శ్రమచేయుటకుగాను ఏర్పాటులు చేయుదురు. అట్టివారికి ఒక్కసారి ఇరువదియైదు పుస్తకములవరకు ఎరు విచ్చెదరు.
ఆదేశమందు గ్రుడ్డివారికిగూడ ప్రత్యేక గ్రంథాలయములున్నవి. వారికి గదులను ప్రత్యేకించి, ఉబ్బెత్తు అక్షరములుగలిగిన గ్రంథములను వానియం దుంచెదరు. ప్రభుత్వమువారిచే నిర్వహింపబడుచు ఆదేశమందెల్ల అగ్రస్థానమును, ప్రపంచమందెల్ల మూడవ స్థానమును వహించియున్నట్టి కాంగ్రెసు జాతీయగ్రంథాలయమునందు ఆంధ్రులగు చదువరులకు పుస్తకములను ఇంటికిగూడ ఎరు విచ్చెదరు.
పట్టణ గ్రంథాలయములందును, పల్లె గ్రంథాలయములందును గూడ విద్యార్థికి వారమునకు 6 లేక 7 గ్రంథములను ఎరు విచ్చెదరు. గడువుకాలమునకు ఆగ్రంథములను తిరిగి ఇయ్యనియెడల రెండు లేక మూడుకాసులకు మించని జుల్మానాను విధించెదరు.
ఆదేశ గ్రంథాలయములందు పుస్తకములు పోవుట మిక్కిలి అరుదు. పుస్తకములు చదువరులు ఎత్తుకొని పోయెదరేమో యని గ్రంథాలయాధిపతులు అనుమానగ్రస్థులై యుండరు. అట్టి అనుమానముతో జూచుటవలన గ్రంథాలయములయందున్న "అమూల్యాఇశ్వర్యమును" చదువరులు ఉపయోగింప ఉత్సాహవంతులై యుండ రని వారి తలంపు.
ఆదేశగ్రంథాలయములు సాధారణముగా ఉదయము 8 గంటలుమొదలు రాత్రి 10 గంటలవరకు తెరచి యుంచబడును. శలవు దినములందు మాత్రము మధ్యాహ్నము 2 గంటలు మొదలు రాత్రి 10 గంటల వరకు తెరచెదరు.
గ్రంథాలయ మనగా గ్రంథములను సేకరించి యుంచుస్థానము గాదు; గ్రంథములను పాతిపెట్టు స్థలముగాదు; మిక్కిలి తెలివితేటలతో జనులకు గ్రంథములను ఉచితముగా పంచి యిచ్చు స్థలమునకే గ్రంథాలయ మని పేరు. తనతేజమును వ్యాపింపజేయునట్టిజ్ఞానజ్యోతి