Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.4 (1918).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతను గూర్చియు జాతీయగీతములు బాడిరి. ఆహ్వాన సంఘాధ్యక్షులగు ఊటుకూరి వేంకటగోపాలరావుగారు ప్రతినిధుల నాహ్వానము జేయుచు ఈ క్రింది యుపన్యాసము జదివిరి.

స్వాగతోపన్యాసము.

శ్రీ శ్రీ శ్రీ బృందావనచంద్ర హరిశ్చందన జగద్దేవ నరేంద్రపాలితంబయి, రత్నాకరంబున కవతిదూరంబయి గ్రీస్మాదిత్యపటు ప్రతాపరహితంబయి, విద్వజ్జన సమసిత్ర౦బయి, శ్రీమన్నృసింహదేవభక్తజనసంసేవ్యంబయి తృణాకాష్ఠజలసమృద్ధంబయి చెన్నొందు నీపురవరంబునకు టెక్కలియను నామధేయం బెట్లువచ్చెనో యెరు౦గదగును. దీనికిఁ బురాణ ప్రసిద్ధమగు గాధ యేదియు లేదు. కొని పుక్కిటికతమాత్ర మొకటి కలదు. అది బహుళః నిజమయి యుండవచ్చును. పూర్వ మీ ప్రాంతమునందలి జనులసాధ్య రోగములచే భాధపడుచు నుపశాంతిని గను సాధనంబు గానక తల్లడిల్లుచున్న తఱి నీ స్థలముందు టెక్కలియను పేరుగల చెట్టొకటి యొక సిద్ధునకు గానవచ్చెననియు, నద్దానిని సమూలంబుగ నుపయోగించి వివిధరోగబాధల నాతండు నివారణచేసెపనియు నాటంగోలె నీ ప్రదేశమునకు టెక్కలి యను పేరువచ్చేననియు నానాటి కిది ప్రసిద్ధిగాంచి జగద్దేవలకు రాజధానియయ్యెవని యుఁ జెప్పుదురు.

ఈ టెక్కలిసంస్థానము పూర్వమొకటిగా నుండి కొంతకాలముక్రిందట రెండుభాగము లయ్యెను. టెక్కలి మొదలుగాగల మూడు ఖండములకొకరును, నందిగా మాదిగ మూడు ఖండములకు వేరొకరును రాజు లయిరి. మొదటి భాగమును ప్రస్తుతము పరిపాలించుచున్నవారు శ్రీ శ్రీ హరిశ్చందన జగద్దేవ రాజా బహద్దూరువారు. రెండవ భాగమునకు ప్రభువులు శ్రీ శ్రీ శ్రీ గజపతి బహద్దరుగారు.

లోకములో ప్రతిమానవుండును విద్య నేర్చుకొని, జ్ఞానమును సంపాదించుట యావశ్యకమను న౦శము నే నిక్కడ నొక్కివక్కాణింప నక్కర లేదు. “విద్యా విహీనః పశుః" అను లోకోక్తి తాము విన్నదియే. మన దేశమందు నిర్బంధవిద్యాశాసనము లేకుంటచే ననేకులు విద్యాగంధశూన్యులయి యున్నారు. కీర్తిశేషుగు గోక్లే మహనీయు డీవిషయమయి మిక్కిలి పాటుపడెను గాని వారి ప్రయత్నము వారి జీవితకాలములో సఫలము కాలేదు. సత్పురుషులు వేసిన సబ్బీజము లెన్నటికయిన న౦కురించి వృక్షములు కాకపోవు. కావున మనకు నిరుత్సాహమున కవకాశము లేదు.

ప్రాధమిక విద్యనేర్చుకొని జ్ఞానము సంపాదించు కొనుటకు బోధకులును గ్రంథంబులును ఆసక్తిగల శిష్యులును ఉండవలెను. బోధక గురువు లుండినను బహుగ్రంధపఠనమువలన గాక ప్రపంచవిజ్ఞానము చక్కగ నలవడదు. ఈ గ్రంథములు ద్రవ్యసాధ్యంబులు. ధనహీసులకు దుస్సాధ్యంబులు. కావున వెచ్చటేని గైక్వారు మహారాజువారివంటి మండలాధీశులు గాని పరోపకార ధురంధరులగు కొందరు మహనీయులొక సంఘముగాఁ జేరిగాని గ్రంథాలయములను స్థాపించి అందు పుస్తకములను నెలకొలిపిన ద్రవ్యవిహీనులగు విద్యార్థులకు సుసాధ్యంబులయి జ్ఞానప్రదాయకంబులగును. ఈ గ్రంథాలయప్రతిష్ఠాపనకు మార్గదర్శి శ్రీ శ్రీ శ్రీ గైక్వారు మహారాజాగారు. ౧౯౧౦ సంవత్సరములో వారి రాజధానియందు కేంద్రగ్రంథాలయమును ప్రప్రధమమున స్థాపించిరి. నాటినుండి ఈ గ్రంథాల యోద్యమము బ్రబలి హిందూదేశమంతట వ్యాపించి ప్రతి జిల్లాలోను, ప్రతి తాలూకాలోను, ప్రతి ముఖ్యపట్టణములోను తుదకు గ్రామములోను గ్రంథాలయములు పొడసూపినవి. ఇవి దేశపురోభివృద్ధికి భావి సూచకములు.

ఈ విషయమై నాకుఁదోచిన ముఖ్యాంశములు కొన్ని మనవి చేయవలసియున్నది. కొన్నిస్థలములయందు గ్రంధాలయములు నామమాత్రావశేషములై యున్నవి. పుస్తకములు మెండుగ నుండును. చందాలు బాగుగా నిచ్చుచుందుకు. విరాళంబులు ధారాళంబుగ నొసంగు చుందురు. ఇన్నియు నున్నవి; గాని గ్రంథపఠనము మాత్రము సున్న. వారమున కొక సారియైన పదుగురు గ్రంధాలయ దర్శనమయిన జేయరు. దీనికి ముఖ్యకారణము గ్రంథాలయాధిపతి తాను స్వతః విద్యావంతుడును, జ్ఞానబోధకుడును కాకుంటయే. అతనియందు జనాకర్షణ సామర్థ్య ముండవలెను. తరుచుగ ఉపన్యాసములిచ్చు