Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సద్గ్రంథములను సేకరించి అందరికిని గ్రంథాలయము లెట్లు అందజేయుచున్నవో కొంచెము చూడగలిగిరి. బాలశాఖలయొక్కయు, కథలు చెప్పుట యొక్కయు గ్రంథాలయములు పఠనమందిరములు చేయుచున్న ఇతర పనులయొక్కయు ఫొటోగ్రాఫలు గోడలమీద అలంకరింపబడియున్నవి. పాఠశాలలకు గ్రంథాలయములెటుల ఉపకరింపవలయునో అచ్చట జూపబడినది. గోడల మీద అంటింపబడిన పటములు జనులకు అమితముగ ఆకర్షించినవి.

ఆదర్శప్రాయముగ దీసికొనదగిన ఒక పట్టణమునందు కేంద్ర “గ్రంథాలయ శాఖల యొక్క పద్ధతులు ఎటుల నిర్వహింపబడుచున్న విడియో ఒక పటమునందు జూపిరి. ఇంకొకపటమునందు శాఖలు చేయుచున్న పనినిజూపు ఫొటో గ్రాఫులను దీనికి ప్రక్కనే ప్రదర్శించిరి. గొప్ప పట్టణముల యందు నివసించునట్టి జనులు గూడ తమపట్టణముల యందున్న కేంద్ర గ్రంథాలయములు శాఖల సహాయమువలన ఎట్టిపని నిర్వహించుచున్నము అదేవరకు తెలియక ఈ ప్రదర్శనమునందు జూచి ఆశ్చర్యనిగ్నమానసులైరి. ఇతర ప్రదేశములనుండి తమ గ్రామమునకువచ్చువారలకు, గ్రుడ్డివారలకు, కళా శాస్త్రవేత్తలకు, సంగీత ప్రియులకు, వర్తకులకు, శాస్త్రకారులకు, వివిధ తరగతుల విద్యార్ధులకు వారు వీరననేల, సర్వజనులకు గ్రంథాలయము లెటుల ఉపకరించుచున్నవో వేరోకచోట జూపిరి.

ఇంకొక భాగమునందు వివిధరకముల గ్రామ గ్రంథాలయములు జూపబడినవి. అందే "మసాచుసెట్స్ముస్" అను భాగము యొక్క పటమున అందున్న గ్రంథాలయముల పటములు వేయబడినవి. దానికి ప్రక్కనే "కాలిఫోర్నియా" యందొక భాగమున ఉన్న గ్రంథాలయముల పటములు జూపబడినవి. ఈ రెండు పద్ధతులును ఒక చోటనే ప్రదర్శించుటవలన వానికిగల తారతమ్యము చూపరులకు సులభముగా బోధపడుచుండును.

"కాలిఫోర్నియా" రాష్ట్రమున గ్రంథాలయములు చేయుచున్న పనిని, సినిమెటోగ్రాఫు యంత్రమునగూడ జూపిరి.

గ్రంథాలయ శాస్త్రమునకు సంబందించిన పుస్తకములు పత్రికలకు మితమేలేదు. గ్రంధములపేరుట, వర్గీకరణము జేయుట, బైడింగు చేయుట, మొదలగు విషయములను గూర్చి చూపరుల కనేకవిధములగు విషయములను జూపేరి. అమెరికా దేశమునందున్న కాంగ్రెసు మహాగ్రంథాలయము నూతన " న్యూయార్కు” పౌర గ్రంథాలయములయొక్క భవనములు మొదలు చిన్న పల్లెటూరి గ్రంథాలయముయొక్క భవనమువరకును తారతమ్యములనుమాపుచు వివిధతరగతుల గ్రంథాలను భవనముల “ప్లానులను” పటములను జూపిరి. నూతన గ్రంథాలయములను నిర్మింపదలచుకొనిన అనేకమంది జనుల కీపటములు మిక్కిలి సహాయభూతములై యొప్పినవి.

వివిధ ప్రదేశములయందున్న గ్రంథాలయ శాస్త్రమును బోధించు పాఠశాలల యొక్క పనిని వేరొకచోట బూపిరి. ఆయాపాఠశాలల పటములను, పట్టికలను, కొన్ని పరీక్షా పత్రములను, ప్రదర్శించిరి. న్యాయశాస్త్రము, వైద్యశాస్త్రము, మొదలగువానివలెనే గ్రంథాలయ శాస్త్రమునందుగూడ పండితులై జనులకుపకరించుటకు ప్రత్యేకముగ శిక్ష అత్యంతావసరమని ఈ ప్రదర్శన భాగము జూచుటవలన జనులకు బోధపడినది.

ఇంకొక స్థలమునందు అమెరికాదేశ గ్రంథాలయ సంఘమువారు గ్రంధాలయములకు సంబంధించిన విషయములనుగూర్చి ప్రకటించిన గ్రంథములనన్నిటిని ప్రదర్శించిరి. ఈ ప్రదర్శనమును జూచుటకై ౫౦,౦౦౦ జనులువిచ్చేసిరి. ఈప్రదర్శనమును జూచివచ్చి, అందలి సంగతులను తమతమ దేశములయందు వ్యాప్తముచేయుటకై, చైనా, స్పెయిను, స్వీడను, జపాను, ఇండియా దేశములనుండి, ప్రత్యేక ప్రతినిధుల నీప్రదర్శనమునకు పంపబడిరి. ఈ ప్రతినిధులందరును అనేకదినములు ప్రదర్శనమును జూచి, దానిని గురించి విపులముగ తమతమ భాషలయందు వ్రాసి, ఆ యాదేశములయందెల్ల వ్యాప్తముజేసేరి. వారికి కావలసిన సంగతులన్నియు ప్రత్యేకముగ దెలుపబడినవి. ఈ విధముగ ఈ ప్రదర్శనము అమితముగ ఉపయోగకారియయ్యెను.