Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బడఁ డని వానికి బ్రహ్మ వర మిచ్చినట్లు వాసిష్ఠరామాయణమందుఁ గానవచ్చుచున్నది.

"మేఘనాదో మహాఘోరం తపః కృత్వా౽బ్రవీత్తతః,
బ్రహ్మాణం లోకకర్తారం వరాస్మే దేహి సాంప్రతమ్.
బ్రహ్మా తద్వచనం శ్రుత్వా మేఘనాదం తదా౽బ్రవీత్,
... ... ... ... ... ...
చతుర్దశ చ వర్షాణి నిద్రాహారవివర్జితః,
రామ స్యావరజో య స్స్యా తేన నాశో భవే త్తవ.”

(వాసిష్ఠరామాయణ)

ఈయంశము వాల్మీకిరామాయణమం దెచ్చటను గానరాదు సరేకదా, యీకథకు విరుద్ధముగా లక్ష్మణుఁడు నిత్యము మాంసాద్యాహారములను భుజించుచున్నట్లు రాత్రులయందు నిద్రించుచున్నట్లు ననేకస్థలములయందు బ్రమాణములు గానవచ్చుచున్నవి.

“అగ్రే ప్రదాయ భూతేభ్య స్సీతా౽థ వరవర్ణినీ,
తయో రుపదదే భ్రాతో ర్మధు మాంసం చ తద్భృశమ్.
తయో స్తుష్టి మథోత్పాద్య వీరయోః కృతశౌచయోః,
విధిన జ్జానకీ పశ్చా చ్చక్రే తత్ప్రాణధారణమ్.
అథ రాత్ర్యాం వ్యతీతాయా మవసుప్త మనంతరమ్,
ప్రబోధయామాస శనై ర్లక్షణం రఘునందనః.
స సుప్త స్సమయే భ్రాత్రా లక్ష్మణః ప్రతిబోధితః,
జన నిద్రాం చ తంద్రీం చ ప్రసక్తం చ పథి శ్రమమ్"

(అయో. 56. 1-3.)

రాముఁడు వనవాసార్థ మయోధ్యానగరము విడిచినదినము మొదలుకొని దిరుగ నాపట్టణమును బ్రవేశించుటకుఁ బట్టినపదునాలుగువత్సరములలో నెప్పు డేయేప్రదేశములకుఁ బోయెనో? ఎప్పు డేయేకార్యములం జేసెనో యాకాల మిప్పుడు నిర్ణయింపఁబడవలయును.

వాల్మీకిమహర్షి తనగ్రంథమందు రాముఁ డీదినమం దీకార్యమును జేసె నని కంఠోక్తిగాఁ జెప్పకపోయినను అచ్చటచ్చట నతఁడు సూచించినయర్థములను వ్యాఖ్యాత లొనర్చిన వ్యాఖ్యానములను నాలోచింపఁగా నాకార్య మి ట్లేర్పఱుపఁబడుచున్నది. రాముఁ డరణ్యమునకుఁ బోవుటకు నిశ్చయించి యయోధ్యను విడిచి బయలుదేఱినదినమే చతుర్దశవత్సరపరిమితవివాసనకాలమునకుఁ బ్రథమదినము. అది చైత్రశుద్ధపంచమి. ఆనాఁటిరాత్రి తమసానదీతీరమందు నివాసము.

“తతు స్తు తమసాతీరం రమ్య మాశ్రిత్య రాఘవః,
సీతా ముద్వీక్ష్య సౌమిత్రి మిదం వచన మబ్రవీత్,
ఇయ మద్య నిశా పూర్వా సౌమిత్రే! ప్రహితా వనమ్”

(అయో. 46.)