Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయ కృష్ణామండల గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ *[1]

ఆగ్రాసనాధిపతిగారగు కోటగిరి వేంకటకృష్ణారావుబహద్దరు వారి ప్రారంభోపన్యాసము

ఆర్యాగ్రేసరులారా! సభ్యులారా! ఆంధ్రకవులలో నుత్కృష్టులగు పింగళి సూరన, సిరిప్రగడ ధర్మనామాత్యుఁడు, ములుగు పాపయారాధ్యుడు మొదలగు మహాకవులకు జన్మస్థానమగు నీకృష్ణామండలమునుండియే ఈ గ్రంథాలయ ప్రతినిధులు సమావేశమగుటయు, బౌద్ధస్థూపములకును చారిత్రోపయోగకరములగు శాసనాదులకును నెలుగు నీజగ్గయ్యపేటలోన ద్వితీయ కృష్ణామండలగ్రంథాలయ సభ నొనరించుటయు, మిగుల నొప్పియున్నది. పండితవేష్టితమగు నీ సభాస్థానమున, గ్రంథాలయములయొక్క భాషాస్థితిగతుల యొక్కయు బాగోగులు చర్చించి వాకొనఁగల మహామహులీ సభను పలువు రలంకరించియుండ నాకీయగ్రాసనాధిపతిత్వమొసంగుట మీకు నాయందుఁగల యపార వాత్సల్యమువలననే యని తలంతును.

ఏనిందుల కనర్హుఁడవని యెఱింగియు బహుజనాభి ప్రాయమునకు భిన్నముగఁ జరిగింపనోపక సాహసించి ప్రారంభోపన్యాస మొనరించుచున్నాఁడను.

ఆంధ్రవాఙ్మయము

మనము ప్రకృతము చర్చింపఁబోవు న౦శము ఆంధ్రవాఙ్మయమునకు సంబంధించినది. కాన నాంధ్రభాషాస్వరూపము, ఆంధ్రభాషౌన్నత్యము, లోనగు న౦శములు విచారింతము. ఆంధ్రవాఙ్మయచరిత్రము విచిత్రముగ నున్నది. ఆంధ్రభాష యింతకాలము క్రింద గ్రాంధిక భాష యైనదని గాని, యాదికవి యితఁడని గాని, భాషాద్యావస్థ యిటులున్నదనిగాని, వాకొనుటకుఁ దగిన యాధారములు కానరావు. కాని ఆంధ్రదేశప్రశంస యణఁ నాంధ్రులప్రశంసయుఁ బ్రాచీన గ్రంధముల యందు నాలుగు వేల సంవత్సరములకు బైకాలమునుండి కానవచ్చుచున్నది. మహాభారతమున వ్యాసమహర్షి "ఆంధ్రాంశకాః పుళిందశ్చ యవ నాశ్చనరాధిపాః” అని యాంధ్రులఁ బ్రశంసించి యున్నాఁడు. రామాయణమున వాల్మీకి మహర్షి “తధైవాంథ్రాశ్చ పుండ్రాంశ్చ చోళా౯ సాండ్యా౯ సకేరళా౯" అని కిష్కింథాకాండమున నాంధ్రదేశమును బ్రశంసచేసి యున్నాఁడు. దీనింబట్టి ఆంధ్రదేశము రామాయణ భారత రచనా కాలమునకు అనఁగా క్రీ.పూ ౪,000 సంవత్సరముల క్రిందనే ప్రశంసార్హముగ నుండుటచే నాంధ్రులు అర్యావత౯మున జిరకాలము నుండి నివసించుచుండిరని తెలియుచున్నది. కాని యాంధ్రులందఱు నాకాలమున మనమిపుడు వాఁడు తెలుఁగు నే మాటలాడుచుండిరనిగాని, వాఙ్మయమప్పటికే సంస్కరింపఁబడెననిగాని, ఆంధ్రభాష కప్పటికే వర్ణమాల సృజింపఁబడెననిగాని వాకొనుట కాధారములు కానరావు. ఆంధ్రవంశ్యులగు రాజులు నాగరికులై క్రీస్తుశకాబ్దమునకు మూఁడువందల సంవత్సరములకుఁ బూర్వమునుండి యించుమించుగా నాలుగైదువందల సంవత్సరములు మగధ, కర్ణాట, మహారాష్ట్ర, ద్రావిడ దేశములు పాలించిరి. వీరలకు ముఖ్య రాజ్యస్థానము మగధ రాజ్యములోని పాటలీపుత్రమైనను, రెండవ రాజ్యస్థానము ఆంధ్రదేశమధ్యమున నున్న గుంటూరు కుండలమునకుఁ జేరియున్న ధరణికోట. దీనినే యాకాలమున ధాన్యకటకమని ప్రాచీనులు వ్యవహరించి యున్నారు. ఆకాలమున నాంధ్రగాజులఁదఱు తనుశాసనాదులు ప్రాకృతభాషలో వ్రాసి యున్నారు. అట్టిశాసనములు ధరణికోట, భట్టిప్రోలు, ఘంటసాల లోనగుచోటులఁ గానవచ్చుచున్నవి. పిమ్మట మనదేశముపాలించిన పల్లవులు, చోళులు గూడఁ దమశాసనాదికములఁ బ్రౌకృతవర్ణములతోఁ బ్రాకృతభాషలోను

  1. ↑ ఈ సభ ౧౯౧౭ నం. ఏప్రియలు నెల ౮ తేదీన జగ్గయ్యపేట పట్టణమున జరిగినది.