విత్రత - ప్రస్ఫుటించుచుండెను. ఒకరికొకరు నూతన పరిచితులుగ ఎవ్వరికిని దోపలేదు. అందరును యిదివర కెప్పుడో పరస్పరము పరిచయము గలిగి యున్నవారుగనే దోచుచుండిరి. ఒక గుజరాతు దేశస్థుడువచ్చి నన్ను తన దేశస్థునిగా భావించి, నాదగ్గరకు జేరి, తన మాతృభాషలో నన్నేమో ప్రశ్నింప నేను (తెల్లబోయి చూచితిని) అంతట అతడును తెల్లబోయి చూడసాగెను. ఇంకొక మహారాష్ట్రునిచూచి, ఆంధ్రుడనుకొని మాటలాడ కుతూహలుడనై దగ్గరకుబోతిని కాని మాట్లాడలేదు.
ప్రతిదినమును ఆదినమున జరుగవలసిన కార్యములను సక్రమముగా జరుగునటుల జూచుటకొక ఉద్యోగి నియమింపబడెను. వంట జేయుటకు, వడ్డన జేయుటకు పరిభ్రముచేయుటకు కొందరు పూనుకొనెదరు. ప్రతిదినమును తెల్లవారగనే అందరును లేచుటకొక ఈల వేయబడును. అంతట అందరును లేచి తమ కాలకృత్యములను తీర్చుకొనునంతలో రెండవ ఈల వేయబడును. అప్పుడు అందరును జెండా చుట్టును చేరి, జాతీయకీర్తనలును పాడి శరీరవ్యాయామమునకు బోయెదరు. శరీర వ్యాయామమైన పిమ్మట ఫలహారము జరుగును. పిమ్మట కొండ ప్రదేశములందు వివిధములగు ఆటలాడుటకు పోవుట - అటుపిమ్మట మధ్యాహ్న భోజనము. భోజనమైన పిమ్మట కొంత సేపు సభ. సభకు పిమ్మట తిరిగి ఆటలు. ఒక్కొక్కప్పుడు రాత్రులయందు గూడ ఆట లేర్పరుపబడుచుండును. ఈ మధ్యనేమైన కొంచెము తీరికగలిగిన, ఒక ఆంధ్రుడు మహారాష్ట్రునితో గలసి తన దేశస్థితిగతులు తన దేశమందలి ఉద్యమములు అతనితో జెప్పి, అతని దేశ స్థితులను తాను దెలిసికొనుచుండును. వేరొక సింధీయుడు మహారాష్ట్రునితో గలసి ఇటులనే మాట్లాడుచుండును.
మేము ఈపట్టణమందు గడపిన దినములు మిక్కిలి మండు వేసవికాలమే యైయున్నను, ఇక్కడ మిక్కిలి చల్లగానుండి, రాత్రులయందు శాలువలు గప్పుకోనవలసిలు యుండెను. అందుచేత యెన్ని యాటలాడినను ఆలయిక యనుమాట లేకుండెను. అనేకగుహలను, అనేక కొండలోయలను, అనేక సెలయేరులను జూచి నేత్ర పర్వమొనర్చికొంటిమి. మేమొక నాడు “కార్లీ” అను గొప్ప కొండగుహలను జూచుటకు బోతిమి . అకొండ గుహల కావల “ఆంధ్రలోయ" గలదు. ఆలోయయందు నీటినిజేర్చి విద్యుచ్ఛక్తిని గెలిగించి బొంబాయి పట్నమునకు బంపుచున్నారు.
సభలయందు జర్చించిన విషయములలో భటులు ధరింపవలసిన దుస్తుల విషయమై జరిగిన చర్చ మిక్కిలి ముఖ్యమైనది. కొందరు ఇప్పుడున్న రీతినే దుస్తులుండవలెననిరి, అనగా మిలిటరీషర్టు, మట్టలాగు, ఆకుపచ్చని తలగుడ్డ యుండవలెననిరి. మరికొందరు మిలిటరీషర్టునకు బదులుగా “జుబ్బా” ఉండవలెననిరి. రంగు తలగుడ్డకు బదులంగా సగమొక రంగును, మిగిలిన సగమును వేరొక రంగును గలిగిన తలగుడ్డ ఉండిన బాగనిరి. వేరొకరు ఒక్కకొందరు తలపాగాలకు బదులుగా దొరలు పెట్టు కొను “హ్యాట్టులను” ఉపయోగింపవలెననిరి. ఇట్లు పలువురు తమ తమ యభిప్రాయములను బ్రకటించిరి. కాని ఒక్కరును మట్టలాగును మార్పవలెనను వారు లేరైరి. ఆప్పుడు నేను లేచి పట్నములందలి భటులకు ఇప్పుడున్నటులనే దుస్తులనుంచవచ్చును గాని ఆదుస్తులు పల్లెల వారికెంత మాత్రము ఆకర్షకములు గావనియు వారు తమ కట్టుపంచెయొక్క కచ్చెళ్ళను వెనుకకు విరచిగట్టి జుబ్బాను తొడిగి ఆకుపచ్చ తలగుడ్డను బెట్టుకొనినయెడల దేశీయముగను ఆకర్షకముగను ఉపయోగముగను ఉందుననియు జెప్పితిని. అంతట సభ్యులయందొక విధమైన కలవర ముదయించెను. నేను జెప్పినమాటలు విస్మయ జనకములయ్యెను. మట్టలాగు (నిక్కరు) లేనియెడ చులకనగా పరుగెత్తుటకే వీలు లేదనియు అన్ని విధములను ఒప్పియున్న దానిని ఇప్పుడు పల్లెటూరి వార్లకై భయపడి విడుచుట యుక్తము గాదనియు, పల్లెల వారు క్రమముగా దీనియొక్క ఉపయోగమును తెలిసికొని ధరించుట కలవాటు పడుదురనియు అందుచేత మనము త్వరపడి దీనిని మార్చ గూడదనియు వారియొక్క యభిప్రాయముగ జెప్పిరి. అంతట నేనిట్లంటిని, “ఇతర భాగములనుగూర్చి నాకనుభవము లేదుగాని మా యాంధ్రదేశమునందు మాత్రము పల్లెలవారు మిక్కిలి వివేకవంతులు; మట్టలాగు దేశీయముగాదని వారు దానిని ప్రేమింపరేగాని, దానియొక్క ఉపయోగములనుగూర్చి తెలిసికొనలేక గాదు; మట్టలాగు యొక్క ఉపయోగము లన్నియు ధోవతిని వెనుక వైపుకు విరిచికట్టిన లభింపగలవని వారు గ్రహించిరి. ఇంతేగాక, మా వైపులనున్న క్షత్రియులు నేటికిని అట్లు వెనుకకు విరిచినట్టియే ధోవతులను ధరింతురు. గొప్ప రాజ్యములనేలి యుద్ధములందు తమ అద్వితీయ శౌర్య ధైర్యపరాక్రములను ప్రదర్శించినవారి సంతతివారే ఈ క్షత్రియులు. వీరేగాక రాజపుత్రులు గూడ ఎప్పుడును మట్టలాగులను దొడుగు కొనినటుల వినలేదు. అయినప్పటికిని వారికి ధోవతి