Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.1 (1936).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7. గ్రంధాలయ సర్వస్వ ప్రకటనశాఖ

సంపాదకులు: శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు, శ్రీ అయ్యంకి వెంకటరమణయ్యగారు

ఈ శాఖయొక్క ప్రత్యేక నిబంధనలు:

1. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘపక్షమున పత్రికను ప్రకటించవలెను.

2. దీని లెక్కలను ప్రత్యేకముగ నుంచవలెను.

3. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘసభ్యులలో రు. 3 ల చందానిచ్చువారందరికి ఈ పత్రిక ఉచితముగా పంపవలెను

4. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమునకు రు 3 లకు తక్కువ కాని చందాయిచ్చు ప్రతిసభ్యు డొక్కింటికి గ్రంథాలయ సర్వస్వశాఖకు కర్చులకుగాను రు 2 లు జమకట్టుచుండవలెను.

5. ఈ శాఖకు సంబంధించిన అచ్చు, ప్రకటన, ఉద్యోగుల నేర్పరచుట, జమాకర్చులు చేయుట మొదలగు అన్ని ఏర్పాటులు వగైరాలు యావత్తు ఈ శాఖ వారే నిర్వహించవలెను.

6. ఈ శాఖయొక్క కర్చులకు గాను ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము వారు సంవత్సరమునకు రు 600 లు ప్రత్యేకము విరాళముగ జనరల్ ద్రవ్యములో నుండి యిచ్చుచుందురు.

7. పైని వివరించిన రు 600 లును, ప్రతిసభ్యునకు గంథాలయ సర్వస్వము పంపుటకు ఇచ్చు రు 2 లు, ప్రకటన ద్రవ్యము, ఇందునకు ఇచ్చు ప్రత్యేక విరాళము ఈ శాఖయొక్క ఆదాయములు

8. గ్రంథాలయ సర్వస్వమునకు వచ్చు ద్రవ్యములో మిగిలినది ఈపనికై ప్రత్యేక నిధిగా ఉంచవలెను.

9. ఈ శాఖా సభ్యుల నిర్ణయము ననుసరించి ఈ శాఖ వారు తమలోనివారికి గాని, ఇతరులకుగాని గౌరవభృతుల నీయవచ్చును.

10. అవసరమును బట్టి ఉచితముగా పంపు పత్రికలను ఈ శాఖవారే నిర్ణయింపవచ్చును.

హరిసర్వోత్తమరావు, అధ్యక్షులు

10-3-1936

ఓమ్

బెజవాడ నగర గ్రంథాలయ సంఘము, బెజవాడ

బెజవాడ నగర గ్రంథాలయ సంఘ చతుర్ధ వార్షికోత్సవము ది 8-3-36 ని, బెజవాడ రామమోహన ధర్మ గ్రంథాలయ భవనమున మద్రాస్ మేయరు జనాబ్ అబ్దుల్ హమీద్ ఖాన్ B. A. M. L. C. గారి యాజమాన్యమున జరిగినపుడు కార్యదర్శి మల్లెల శ్రీరామమూర్తిగారు చదివిన నివేదిక.

నేటి కాలమున ప్రజల విజ్ఞానాభివృద్ధికి గ్రంథాలయము లత్యంత సహకారముగ నున్నవని ఎల్ల రంగీకరించిన విషయము. భారత వర్షమున గ్రంథాలయోద్యమము దినదినాభివృద్ధి గాంచుచున్నది. అందు ఆంధ్రదేశము ఇతర రాష్ట్రములకంటే వేయుచున్నది. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము ద్వారా గ్రంథాలయోద్యమము తెనుగునాట వృద్ధిగాంచుచున్నది. జిల్లా సంఘములు, తాలూకా సంఘములు ఏర్పడి పల్లెలలో ప్రచారము చేయుచూ ప్రజల విజ్ఞానమును పెంపొందజేయుచున్నవి. అట్లే పెద్ద నగరములలో కూడ ప్రత్యేక నగర గ్రంథాలయ సంఘములు స్థాపింపబడి గ్రంథాలయోద్యమాభివృద్ధిచేయుటా అవశ్యక మైయున్నది. ఆకారణముననే ౧౯౩౨ వ సంవత్సరమున బెజవాడ నగరమున ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ అయ్యంకి వేంకటరమణయ్య పంతులుగారిచే ఈ సంఘము స్థాపింపబడి యథాశక్తిని పనిచేయుచున్నది. ఈ సంఘమును స్థాపించుటలో గల ముఖ్యోద్దేశములు.