పుట:Grandaalayasarvasvamu sanputi 7sanchika 1jul1928.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొరకు వెచ్చించబడిన ద్రవ్యమంతయు ప్రజలే యిచ్చుచుండిరి. అచ్చటచ్చట నుండు దేశసేవా పరతంత్రులందరును తమ శక్తియుక్తుల నన్నిటిని ఇందుకొరకై ధారవోయుచుండిరి. ఇప్పటికాలమున పూర్వకాలముకన్న ప్రజాసంస్థల సంఖ్య మిక్కిలి హెచ్చినది. దేశసేవకులలో కొందరు ఒక యుద్యమ మందును మరికొందరు మరియుక యుద్యమమునందును అభిమానము కల్గియున్నారు. మనదేశమున "కొత్తో వింత, పాతో రోత" అను సామెతకు ఉదాహరణము చాలవరకున్నది. కాబట్టి ఈకారణము లన్నిటిచేతను గ్రంథాలయసంస్థ పూర్వపు అభ్యున్నతి పదవినుండి జారి వెనుకటిశోభను గోల్పోయినది. కావున ఈయుద్యమము యొక్క పరమస్రావ్యమును గూర్చియు తత్సిద్ధికొర కవలంబించ వలసిన సాధన విధానమును గూర్చియు వర్తమాన దేశకాల పరిస్థితుల కనువుగ నుండునట్లు తిరిగి ఈకాలమున విమర్శించుట ముఖ్యావసర మైయున్నది.

మన మాతృదేవతారాధన కొరకై పలువురు పలువిధముల కృషిచేయుచు భారతజాతికి అభ్యున్నతిని సంపాదించుచున్నారు. ఇందు కొరకెన్నియో సంస్థ లుద్భవిల్లినవి. వీనికన్నిటికి మూలాధారము ప్రజల జ్ఞానాభివృద్ధి. చేతిలో బంగారమున్నచో నగలెన్నియో చేయించుకొనవచ్చును. అట్లే జ్ఞానమును.

మనదేశపు జనులలో నూటికి తొమ్మండుగురుమాత్రము చదువునేర్చినవారు. తక్కినవారందరు నిరక్షరకుక్షులు. ఈతొమ్మండుగురిలో కూడ అత్యల్పసంఖ్యాకులు మాత్రమే విద్యావంతులై తన్మూలమున నిజమగు సౌఖ్యమును పొందగల్గిన వారు. ప్రస్తుతము మనదేశపు విద్యాశాలలును, దొరతనము వారిచే స్థాపించబడిన గ్రంథాలయములును ఈ అత్యల్ప సంఖ్యాకుల జ్ఞానాభివృద్ధికొరకు మాత్రమే ప్రవర్తించుచున్నవి. మిగిలిన జనసామాన్య మందరిని గూర్చియు మన దేశమున ఎట్టి కృషియు జరుగుచుండుట లేదు. వీరల నందరి నుద్ధరించుటకొరకే ధర్మగ్రంథాలయోద్యమ మవతరించినది.