Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.5 (1919).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లకు బోవుచు, ఇతరులవలె దేవుని నిర్జీవప్రతిమలయందు (అనగా దేవాలయములయందు) మాత్రమేగాక, సజీవులయందు (మానవుల౦దు) గూడజూచి సేవించెదరు. ఇట్లు యాత్రలకుబోవుటవలన అనేక లాభములు గలవు. దేశపద్ధతుల నెరుంగుట, కష్టసుఖములం దోర్పును గలిగియుండు స్వభావము నలవరచుకొనుట, ప్రయాణమునందు మనమెట్టికష్టనష్టముల ననుభవింపవలెనో స్వానుభవమువలన దెలిసికొని ఇతరుల అవసరములను గుర్తెరుంగుట, కూపస్థమండూకములవలె మనగ్రామములే సమస్త ప్రపంచమను తలంపు వదలిపోయి దర్శనీయములగు నూతన ప్రదేశములను జూచుట, మానవహ స్తనిర్మిత సౌందర్యములను జూచుటతో మాత్రము తృప్తిని వహింపక ప్రకృతిజన్య సౌందర్యములనుగూడ అనుభవించుట - ఇట్టి వెన్ని యోగలవు. ఇందువలన దేహబలము మాత్రమేగాక బుద్ధిబలము గూడ అతిశయించును. ఆరోగ్యవంతుడు, ధైర్యవంతుడు, వివేకవంతుడు అయి యు౦డుటయేగాక వినయమునుగలిగి ఎల్లర కుపయోగకారియై యుండును.

ఇట్టి జట్టులందు చేరువారందరును ఇతరుల మీద ఆధారపడియుండకుండ స్వయముగా ప్రయాణము జేయు సమర్థతను, ఎంతలోతునీట నైనా అవలీలగానీదు సమర్థతను, ఎట్టి అడవి ప్రదేశమందైన జాడలుదీసి దారులుకనుగొను సమర్ధతను, అవసరమైనప్పుడు స్వహస్తపాకమును జేసికొను సమర్ధతను, గాయములు తగిలినవారికిగాని రోగికిగాని వైద్యుడు వచ్చువరకు తగిన యుపచారములు జేయు సమర్ధతను - వేయేల ఎంతటి ఘనకార్యమునైనా అవలీలగ సమర్ధింపగల శక్తి అలవడును.

“ఎల్లప్పుడును సిద్ధపడియుండుట” యే వాని పరమార్ధము, అనగా ఎప్పుడేది తనకు సంభవించినను ఆనందమునకుగాని దుఃఖమునకు గాని వెరవకుండుట; ఎప్పుడేపని చేయవలస వచ్చినకు కష్టమనిగాని సుఖమనిగాని తలంపకుండుట. “సేవ"యే వానికి తారకమంత్రము. మానవత్వమునకును పౌరత్వమునకును కావలసిన లక్షణములన్నియు వానికలవడును.

బాలునికి యావనమంకురింపక పూర్వమే యువకుడు సంసార భారమును వహింపకపూర్వమే సంసారసాగరమునందున్న వానికి ఇంకను అవకాశమున్నప్పుడే, అతనికి సహజమగు మానవ బాధ్యతలను హక్కులను తృప్తికరముగ నిర్వర్తించుకొనుటకు గావలసిన శిక్షను గరపితేమి, వాని జీవితము తద్వారాసంఘము యొక్క జీవితము - దేశముయొక్క జీవితము సౌఖ్యవంతమును ఆరోగ్యవంతమును ఐశ్వర్యవంతమును అగుట కెంతమాత్రమైన సందియముగలదా! ఇట్టి శిక్షను అలవడునటుల జేయు నదియే బాలభటోద్యమము.

మూడవ ప్రకరణము

బాలభట ధర్మములు — ఏర్పాటులు.

౧ సోదరత్వము.

భటుడు సేవ జేయుటకుఎల్లప్పుడును సమర్ధుడై యుండవలెను. ప్రత్యుపకారవాంఛలేకుండ, ధర్మపరతచే సేవావ్రతమును గైకొనువారందరును సోదరులు. అందుచేత ఏ దేశ మందున్నను బాలభటులందరును ఒకే సోదరబృందమునకు జేరినవారైయున్నారు. భటులందరును తాము ప్రతిదినమును, ఇతరుల కెవ్వరికైన ఉపకారము నొక్కసారియైన జేయుట వారి విధ్యుక్తధర్మమై యున్నది.

ఎల్లప్పుడును దేనికైన సిద్ధ పడియుండుటయే భటుని పరమార్థమని ఇదివరకే జెప్పియుంటి మిగదా! ఆపరమార్ధమెట్లు నిర్విర్తింపబడునో తెలిసికొందము.