Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.2 (1918).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిచ్చిరి. అనంతరము రాయసం వేంకటశివుడు పంతులు యం. ఏ.; యల్.టి. గారు అగ్రాసనాధిపత్యము వహించి ఈ ప్రాగంభోపన్యాసమును నిచ్చిరి:౼

అధ్యక్షులు ఉపన్యాసము.

మిత్రులమరణము.

ఒక వత్సరములోనె మువ్వురు పండితులను గోలుపోవలసిన దురదృష్టము మనమండలమునకుఁ గలిగాను. గత సంవత్సరమున రేపల్లెయందుఁ గూడిన ద్వితీయ గుంటూరుమండల గ్రంథాలయ సభ కగ్రాసనాధిపత్యము వహించిన వంగిపురము కృష్ణమాచార్యులు బి. ఏ. యల్. టి. గారు కొన్ని నెలల క్రిందట పరలోక ప్రాప్తిఁజెందిరి. వీరు సంస్కృతాంధ్రభాషలలో నసమాన పాండిత్యమును గాంచి, జనకజాపరిణయాది నాటకములను రచించి, తమ కోమల స్వభావముచేతను, నిష్కల్మప్రవర్తనముచేతను జనుల పొగడ్తలకుఁ బాత్రుఁడయ్యెను. నిరుడు రేపల్లెలోనే జరిగిన వర్ణాశ్రమధర్మసభ కగ్రాసనాధిపతులగు జంధ్యాల గౌరినాధ శాస్త్రులుగారు ఈ మధ్య నే మృతినొందిరి. వీరు గీర్వాణభాషయందు సమధిక సాహిత్యమును సంపాదించి, ఋజువర్తనమును స్వమతాభిమానమును గలిగి యుండిరి. రెండు మాసముల కిందట చెన్నపురిలోఁ జనిపోయిన రెంటాల వేంకటసుబ్బారావుగారు కృష్ణామండలమున జన్మించి ప్రధమమున గుంటూరున సుద్యోగముననుండిరి. వీరు ఆంగ్లేయభాషలో షేక్స్పియరు నాటక వ్యాఖ్యానములును, కమలామణిలేఖలును, ఆంధ్రమున నవలలు పత్రికలును రచించి తమకుఁ గల యుభయభాషా పా౦డిత్యముచేతను, గ్రంధరచనా నైపుణ్యముచేతను లోకమును రంజింపఁజేసిరి. ఈ మువ్వురి మరణమువలనను గలిగిన నష్టమునకు మనమెంతయుఁ జింతిల్లవలయును.

గ్రంథాలయ చరిత్రము.

గ్రంథాలయోద్యమము నవీనమయ్యను, ఒక విధముగ మిగుల పురాతనమైనదనియ చెప్పవచ్చును. గ్రంథాలయ చరిత్రకాలమును, మూఁడు భాగములుగ విభజింపవచ్చును. మొదటి కాలమున గ్రంధరచన వాగ్రూపముగను౦డెను. రెండవది వ్రాతప్రతుల కాలము. అక్షర సాహాయ్యమున నాకాలమునఁ జెట్లు బెరడు మొదలగు వస్తువులమీఁద పుస్తకములు వ్రాయఁబడుచు వచ్చేను. మూఁడవది ముద్రణా గ్రంథముల కాలము.

(౧) వాగ్రూప గ్రంధములు:౼

మనుష్యుని మానసవీధిని జ్ఞానోదయ మయినపుడె గ్రంథాలయ స్థాపన మారంభమయ్యెవనవచ్చును. ప్రాచీనకాలమున జ్ఞానము లిఖిత రూపమునఁ గాక, వాగ్రూపముననె నిక్షేపింపబడెను. తక్కిన దేశముల స్థితి మనకంతఁగఁ దెలియదు గాని, భరతఖండమునఁ బుస్తకములు వాగ్రూపముననుండు కాలము వేదకాలమని మనకు బాగుగఁ దెలియును. జ్ఞాపకముంచుకొనుట కనువగు రూపమున గ్రంధములపుడు పద్యరూపముననుండెను. మన పూర్వికులట్లేఁతో శ్రమకోర్చి, తాము పఠనము చేసి, తమపిల్లలకు నేర్పనిచో, మన వేదములును శాస్త్రములును నశించియేయుండును. దీనిని సూచించుటకె, వేదములను ప్రప్రథమమున వ్రాయించి ముద్రింపించిన మోక్షమూలరు పండితుఁడు, హిందూ పండితులను “ప్రాద్దేశపు సంచార గ్రంథాలయము”లని వాక్రుచ్చెను. ఇప్పటికిని వేదాధ్యయన తత్పరులగు కొందఱు తరు సంతకమునైన జేయనేరనివారి నచ్చటచ్చటఁ జూచుచున్నాము.

(౨) వాతపతుల కాలము:౼

మనుష్యుడు తాను సముపార్జించిన జ్ఞానమును ముఖ్యముగ లిఖితరూపమునఁ బ్రకటీకృతము చేయుచున్నాడు. లేనిచో కొంత కాలమునకు వాఙ్మయము నశించిపోవును. జ్ఞానము లిఖితరూపమునొందినచో నశింపదను సంగతిని గమనించియే మనపూర్వీకులు, అట్టి లిఖితపుగుర్తులకు అక్షరములు (నశింపక నిలుచునవి) అని నామ మిడిరి. అక్షరములు మొదట చెట్ల బెరడుమీఁదను, పత్రములనిఁదను, తాళ్ళమీఁదనూ, వంటిమీఁదను