యువజన సంఘమువారు తమ గ్రంథాలయమునందు బాలశాఖను ప్రారంభింప వలెననితలంచి, అందులకు కావలసిన సంగతులనెల్ల నేర్చుకొని వచ్చుటకై బెజవాడ రామమోహన ధర్మపుస్తక భాండాగారమున కొక ప్రతినిధినిగూడ బంపిరి.
గ్రంథవిభజన పట్టిక.
ఈ సంఘపక్ష మున ఆంధ్ర గ్రంథ విభజన పట్టికను బరంపురం వాస్తవ్యులగు శ్రీ వెలిదండ శ్రీనివాసరావుగారు విశేషపరిశ్రమకులోనై తయారుజేసి యుండిరి. దానిని పూర్తిజేయుటకై పురాణం సూరి శాస్త్రి గారు పూనుకొనియుండిరి. ఈసభ జరగుకాలమునకు దానిని పూర్తి జేయవలెనని శ్రీశాస్త్రి గారు తలంచియుండిరి. కాని నేను బరోడా వెళ్ళి వచ్చుటతోడనే ఇదివరకు జేయుచున్న గ్రంధవిభజనపద్ధతి సరియైనది గాదనియు శాస్త్రసమ్మతము గాదనియు గోచరించునది. ఒక్క గ్రంధ విభజన విధానమును గూర్చియే వివిధ శాస్త్రవేత్తలు వ్రాసిన గ్రంధములు ఆంగ్లేయ భాషయందు పెక్కులుగలవు. వీనిలో కొన్నిటిని దెప్పించితిమి. గుజరాతి, మహారాష్ట్ర భాషలయందు జేయబడిన గ్రంథవిభజన పద్ధతులను సంపాదించితిమి. ఇవియన్నియు జూచునప్పటికీ, గ్రంధవిభజనపద్ధతిని (Scheme of classification) నిర్ణయముజేయనిదే, గ్రంథ విభజనపట్టికను తయారుజేయుటకవకాశము కాన్పింపలేదు. ఈ సంగతుల నన్నిటిని శ్రీ శాస్త్రి గారితో మనవిజేయగా, వారీ పొత్తములనన్నిటి శ్రద్ధతో బరికించి, మనభాష కనువుగ నుండునటుల గ్రంధవిభజనపద్ధతి నొకదానిని సిద్ధముచేయుచున్నారు. దానిని మీరంద రంగీకరించినయెడల, ఆప్రకారము గ్రంధవిభజన పట్టికను తయారుచేయుదురు.
గ్రంథాలయ ప్రదర్శనము
బరోడాయాత్రకు ఫలితముగ నేడు మీరిచట మొదటి ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రదర్శనమును దర్శింపగిలిగితిరి. హిందూదేశము నంతకును ఇదియే ద్వితీయ గ్రంథాలయ ప్రదర్శనమని చెప్పిన మీ కానంద జనకము సుండదా! మొదటి గ్రంథాలయ ప్రదర్శనము 'బరోడా' రాజ్యమునందు జరిగినది. రెండవరి నేడివట జరుగుచున్నది. ఈ ప్రదర్శనమును మీరందరును జూడబోవుచున్నారు గానీ నేనిచట వివరముగా జెప్పబనిలేదు. ద్రవ్యాభావముచే ఈ ప్రదర్శనమునింకను ఎక్కువజయప్రదముగా జేయజాలమైతిమని మాత్రము విన్నవించు కొనుచున్నాడను.
ఆదాయ వ్యయములు
౧౯౧౬ సం. మే నెల మొదలు ౧౯౧౭ సం॥ ఏప్రియలు ఆఖరువరకు ఈసంఘము యొక్క ఆదాయవ్యయములను నివేదించుచున్నాడను.
