Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.1 (1920).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతిదినము ఉదయము ౫ ఘంటలు మొదలు రాత్రి పదిఘంటలవఱకును శిక్షనొందవలసినవారు శిక్షకులయాజ్ఞానుసారము నడువవలసియుండెను. మధ్యాహ్నము భోజనానంతరమును, రాత్రి భోజనా త్పూర్వమును శిక్షాగ్రాహకుల కొకింత విరామముండెను. కాని యప్పుడుసయితము తమ బందుగులకుత్తరములు వ్రాసికొనుటో- తమపాఠముల జదువుకొనుటో తప్ప విశ్రమించుటకు సాధ్యము లేకుండెను.

వసతిగృహకుడ్యములకుఁ గాలక్రమసూచికయు, భటవందనపటమును, హిందీయక్షరసూచికము, భటపతక పటమును భటునిగుర్తులు తంతిగుర్తులు బంధనములు - వీనిని దెలుపు పటమును వ్రేలాడఁగట్టబడి యుండెను. సర్వవిధముల బోధనకనుకూలమగు పద్ధతులనవలంబించి శిక్షకులు, వచ్చిన సోదరులకు శిక్షనొసంగిరి. ఆతొమ్మిది దినములును వేషము లేకుండుట యొకమేలు. పక్షులరుత ములచేతను, మంచెలపైనెక్కి కూయిడుచున్న కాపరుల కోలాహలములచేతను బ్రకాశించుచుండు సజ్ఞ పైరులును అడవులను తోటలును ఆటలందు భటోపాధ్యాయులు దాగుకొనుట కెంతయు ననుకూలముగ నుండెను. వేయేల! సర్వవిధముల శిక్షణకాలము సంతోషదాయకముగనే యుండెను. మాసోదరులు మాలోపములను గొప్పగా సెంచక శిక్షణనొందుటయే ఘనముగ నెంచి, తమతమ గ్రామములయందు బాలభటసంఘ నిర్మాణమునకుఁ కొందురుగాక !

వందనములు

మా ప్రార్ధనమంగీకరించి మా యూరికరుదించి, యనేక శ్రమల కోర్చి శిక్షణనొసంగిన శ్రీయుత అయ్యంకి వేంకటరమణయ్యగారికిని, ద్రవ్యసహాయము, శరీరసహాయము నొనరించిన శ్రీయుత దరిశి గురవయ్య శ్రేష్ఠిగారికిని, భద్రిసోదరులకును, తోట రామకృష్ణయ్య గారికిని, సుగాశీ గురవయ్యగారికిని, పోతురాజు వేంకట సుబ్బయ్యగారికిని మా కృతజ్ఞతాభి వందనముల నర్పించుటయ కాక, బాలుఁడయ్యును నీయద్యమము నందత్యంతాభిమానముతోఁ బ్రధమమునుండియు మాతోడఁ బాటుపడిన శ్రీ సుగాశి రంగస్వామిగారికి భగవంతుఁ డాయురారోగైశ్వర్యము లొసంగుఁ గాక!

సీ. ఆంధ్రోద్యమంబెంతా ♦ నా దర్శముగఁగొని
దేశ సేవకుఁడైన ♦ ధీరుఁ డెవఁడు,
బాలభటోద్యమం ♦ బాంధ్ర దేశంబున
విస్తరిల్లగఁజేయు ♦ విజ్ఞుఁ డెవఁడు,
గ్రంథాలయోద్యమ ♦ కార్యాలయంబునఁ
గార్యదర్శిగనుండు ♦ ఘనుఁడెవండు,
“సర్వస్వము”నకుఁ దా ♦ సంపాదకుండయి
భాషను సేవించు ♦ ప్రాజ్ఞుఁడెవఁడు
అతని శ్రీయుతుఁడైన న ♦ య్యంకి వంశ్యు
వినుత వేంకట రమణాఖ్యు ♦ విశ్రుతయశు
మాయుపాధ్యాయు యుద్యమ ♦ మన్నిదిశల
జేరివెల్గు గావుత! ♦ శ్రీశుకరుణ.

- వేదము వేంకటకృష్ణశర్మ

కార్యనిర్వాహకుఁడు.