కీ॥శే॥ వల్లూరి సూర్యనారాయణరావుగారి స్మరణము
శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఎం.ఎ.
నాకప్పుడు ఇరువదినాలుగు సంవత్సరముల వయస్సు. అప్పుడప్పుడే 'వందేమాతరం' ఉద్యమము చెలరేగినది. బెజవాడ బందర్లలో నా జీవిత నాటకము కొంత సాగినది. అంతకు మున్నే రాజమండ్రి హంటరు గడబిడలు ముగిసియుండినవి. ఆంధ్ర జాతీయ కళాశాల స్థాప నోద్యమమును ఆరంభించియుండినాము. శ్రీ వల్లూరి సూర్యనారాయణ రావుగారి పరిచయము నా కప్పుడు కల్గినది.
★ ★ ★ ★
శ్రీ సూర్యనారాయణ రావుగారు నాటికే వకీలు. కొంత పేరు ప్రతిష్ఠలు కలవారు కాని, మొదటి శ్రేణిలోనివాడు కాడు. అన్యాయమును అక్రమమును సహింపని పట్టుదలమానిసి, అధికారులకు గిట్టదు. అందుచేత ఐశ్వర్యపు మెట్లు ఎక్కుట సులభ సాధ్యము కాలేదు.
★ ★ ★ ★
రాజకీయములలో నాడు తిలకు దే పెట్టిన పేరు. పాల్ బాల్ లాలని విపిన చంద్రపాల్ లాలాలజపతిరాయి పేళ్లు బాలగంగాధరతిలకు పేరుతో చేర్చి లోకులు ఉచ్చరించుచుండినా రాజకీయ సిద్ధాంతానికి మాత్రము తిలకే గురువు, నాయ కుడు. అందరికివలెనే సూర్యనారాయణ రావు గారికిన్నీ నాడువచ్చిన ఆసిద్ధాంతాలు ఆజన్మము వంటబట్టినవి. మానవప్రకృతి శుద్ధ సత్వము గాదు. రాజస తామసములలో మేళవించినది. సత్యమాత్ర ప్రాధాన్యము. ఆ కారణముచేత జీవితమున మిథ్య. ఒండొరులు సహించుకొని బ్రతుకువరకు సర్వమును సాధింపవచ్చును. పరస్పర సహనము మృగ్యమైనచోట పరస్పర సహకారము మృగ్యమగును.
కాబట్టి భారత రాజకీయములలో కూడ ప్రభుత్వముతో హీనసహకారము గాని పూర్ణఅసహకారముగాని ఈ కారణముచేత సిద్ధింపవు. గౌరవప్రదముగా సహకారము సాధ్యమైన జరుపదగును. అట్లుకానిచో ఎదుర్పాటు అసహకారము తప్పని విధి. ఇది తిలకువిశ్వాసము. తరచిచూచిన తుదకు గాంధీతత్వమును ఇంతే యగును. గాంధీతత్వమని ప్రత్యేకించువారు ఈసమన్వయము నొప్పుకొనరు. వల్లూరి సూర్యనారాయణ రావుగారు ఈసమన్వయమును చేసికొనినవారని నావిశ్వాసము.
★ ★ ★ ★
రాజకీయాభిప్రాయములమాట ఎట్లున్నను సాంఘిక మతవిషయములలో రాజకీయమునందు వలెనే సూర్యనారాయణరావు స్వతంత్రవాది. కాబట్టి, మొదటినుండియు సంఘసంస్కారమునందు పట్టుదలచూపినాడు. జమీందారుల బారినుండి రైతులను సంరక్షింప పాటుపడినాడు. ధర్మాదాయముల సంరక్షణయందు దీక్ష వహించినాడు. తుదకు తానే ధర్మములను స్థాపించి నిర్వహించుచు ప్ర్రాణము సమర్పించినాడు.
★ ★ ★ ★
వల్లూరి సూర్యనారాయణరావుగారి రాజకీయ సాంఘిక మతవిషయ జీవనముకంటె అతని గృహజీవనము లోకమునకు ఆదర్శప్రాయము. పుట్టిన కుటుంబమా బీద కుటుంబము. వకీలుగా సంపాదించిన ఆర్జనా వేలతో లెక్క పెట్ట దగినది గాదు. ఇట్లుండియు రమారమి లక్షరూపాయలు చేర్చి డెబ్బదివేలు ధర్మములకిందనిచ్చి వ్యక్తి పుణ్యము గణించినాడన ఈతని జీవితము