Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.4 (1918).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆసక్తిగలవాడయి యుండవలెను. పాఠకుల సందేహమును నివృత్తి చేయువాడు కావలెను. బహు గ్రంధపాఠిఅని ప్రసిద్ధిగాంచిన వాడు కావలెను. విద్యయొక్కపొలిమేరయే తెలియని వారినికూడ గ్రంథాలయాధిపతులు తమవద్దకురప్పించి హరికథాకాలక్షేపములవలనను పురాణ శ్రవణమువలనను మాజిక్కు లాంతరు మున్నగు వివిధచిత్రయంత్రప్రదర్శనములవలనను ప్రాపంచిక జ్ఞానాభివృద్ధిగలవారిగా చేయవలెను. అ యా జాతులవారివృత్తు లభివృద్ధిజెందుమార్గములు బోధించు పుస్తకసామగ్రి గ్రంథాలయములయం దుండవలెను. వానిలోని విషయములను బాలురు మొదలు వృద్ధులవఱకును సులభముగ బోధించుచు రావలెను. ఇట్టి పని జరిగినచో గ్రంథాలయములు సర్వజన సమాదరణీయంబులయి దిన దిన ప్రవర్ధమానంబులయి విరాజిల్లెడును.

గ్రంధాలయోద్యమము పూర్వ మెన్నడునులే దనియు కేవలము నవీనమనియు నాతాత్పర్యము కానేకాదు. పూర్వము ముద్రణా యంత్రములు లేకపోబట్టి తాళీయదళసంపుటంబులగు గ్రంథములు పండితులయిండ్లలో మెండుగా నుండెను. ఇవి గృహస్థ గ్రంధాలయములు. ఇక రాజభవనములలోను, మఠములలోను, దేవాలయములలోను, పుస్తకభాండాగారములు ప్రత్యేకముగా ననేక ప్రదేశములనుండినట్లు స్పష్టపడుచున్నది. ఇవి సార్వజనిక గ్రంథాలయములు. తెనుగు గ్రంథము లచ్చుపడుటకు ప్రారంభమగు ౧౮౩౫ సం॥ రము నాటనుండి క్రొత్తగ్రంథము లనేకములు బయలుదేరినవి. ఆచ్చు గ్రంథములు హెచ్చయినకొలది నవీన గ్రంథాలయములు లేచినవి. ఇప్పటికి మన యాంధ్రదేశములో ౪౦౦ కు పయిగా లెక్కకు వచ్చినవి. ఆంధ్రదేశజనసంఖ్యను బట్టిచూడు నీ సంఖ్య మిక్కిలి తక్కువయని చెప్పవచ్చును.

ఈ సందర్భమున ప్రథానాంశ మొక్కటి విన్నవింప మఱచితిని. గ్రంథాలయము లభివృద్ధిపొందవలెనన్న ముందుగ మనవాఙ్మయమభివృద్ధి చెందవలెను. సామాన్యజనులకు సులభముగ బోధపడు జ్ఞానదాయక గ్రంధములు మిక్కిలి తక్కువ. అవి అందఱకు బోధపడు మాటలతో వ్రాయబడవలెను. అన్యదేశ పదములు వాడుట దోషమని భీష్మించి కూర్చునియుండినచో పురోవృద్ధియెప్పటికిని రానేరదు. మోటారుబండి, గ్యాసులయిటులు, మాజిక్కు లాంతరు, రెయిలుబండి, బయిసికిలు, కోర్టు, కచేరి, మునుపు మొదలగు - వన్యదేశపదంబు లసఖ్యాకంబుగ ప్రస్తుతము మన వ్యవహారములో వాడుక చేయబడుచున్నవి. వీని సన్ని సంస్కృతములోనికిగాని తెనుగులోనికి గాని భాషాంతరీకరించిన జనులకు వెంటనే తెలియనే తెలియక వ్యవహారము నడువదు. విధిలేనిచోట్ల నట్టిపదము లుపయోగించుటకు మన మనుజ్ఞనియ్యక తప్పదు. అట్లుగాక అవసరము లేనిచోట్ల గూడ నన్యదేశపదంబులు బ్రయోగించుచు గ్రంథములు వ్రాయట, క్షేమసమాచారము తెలుపు నుత్తర ప్రత్యుత్తరములు స్వభాషలో వ్రాసికొనక అవ్యభాషలో వ్రాసికొనుట — ఈ దురభ్యాసములు మనము మానినచో నానాటికి దేశభాషలు కేవలము విస్మృతిలోనికి వచ్చును. నేను “లాష్టు నైటు" వక డ్రామాకు “ఎలెండు” అయినాను చాలా “ప్లీజు" అయినాను. “క్యారక్టర్లు" అన్నిబహు “స్పె౦డిడ్” గా నున్నవి. సీనులు అన్ని మహా "గ్రాండు” గా నున్నవి. “మ్యూజిక్" అంతా నిండా "హోర్మోనియస్సు” గా నున్నది. అందువల్ల హాలులోనల్లా “సైలెన్సు ప్రిజర్వు" అయినది, కాని “డాన్సింగు క్లోజు” అయినప్పుడల్లా “ఆడియన్సు” “లవుడ్, షవుట్సు" ఇస్తూన్నారు. పాట ఆఖరయ్యే సరికి “వన్సుమోరు” అంటుండేవారు. ఇట్టి సంకర పదభరితంబులగు వాక్యములు వాడుక చేయగూడదని వామతము. గ్రాంధిక వ్యవహారిక భాషా భేదంబులచే బుఱ్ఱ బుట్టి నింతగా బ్రద్దలుకొట్టుకొనక యేజయైన నొక మార్గముత్రొక్కి పయి నియమములకు లోబడి సులభశైలిని గ్రంథములు వ్రాసి వాఙ్మయాభివృద్ధి గావి౦తురని దేశాభిమానులను కోరుచున్నాడను. నానుడవులు వృద్ధప్రలాపములుగ భావింపబడిన యెడల తమ యిష్టానుసారముగ నడువవచ్చును.

మఱియు నొక చిన్న విన్నపముచేసేది. మన్నింపవెడదను. గ్రంథాలయములనుండి పుస్తకములను తీసికొనిపోయి చదువువారికి ప్రతిసంవత్సర మొక పోటీపరీక్ష నేర్పరచి అందు నుతీర్ణులగువారికి అధిక సాను