Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.3-4 (1918).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ములనుగూర్చి పద్య కావ్యములుగాని గద్యకావ్యములు గాని హృదయ రంజకముగా రచించినప్పుడే వాఙ్మయమభివృద్ధి చెందును. ప్రచురించిన గ్రంధములు తగినవగునపుడవి చెల్లునటుల చేయుట భాషాభిమానులకు విధి. ఉన్న గ్రంథములే చెల్లనపుడు ప్రోత్సాహములేక కృతికర్తలు కొత్తవి ప్రచురింపజంకుదురు. గ్రంథరచనకు మితియేలేదు, కావున సమర్ధులకు విషయములు లేక పోవు. చదువరులు హెచ్చిన కొలఁదిని గ్రంథములును హెచ్చుగా బయలుదేఱును; మంచి గ్రంథములున్న కొలఁదిని చదువరు లెక్కువగుదురు. కాన, చదువరులును - కృతికర్తలును తమ ధర్మ మొనరించి వాఙ్మయాభివృద్ధి చేయవలయును,

పైభాషలలోనున్న వివిధశాస్త్ర గ్రంథములు మన భాషలోనికి తెచ్చుట బాగు. అర్ధము కాని కొత్త సంస్కృతపదములు వాడుటకంటె వాడుకలోనున్న అన్య భాషాపదములు వాడుటయే మేలు. పావులూరి గణితము, క్షేత్రగణితము, లీలావతి మొదలగు కొన్నియే మనకిప్పటికున్న గణితశాస్త్ర గ్రంధములు, వీనిలో ఉన్న అంశములు చాలతక్కువ. గణితశాస్త్ర సంబంధములగు అంశము లనేకములు తెలిసికొనవలసియున్నది. కానీ వానిని తెలుపుగ్రంధములు వ్రాయుట ఎంతో ఉపయోగకరము. ప్రజల హక్కులను తెలుపు గ్రంధములు తక్కువగా ఉన్నవి. ఈ విషయమును గూర్చి తెలుపు ఆంగ్లేయభాషలోని పెక్కుగ్రంథములు సులభ శైలిని తెనుఁగు చేయవలసియున్నది. అందుకు అనుగుణమైన శబ్దజాలము దొరకనపుడు సుప్రసిద్ధములైన అందలి పదములే ఉపయోగిచుట యుక్తము. ప్రవేశపరీక్ష వఱకును శాస్త్రములు దేశభాషలో నేర్పుట యుక్తమని చాలమంది అభిప్రాయపడుచున్నారు. అందుకు ఉపయోగపడునట్లు బాలురుచదువవలసిన గ్రంధములు నిర్జీవముగా తర్జుమా చేయుటకంటె మృధుమధురమగు శైలిని వ్రాయుట కర్తవ్యము. ఇప్పటికి మనము వాఙ్మయాభివృద్ధికి చేసినపని వాకిలిదాఁటి వారణాసి ఎంతదూరమను స్థితిలో ఉన్నది. కాన, పట్టుదలతో పనిచేసినఁ గాని కావాలసిన గ్రంధములన్నియు వెలువడవు. అందుచే వాఙ్మయాభివృద్ధి గాని కాదు. కావున భాషాభిమానులందఱును ఈ విషయమున తగిన ప్రయత్నము చేయనగును.

గ్రాంథిక భాష - వ్యావహారిక భాష.

ఈ సందర్భమున నేనొక విషయమును గూర్చి మనవి చేయఁదలఁచు కొన్నాను. మనలో కొందఱు మేము గ్రాంథిక భాషావాదులము, మేము వ్యావహారిక భాషావాదులము - అని భేదము కల్పించుకొని, వైషమ్యములు పెంచుకొని ఒండొరులను శత్రువులనుగా చూచుకొనుచు వ్యవహరించుచున్నారు. ఉభయపక్షముల వారును పండితులే; అంతేకాక దేశాభిమానులు. అట్టిస్థితిలో అవసరమగు భాషాసంష్కారము చేయరాదా? అవసరములగు మార్పులు మానరాదా? సామాన్యుఁగు చదువరులకును తెలియునటుల గ్రంథములలో వ్రాయుచు వచ్చిన భాషకు బదులుగా దూప్యములై జనాదరణీయములుగాని పదములు కష్టపడివెదకిచేర్చిన భాష వాడుటేల? భాషనుబట్టి వ్యాకరణముండును. వ్యాకరణమునుబట్టి భాషానిబంధనలు విద్యార్థులకు నేర్పవలసియుండును. కాని, మార్పఁదగిన అంశమైనను ఎప్పటికిని మార్పరాదనుట అనుచితము. అన్ని భాషలలోను కాలక్రమముగ మార్పులు జరగుచునే ఉన్నవి. ఆంధ్రభాషలో గ్రంధములు వ్రాయువారు సాధారణముగా సంస్కృతపండితులగుతచేతను, సహజమగు దేశభాషలలో గ్రంథములు వ్రాయుటవలన విశేషగౌవరములేదని కొందఱు, తలఁచుట చేతను, ఆంధ్ర గ్రంధములు చాలవఱకు సంస్కృతపదములతో నిండిపోయినవి. అంతే కాదు. నన్నయభట్టకృతమని చెప్పు 'ఆంధ్రశబ్ద చింతామణి' సంస్కృతమ౦దే ఉండుట తటస్థించినది! లేకున్న వెనుఁగు వ్యాకరణము పైభాషలో ఉండుట ఏమి న్యాయము? మొన్న మొన్న వ్రాసిన చిన్నయ్య సూరి వ్యాకరణము తెలుఁగుభాషలో ఉన్నను సంస్కృత వ్యాకరణ పరిభాషతో కూడి సంస్కృత పదములతో నిండియే ఉన్నది. మార్పు సజీవభాషకు సహజము. స్థల భేదమును బట్టి పదములకు అర్ధభేదము కలుగవచ్చును. క్రొత్తపదములు వాడుకలోనికి వచ్చుచుండును. క్రొత్తరూపములును వచ్చును. 'మోటారుబండి’, ‘గ్యాను లైటు’ ‘రేడి