పుట:Grandaalayasarvasvamu sanputi 7sanchika 1jul1928.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యేగ్రంథాలయము. అంతేగాని దుమ్ము కొట్టుకొనియున్న గ్రంథసంపుటములను భద్రపరచునట్టిది కాదు.

గ్రంథాలయములను జనులు ఉపయోగించుటకు గాను తగిన యభిరుచు గలుగునటుల ఆదేశ గ్రంథాలయాధిపతులు అనేకవిధములైన ఆకర్షణములను జూపెదరు; వారు ప్రకటించెదరు; పత్రికలను పంచిపెట్టెదరు; పలువిధములైన ప్రచారమును గావించెదరు. చిల్లర దుకాణములందు కొనునట్టివారిని ఆకర్షించుటకై, వారు కొనువస్తువులను చుట్టబెట్టుటకు గాను అట్టి ప్రకటనపత్రికలను ఉంచెదరు. సంచార గ్రంథాలయ పేటికలను పంపెదరు. అప్పు డప్పుడు గ్రంథముల నంపు శాఖల నేర్పరచెదరు.

ఆదేశమందు "ఫిలడెల్ఫియా" గ్రంథాలయములందు గ్రంథములను టెలిఫోను వార్తలమూలమున తెప్పించుకొనవచ్చును. రెండు వేలమైళ్ల దూరమునుండి యైన తెప్పించుకొన వచ్చును. అక్కడ గ్రంథాలయములయందు ఉత్తరములు వ్రాసికొనుటకు ప్రత్యేకమైన గదులు గలవు. చివరకు చుట్టలు కాల్చుకొనుటకు గూడ ప్రత్యేకమైన యేర్పాటులు గలవు.

ఐరోపాదేశమందు పదిసంవత్సరములకు తక్కువ వయస్సుగల బాలురు గ్రంథాలయముల నుపయోగింపరాదు. కాని అమెరికా దేశమందు పిల్లలను నిషేధింపలేదు. ఆదేశ గ్రంథాలయములందు పిల్లలకు ప్రత్యేకముగ "బాలశాఖలు" గలవు. గ్రంథ భాండాగారి వారికి అప్పు డప్పుడు కథలు - పురాణగాధలు - ప్రసిద్ధపురుషుల వీరకార్యములు - మొదలైనవానిని జెప్పుచుండును. అట్టివానిని చెప్పునప్పుడు ఆగాధలను సగముజెప్పి ఆపివేసి, కొన్నిపుస్తకములను వారియెదుట బెట్టి, ఆగాధలయొక్క మిగిలినభాగములను ఆపుస్తకములనుండి ఎవరికి వారు చదువుకొనునటుల జేయును.

గ్రంథాలయములపని ప్రత్యేకమొక శాస్త్రము. ఈపనియందు తరిబీతు చేయునట్టి పాఠశాలలు అనేకము లాదేశమందుగలవు.