Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శివధర్మోత్తరఖండములోని పైపద్యమువలన మల్లారెడ్డి కవి నివాసమగు బిక్కనవోలు నైజాము రాష్ట్రములోని మెదుకుసీమకుఁ జేరిన బిక్కనవోలని స్పష్టమగుచున్నది. బిక్కనవోలులో రాజ్యము స్థాపించిన కాచనరెడ్డికి మల్లారెడ్డి యైదవపురుషుఁడు. దీనఁజేసి మల్లారెడ్డి నిజాం మండలవాసియని వెల్లడి యగుచున్నది. నేఁటివఱకు నీ వంశీయులు తమ పవిత్రములగు నామములతో గట్టించిన గ్రామములు వీరి సంస్థానమునకు లోబడి దోమకొండకు పదిమైళ్ళకు లోపుగానున్నటుల నుమాపత్యభ్యుదయమందలి

సీ.⁠

 క్షామమ్ములేదు జంగముపల్లికేనాఁడు
నీ నాఁటికొసఁగు బదేనువేలు
మహీమనొప్పెసఁగుఁ గామారెడ్డిపేటన
పదమూఁడువేల రౌప్యమ్ములొసఁగు
సారవంతమగు నెల్లా౦డ్డిపేట ప
దేనువేలకుఁ గొఱయియ్యదెపుడు
లక్ష్యంబులేదు మల్లారెడ్డిపేటకు
నిండుగానోసఁగుఁ బంట్రెండువేలు

⁠


గీ.⁠

 ఈ పురము లెల్ల పదిమైళ్ళ కెచ్చులేక
దోమకొండకు నల్లంత దూరమునను
స్వీయనామాంకితమ్ములౌ చెఱువులెనసి
కరమొసంగు సుభికుంబుఁ గలిగియపుడు.

⁠

పై పద్యములోని పల్లియలు నాలుగు ప్రకృతకవియగు మల్లారెడ్డి యన్నలగు మువ్వురి పేరుతోను దనపేరుతోను గట్టింపఁ బడినవి. కావున మల్లారెడ్డి నివాసము దోమకొండ యనియు నతని పూర్వుఁడగు కాచరెడ్డి మాత్రము బిక్కనోలులో రాజ్యము స్థాపించెననియు ఆబిక్కనోలు కూడ గోదావరి మండలములోనిది కాదనియు వీరభద్రారెడ్డికి మల్లారెడ్డి కెట్టి బాంధవ్యము లేదనియు పైయాధారములవలన స్పష్టమగుచున్నది. కవివంశీయులు నేఁటికి హైదరాబాదులోను దోనుకొండయందున్నారు. వీరు గద్వాల ప్రభువులకు బంధువులు. ఈ సంస్థానము సంవత్సరమునకు మూడులక్షల యాదాయము కలదిగ నున్నది. మల్లారెడ్డి యన్న కామిరెడ్డి సూతసంహిత కృతి చెందియున్నాఁడు. కామిరెడ్డి మల్లారెడ్డి యన్నయని యిదివఱకె వాకొని యున్నారము. ఈ కామిరెడ్డి పైకృతినొందినటుల శివధర్మోత్తరమునఁ చెప్పఁబడియె యున్నది.

సీ.⁠

 మున్ను నీయన్న లభ్యున్నతిగాఁ గామి
రెడ్డివర్యుఁడు నెల్లరెడ్డిమాళి
సూతసంహితయు నా జోకబ్రహ్మోత్తర
ఖండంబులంది రఖండ పటిమ...

⁠

ఆను పద్యమందలి క్రమాన్వయముచేఁ గామిరెడ్డి మల్లారెడ్డి కగ్రజుఁడనియు సూతసంహిత కృతినందెననియు స్పష్టపడుచున్నది. కావున సరస్వతిసోమయాజికవి మల్లారెడ్డికి సమకాలికుఁడు. మల్లారెడ్డి యన్న కాచారెడ్డి నిజాము ప్రభువువలన సనదుల హిజరీ ౧౦౫౫ సరియగు క్రీస్తుశకము ౧౬౭౭ సంవత్సరము ప్రాంతమున పొందినటుల స్పష్టపడినది. శ్రీ పంతులువారు మల్లారెడ్డి విషయమై వ్రాసిన యుపన్యాసమున నిన్ని దోషములు కలవు. సుధీలోకము సంశయములున్న చర్చించి, పరిషత్తులో సంచార కార్యదర్శులమై మేము స్వయముగఁ దిరిగి తిరిగి కనుఁగొన్న యిందలి యంశములను చరిత్రాధారములను విశ్వసించి యధార్థము గ్రహింపఁ బ్రార్థితులు. ప్రకృత మల్లారెడ్డి వంశీయులగు శ్రీరాజా రామచంద్రరావు బహద్దరు వారు శివధర్మోత్తరము నిర్దుష్టముగా ముద్రింపించి భాషా పరిచయుల కుచితముగ నొసంగుచున్నారు. సుప్రసిద్ధులగు కవులనేకులు రచించిన ప్రబంధము లనేకములు వీరి సంస్థానమున సముద్రితదశలో నున్నవి. శ్రీ రాజావారాగ్రంథములకుఁ గూడ ముద్రణభాగ్యము లభింపఁజేసి స్వవంశయశము లోకమున విస్తరింపఁజేయఁ బ్రాధి౯తులు.

- శేషాద్రి రమణ కవులు, శతావధానులు.