Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


"బ్రాహ్మణేభ్యో దదౌ పుత్రో రాజ్ఞస్త స్యార్ధ్వదైహికమ్,
తతః ప్రభాతసమయే దివసే౽థ త్రయోదశే."

(అయో. 77. 4.)

షష్ఠిరోజున దేశీయాచారసిద్ధ మగుదహనదేశశోధనము. సప్తమినాఁడు మార్గశోధనకొఱకుఁ గూలివాండ్రను బంపుట.

"త్రయోదశో౽యం దివసః పితుర్వృత్తప్యతే విభో!
సాపశేషాస్థినిచయే కిమిహ త్వం విలంబసే.”

(అయో. 77. 22.)

సప్తమి మొదలుకొని దశమివఱకు త్రోవ బాగుచేయించుట. ఏకాదశినాఁడు భరతుఁడు రామునియొద్దకు బయలుదేరుట. ఆనాఁటిరాత్రి గంగాతీరమందు నివాసము. ద్వాదశినాఁడు భరద్వాజాశ్రమప్రాప్తి. త్రయోదశినాఁడు భరతుఁడు రామునితోఁ గలిసికొనుట. చతుర్దశి, పౌర్ణమాసి, పాడ్యమి, మూఁడురోజులు భరతుఁడు చిత్రకూటమం దుండెను. వైశాఖబహుళద్వితీయ భరతుఁడు తిరుగ నయోధ్యకు బయలుదేరెను. చవితినాఁ డయోధ్యలోఁ బ్రవేశించెను. ఈరీతిగా నొకనెలమీఁదఁ బదునైదురోజులు కాఁగా వైశాఖబహుళపంచమినాఁడు రాముఁడు చిత్రకూటమునుండి వెడలి యత్రిమున్యాశ్రమముఁ బ్రవేశించెను. ఈరీతిగా

"క్వచి త్పంచ దశా న్మాసా నేకం సంవత్సరం క్వచిత్,
క్వచి చ్చ చతురో మాసాన్ పంచష ట్చాపరాన్ క్వచిత్.
అపర త్రాధికం మాసా దప్యార్ధ మధికం క్వచిత్,
త్రీ న్మాసా నష్ట మాసాంశ్చ రాఘవో న్యవస త్సుఖమ్,
తథా సంవసత స్తస్య మునీనా మాశ్రమేషు వై,
రమత శ్చానుకూల్యేన యయు స్సంవత్సరా దశ."

(అర. 11.)

రాముఁడు మఱి మూఁడుసంవత్సరములు పంచవటియందుఁ గడపెను. తరువాతఁ బదునాలవసంవత్సరపుఁ జైత్రమాసమున సీతాపహరణము. వైశాఖమాసములో సుగ్రీవునిఁ జూచెను. ఆషాఢమాసములో వాలివధము. ఆశ్వయుజమాసమందు సైన్యోద్యోగము. ఫాల్గునమందు వానరులు బ్రాయోపవిష్టు లగుట. ఫాల్గుణశుద్ధచతుర్దశినాఁడు లంకాదహనము. ఫాల్గుణబహుళఅమావాస్యనాఁడు రావణవధ. చైత్రశుద్ధపాడ్యమినాఁడు రావణునికి విభీషణుఁడు దహనాదినంస్కారములు సేయుట. ద్వితీయయందు విభీషణపట్టాభిషేకము, సీతాప్రాప్తి. తృతీయరోజున లంకనుండి రాముఁడు బయలుదేఱుట. చవితినాఁడు కిష్కింధాప్రాప్తి. పంచమినాఁడు భరద్వాజాశ్రమప్రాప్తి.

“పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం లక్ష్మణాగ్రజః,
భరద్వాజాశ్రమం ప్రాప్య వతందే నియతో మునిమ్."

(యుద్ధ. 127. 1.)

షష్ఠినాఁడు నందిగ్రామప్రాప్తి. జటావిశోధనము. అయోధ్యాప్రాప్తి. సప్తమినాఁడు శ్రీరామపట్టాభిషేకము.

(గోవింద. వ్యా.)