(6) భారతీతీర్థపక్షమున గ్రంథాలయోద్యమము ప్రచారము చేయుటకు డిపార్టుమెంటును యేర్పరచవలసినదని తీర్మానించి అందుకు డాక్టరు బుర్రా శేషగిరిరావు (అధ్యక్షులు) తిత్తి బలరామయ్య (కార్యదర్శి) వి. ఎస్. శర్మ (అడయారు), జగన్నాథపాడీ, గిడుగు సీతాపతి, కోన వెంకటరాయశర్మ, తూముల కృష్ణమూర్తి, విద్వాన్ గంటి సోమయాజులు, కొండపల్లి జగన్నాథదాసు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగార్లు గల ఉపసంఘమును ఏర్పరచిరి.
ఆంధ్రగ్రంథాలయసభ - దక్షిణాది.
రామనాథపురం జిల్లా సాతూరు శ్రీవెల్లిపుత్తూరు తాలూకాల ప్రథమ ఆంధ్రగ్రంథాలయసభ సాత్తూరుగ్రామమున కమ్మవారి మందిరమున ది 24-6-28 తేదీ ఉదయం 8 గంటలకు సమావేశమైనది. రెండు తాలూకాలలోనిగ్రామపంచాయితీలు సంపాదించిన గ్రంథములు ప్రదర్శింపబడినవి. షుమారు 5 వేల గ్రంథములు 140 గ్రామపంచాయితులనుంచి ప్రదర్శనమునకు వచ్చినవి. ఆనరబుల్ వేమవరపు రామదాసు పంతులుగారు ప్రదర్శనమును తెరచిరి. ప్రదర్శనమునకు తేబడిన వివిధశాస్త్ర గ్రంథములను, పంచాయితుల పుస్తక భాండాగార వ్యాప్తికి చేయుచున్న కృషియు, పంచాయితీ ఆనరరీ ఆర్గనైజ రగు అళగిరిస్వామినాయుడుగారు పరిచయము చేసిరి. రామదాసుపంతులుగారు ప్రదర్శనమును తెరచుచు విద్యావ్యాప్తికి పాశ్చాత్య దేశములో పుస్తకభాండాగారోద్యమ మెట్లుపనిచేయుచున్నది తెలియజేసి, విద్యాభ్యాసము, బడులలో ముగిసిన తరువాత గ్రామపు బడులలో చదివిన చదువు మరచిపోకుండ పాఠశాల విడిచినతరువాత జనులలో సద్విద్యావ్యాప్తికి పుస్తకభాండాగారము లెట్లు యుపకరించునో వివరించి చెప్పిరి. సంచార పుస్తకభాండాగారములు బరోడా సంస్థానములో యెట్లు పనిచేయుచున్నవో తెలిపిరి.