండలాంధ్రులు తమ సోదరులను మేల్కొలిపి, గ్రంథాలయములఁ బెక్కింటిని నెలకొల్పి, మాతృభాషాసేవకు బూనుకొనవలయునని వినయముతో హెచ్చరింపు చున్నాఁడను.

ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలోఁ బ్రకటింపఁబడిన యాంధ్రదేశ గ్రంథాలయ పట్టికను గమనించిన యెడల రాజమహేంద్రపురమునందలి శ్రీ గౌతమీ గ్రంథాలయ మగ్రస్థానమును బొందియున్నది. ఇయ్యది తొలుతఁ శ్రీ వీరేశలింగ పుస్తక భాండాగారమను పేరిట శ్రీయుత నాళము కృష్ణారావుగారిచే ౧౯౦౦ సంవత్సరమున స్థాపింపఁబడి, మఱికొంత కాలమునకూ సర్వజన పుస్తక భాండాగారముగా