Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.3-4 (1918).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరదేశపు రాచకుమార్తె అయియుండును. సుప్రసిద్ధమయిన సప్తశతి మొదట మహారాష్ట్రభాషలో హాలుఁడు వ్రాసినాఁడఁట. దీనినిబట్టియు, ఆంధ్రరాజుల శాసనములన్నియు ఏదోవిధమగు ప్రాకృతభాషలో ఉండుటంబట్టియు ఆంధ్రుల మాతృభాష ప్రాతఁమరాటీ అని అయ్యంగారు వాదించుచున్నారు.

మ-రా-రా- కాశీ నాథుని నాగేశ్వరరావు పంతులు గారు, “హిందూదేశ లిపులకు బ్రాహ్మీలిపి మాతృక” అనియు, 'అశోకలిపినుండి గుహాలిపియు, గుహాలిపినుండి, వేంగిలిపియును, వేంగిలిపినుండి పూర్వ చాళుక్యలిపేయును, పూర్వచాళుక్యలిపినుండి తెలుఁగులిపియును క్రమక్రమముగ వికసించినవి. అనియు సెలవిచ్చి యున్నారు

కావున, ఆంధ్రులకు అసలు జన్మస్థలమేదో, వారి మాతృభాష ఏదో, వారిలిపి ఏదో తెలిసికొని తెలుపుటకు పండితులు పూనుకొందురు గాక!

క్రీ.వె. ౭౭ సం॥ ములో “ప్లయినీ” భరతఖండమును గూర్చి వ్రాయుచు, “ఆంధ్రరాష్ట్రము తక్కిన రాష్ట్రములకంటె బలవత్తరమై, పెక్కు గ్రామములతోడను, ప్రాకారశోభితములగు ముప్పది పట్టణములతోడను, లక్ష కాల్బలముతోడను, రెండువేల గుఱ్ఱపుదళముతోడను, వేయి యేనుఁగులతోడను వెలయుచున్నది" అని వ్రాసియున్నాఁడు. ఆకాలపు నానా దేశ శాసనములందు ఆంధ్రులనుగూర్చి ఉదహరించి యుండుటచే వారప్పుడు భరతఖండమందంతట ప్రబలులయియుండ వలెను. పడమటి సముద్రము మొదలు తూర్పు సముద్రము వరకును, ఉత్తరమున సాంచివరకును మధ్య భరతఖండమును వారుపాలించుచుండిరి. “ప్లయినీ” వ్రాసిన కాలములోనే "పెరిప్లస్స"ను చారిత్ర కారుఁడ, బారిగజ బ్రోచి) కు దక్షిణమునందలి దేశము దక్షిణాపధమని వ్రాసి యున్నాఁడు. ఆంధ్రదేశమును దక్షిణాపధమని స్పష్టముగా తెలుపుటకు ఇదే మొదలు. అదే ఇప్పటి దక్కను, దక్షిణాపధపదము ఋగ్వేదములోను, సౌరాష్ట్రపదముతో కలిసి బౌధాయన ధర్మసూత్రములోను కానవచ్చుచున్నది. అది మహాభారతమున సభాపర్వములోను, మహాభాష్యములోను కూడ ఉన్నది. ప్రతిస్థానపురమును, కళ్యాణ నగరమును దక్షిణాపధములోని ముఖ్యవర్తకస్థలములని చెప్పుటచేత దక్షిణాపధము ఆంధ్రదేశమే అని ఒప్పుకొనక తప్పదు.

శకవంశస్థులకును ఆంధ్రులకును చిరకాలము యుద్ధములు జరిగి, నానాఁటికీ ఆంధ్రరాష్ట్రము క్షీణిఁచినది. శకక్షాత్రపుఁడగు రుద్రదమనుఁడు క్రీ.సె.౧౫౦ సం॥ ములో రెండవ విలివాయకురుని కుమారుఁడును - తన అల్లుఁడును, 'దక్షిణాపధప్రభువు' నగు పులిమాయితో పోరి, అతనిని జయించెను గాని, బంధుత్వమును బట్టి ఆతనికీ హానిచేయక వదలివేసెను.

ఆంధ్రరాజుల నాణెములమీఁది భాషకూడ ప్రొకృతమే. మొదటి నాణెములు కొల్హాపురములోను, తరువాతి నాణెములు కృష్ణా గోదావరీ మండలములలో మాత్రము దొరకినవి. పడమటినుండి శకులును, దక్షిణమునుండి పల్లవులును రాష్ట్రముల నలముకొనినపుడు వారి యేలుబడిలో ఉండిన దేశము ఆ రెండు జిల్లాలే. అదే వేగిదేశము.

క్రీ.వె. మూడవ శతాబ్దములో, ఆంధ్రుల పడమటి రాష్ట్రములు ఉజ్జయినీ నగరమున పరిపాలనము చేసిన శకవంశస్ధులకు స్వాధీనములైనవి; తూర్పుననుండు ఆంధ్రరాష్ట్రము పల్లవులాక్రమించుకొనిరి. నాల్గవ శాతాబ్దారంభమున ధాన్యకటకము పల్లవ రాష్ట్రాధికారికి రాజధానిగా ఉండె. ౩౪౦ సం॥ములో సముద్రగుప్తుఁడు దిగ్విజయము చేసినపుడు పెద వేఁగి రాజధానిగా ఉండిన పల్లవరాజప్రతినిధి అగు హస్తివర్మను అత్తఁడు జయించె. కాని, మూడవ శతాబ్దము నుండియు ఆంధ్రరాజులను గూర్చి కాని ఆంధ్రజాతులనుగూర్చి కాని ఎక్కడను ఏజాడయును కనఁబడదు. అప్పుడు ఆంధ్రశబ్దము దేశనామముమాత్రమయ్యె. ఏడవ శతాబ్దములో వచ్చిన చీనాబాటసారి హ్యూనుత్సాంగు ఇప్పుడు బీరారు అని వాడుకలోనున్న దక్షిణ కోసలమునుండి తాను ఆంధ్రదేశమునకు వచ్చితిననియు, దానిరాజధాని "వేఁగినాఁడు" అనియు, భాష భేదమనియు, లిపి ఇంచుమించుగా కోసలదేశస్థుల లిపివంటిదే అనియు వ్రాసి యూన్నాఁడు. వేగినాఁటిలో వాడుకలో నుండిన.