Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.2 (1920).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యమే ఈవిషయమున మనకు దృష్టాంతము. మదరాసు టైమ్సుపత్రిక “ఈ గ్రంథాలయము పోషింపబడిన కొద్దిపాటి గుమస్తాల, బంట్రోతుల నిద్రాగార” మని వ్రాసిన వాక్యములు తగియున్నవి. ఈగ్రంథాలయపు భవనమును బాగుపరచినగాని, నవీన పద్ధతుల మీద గ్రంథాలయమును నడుపుచుండినగాని దానివలన మన కేమియు లాభము౦డజాలదు.

ప్రభుత్వము వారుగాని, కార్పొరేషను వారుగాని గ్రంథాలయోద్యమమున శ్రద్ధవహించి ప్రత్యేక సంఘములను నియమించి, దేశమునందలి పలుచోట్ల గ్రంథాలయములు నెలకొల్పవలయును. ఈవిషయమున స్థానిక సామ్రాజ్య ప్రభుత్వములవారి అభిప్రాయమేమియో మనము కనుగొనుట అవసరము.

చెన్నపురి సారస్వతసంఘము వారి గ్రంథాలయము మాత్రము నవీన పద్ధతులమీద బాగుగా పనిచేయుచున్నది. కాని అందు సామాన్యప్రజలకు ప్రవేశము లేదు. కావున మనకు దానివలన లాభమేమియు లేదు.

చెన్నపురి ఆంధ్రసభవారు రెండు సంవత్సరముల క్రిందట ఆదర్శ గ్రంథాలయము నొకదానిని నెలకొల్ప నిశ్చయించిన మా యుద్యమమును మీకు తెలుపుటకు కుతూహలపడుచున్నాను. తాత్కాలికోత్సాహపూరితుల మగుచు ఈ విషయమున మేమప్పుడు చాల పనిచేసినను ఆయుత్సాహము ఇప్పుడు తగ్గిపోయినదని చెప్పుటకు నాకే అవమానకరమగనున్నది. మే మప్పుడు రూ 2,250 లు ప్రజలనుండి వసూలు చేసితిమి. పిఠాపురము రాజుగారు వేయి రూపాయల నీ యుద్యమమున కిచ్చి ఎంతయో సహాయము చేసిరని చెప్పుటకు సంతసించుచున్నాను. మనదేశమునందలి పండితులను గ్రంధకర్తలను ప్రోత్సాహపరచి వారి గ్రంధములను కొనుట మా యాదర్శమై యుండెను. ఈ కార్యము నిర్విఘ్నముగా నెరవేరవలయుననిన యెడల నుత్సాహపూరితులగు యువకులు ముందంజవేసి పనిచేయవలయును. ఈ కార్యమునకు స్వార్ధత్యాగ మత్యవసరము. దేశోన్నతికి ఈపాటి స్వార్థత్యాగమును మనవారు చూపక పోయినయెడల నేమి ప్రయోజనము. దేశాభిమానమును, దృఢమనస్సును గలవారే ఈ యుద్యమాభివృద్ధికి ఆవశ్యకము.

అధ్యక్షుల యుపన్యాసమును వినవలయునని అతికుతూహలముతో నుండు మీయుత్సాహమునకు నేనిక నడ్డమురాను, మన దేశమునందు మనకు అభిమానముండు నేని, మనపూర్వ నాగరికతయందు మనకు గౌరవముండునేని, మనసారస్వతమునందు మనకు అభిమానముండు నేని, మీ అజ్ఞానసోదరునియెడ మీకు సానుభూతియుండునేని, ఈ యుద్యమమును ఫలవంతము చేయుటకు నిరంతరము కృషిచేయ మిమ్ముల నందరిని ప్రార్థించుచున్నాను.

పిమ్మట కాశీనాధుని నాగేశ్వర రావుగారు శ్రీ సూరి వెంకట నరసింహశాస్త్రి గారిని సభాధ్యక్షులుగ నుపపాదించుచు వేంకట నరసింహశాస్త్రిగారి కార్యదీక్షయు వారి కార్యసాధనా చాకచక్యమునుగుఱించి పొగడిరి. చెలికాని లచ్చారావు, తిత్తి బలరామయ్య, సి. వెంకటరంగము శ్రేష్ఠి, యస్.నరసింహారావు, అద్దంకి సత్యనారాయణశర్మగార్లు బలపరచిరి. అంతట వేంకట నరసింహశాస్త్రిగారు పుష్పమాలాలంకృతులై అగ్రాసనాధి పత్యము, కరతాళధ్వనులు చెలరేగ, వహించి తమ యుపన్యాసమును జదివిరి.