పుట:Gospel of Mark ː Commentary in Telugu.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విభజన విశ్లేషణ

మార్కు సువార్త సారాంశమంతా ఒకే వచనంలో ఇమిడి వున్నది. “మనుష్య కుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను” (10:45). ఒక్కో అధ్యాయం చదివే కొద్దీ మనకు యేసుక్రీస్తు జీవితంలోని సేవ, బలిదానం అనే రెండు పార్శ్వాలు అవతరిస్తాయి.

తండ్రి చిత్తానికి లోబడి, నిరంతరము పరిశమిస్తున్న సేవకుడిగా యేసును మార్కు మన ఎదుట సాక్షాత్కరింప జేశాడు. ఆయన తన బోధనలు, ఉపదేశాలు, స్వస్థతల ద్వారా మరణమయ్యే దాకా ఇతరులకు సేవ చేస్తూనే వున్నాడు. పునరుత్థానం తరువాత తన శిష్యులు తన పనిని తన శక్తితో కొనసాగించాలని ఆదేశించాడు. సేవకులు పరిపూర్ణ సేవకుడి ఆదర్శం పాటించడమంటే ఇదే.

ఈ సువార్త ప్రాచీన శీర్షిక “కాటామార్నోన్‌ అంటే మార్కు తెలియజేసిన సువార్త. లాటిన్‌ భాషలో రచయిత పేరు “మార్కస్", హీబ్రూ వర్ణాలలో అతడి పేరు జాన్‌, అపొ.కా. 12:12,25; 15:37లో “మారు అను మారు పేరుగల యెహాను అని ఇతడి పేరు ప్రస్తావించటం గమనిస్తాం.

రచయిత

అపొ.కా. 12:12 ప్రకారం మార్కు తల్లి మరియకు యెరూషలేములో విశాలమైన ఇల్లు వున్నది. దానిని యెరూషలేములోని విశ్వాసులు ప్రార్థన కూడిక కేంద్రంగా వినియోగించుకొనేవారు. పేతురు ఈ ఇంటికి తరచు వెళ్లేవాడని అర్ధమవుతుంది. ఎందుకంటే గడప దగ్గర పనిపిల్ల అతడి స్వరం విని గుర్తుపట్టింది (ఆపొ.కా. 12:13-16). బర్నబా మార్ముకు మేనమామ (కొలస్సీ 4:10). అయితే అతణ్జి ప్రభువులోకి నడిపింది పేతురు. (ఎందుకంటే పేతురు అతణ్ణి “నా కుమారుడు మార్కు" అని పేర్కొన్నాడు. 1పేతురు 5:18). పేతురుతో వున్న ఈ సాన్నిహిత్యమే మార్కు సువార్తకు అపొస్తలిక అధికారం కలగటానికి ముఖ్య కారణం. ఎందుకంటే మార్కు తన సువార్త వివరాలన్నీ పేతురు నుండే సేకరించాడు. గెత్సెమనే తోటలోని సంఘటనలో కనిపించే “ఒక పడుచు వాడు” మార్కు అని కొందరు పండితుల అభిప్రాయం (14:51,52). శిష్యులంతా ప్రభువును విడిచి వెళ్లిపోయినందున (14:50) ఈ చిన్న సంఘటన సాక్షి కథనం అని భావించడానికి అవకాశం ఉంది.

బర్నబా, పౌలులు యెరూషలేము నుండి అంతియొకయకు తిరిగి వెళ్లినప్పుడు (అ.కా. 12:25), మరల మొదటి సేవా యాత్రలో మార్కును వెంటబెట్టుకొని వెళ్లారు (13:5). అయితే, మార్కు మధ్యలోనే వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వచ్చాడు (13:13). రెండవ సేవా యాత్రలో బర్నబా మార్కును వెంటబెట్టుకొని వెళ్లాలని ప్రతిపాదిస్తే పాలు దానికి ససేమిరా అన్నాడు. దానితో వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు పొడసూపాయి. ఫలితంగా బర్నబా మార్కును వెంటబెట్టుకొని కుప్రకు వెళ్లాడు. పౌలు సీలను వెంటబెట్టుకొని సిరియ, కిలికియ ప్రాంతాలకు వెళ్లాడు (అ.కా. 15:8-641). అయితే దాదాపు పన్నెండేళ్ల తరువాత తనను మొదటిసారి బంధించి నప్పుడు మార్కు తనతో వున్నట్టు పౌలు రాశాడు (కొలస్సీ 410; ఫిలేమోను 24). దీనిని బట్టి వారి మధ్య సయోధ్య కుదిరి వుంటుందని భావించవచ్చు. పౌలు తన జీవిత చరమాంకంలో మార్కు కోసం కబురుపెడుతూ “అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు” అన్నాడు (2తిమోతి 4:11).

అది సంఘ పితరులు ఈ సువార్తను మార్కు రాసినట్టు అంగీకరించారు. మార్కు కర్ఫత్వాన్ని ఆమోదించిన అది సంఘ పితరులలో పాపియాస్‌, ఐరేనియస్‌, అలెగ్జాండ్రియా వాడైన క్లెమెంట్‌, ఓరెగన్‌ మొదలైనవారు వున్నారు.

రచనా కాలం

నాలుగు సువార్తలలో మొట్టమొదటిది మార్కు అని పండితుల అనేకుల అభిప్రాయం. అయితే తేదీ విషయం అస్పష్టత నెలకొని వున్నది. యెరూషలేం దేవాలయం నాశనం విషయమైన ప్రవచనాన్ని బట్టి (13:2), క్రీ.శ. 70 ముండే రాసి వుండాలి. అయితే ప్రాచీన సాంప్రదాయాలలో పేతురు హతసాక్షి కావటానికి (క్రీ.శ. 64) ముందు రాశాడో, లేక తరువాత రాశాడో అనే విషయంలో ఏకాభిప్రాయం లేదు.