Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


"తద్వ్యతీతస్య తే ధర్మా త్కామవృత్తస్యవానర!
భ్రాతృభార్యావమర్శే౽స్మిన్ దండో౽యం ప్రతిపాదితః,
న చ తే మర్షయే పాపం క్షత్రియో౽హం కులోద్భవః,
ఔరసీం భగినీం చాపి భార్యాం చాప్యనుజస్య యః
ప్రచరేత నరః కామా త్తస్య దండో వధస్మృతః.”

(కిష్కిం. 18. స.)

అని చెప్పి శాస్త్రమును గనుపఱిచి “నీవు భ్రాతృజాయాసక్తుఁడ వగుటవలన మహాపాతకి వని నిశ్చయించి నీవంటివానికి వధ తప్ప నితరశిక్షలు లే వని తలంచి నిన్ను వధించితి" నని చెప్పెను. ఇట్లు జరిగియుండఁగాఁ బట్టాభిషేకానంతరమందుఁ దారను వశపఱుచుకొనుటచే సుగ్రీవుఁడుగూడ భ్రాతృభార్యాగామిత్వరూపపాపము గలవాఁ డయ్యె. ఉమాసంహితలోఁ బార్వతి శివునిఁ బ్రశ్నించుచున్నది —

"పుత్త్రభార్యా శిష్యభార్యా కనిష్ఠభ్రాతు రేవ చ, స్ను షా చ జ్యేష్ఠ భార్యాచ మాతులస్య కుటుంబినీ. మాతృతుల్యా ఇతి ఖ్యాతాః కథం తారసమాగమః."

(అధ్యా. 10.)

ఇందువలన మాతృతుల్యురా లయినతారతోఁ గాఁపురము చేయుట సుగ్రీపునికి మహాపాప మని స్పష్ట మగుచున్నది. కావున సుగ్రీవుఁడుగూడ వాలివలెఁ బాతకి యగుటచే వధదండనార్హుఁ డై యుండఁగా రాముఁడు పక్షపాతము గలవాఁ డై సుగ్రీవునిఁ జంపక వాలి నేల చంపె నని యాక్షేపము.

సమాధానము:—

శ్రీరామునికి లేశమయినను బక్షపాతము లేదు. సుగ్రీవుఁడు దోషి కాఁడు. ఇందు కుమాసంహితలో బ్రమాణము —

"యోనిజాతాసు నారీషు సంసర్గో లోకగర్హితః,
యోన్యజాతా స్వంగనాసు గమనే నైవ కిల్బిషమ్.”

(అధ్యా. 10.)

ఇందువలనఁ దార యయోనిజురా లగుటచేఁ దత్సంగతుఁ డైనసుగ్రీవునికి దోషము లే దనుధర్మతత్త్వ మెఱింగినరాఘవుఁడు సుగ్రీవునియందు దయగలవాఁ డయ్యె. సుగ్రీవునిభార్య యగురుమ యోనిసంభూతురా లగుటచేఁ దత్సవృత్తుఁ డగువాలి పాపిష్ఠుఁ డని నిశ్చయించి రాముఁడు వానిని వధించెను. ఇది గాక మఱియొకవిశేషము.

"అస్య త్వం ధరమాణస్య సుగ్రీవస్య మహాత్మనః
రుమాయాం వర్తనే కామాత్ స్నుషాయం పాపకర్మకృత్."

(కిష్కిం. 18. 19)

ఇందువలన సోదరుఁడు జీవించియుండఁగా నతనిభార్యను ముట్టఁగూడదు. మృతుఁ డైనసోదరునిభార్య పరిగ్రహ్యురాలని వానరకులధర్మము. రామాయణము నాంధ్రీకరించిన గోపీనాథము వేంకటకవి గూడ నీయర్ధమునే యాంధ్రీకరణమందు విశదీకరించియున్నాఁడు. రాముఁడు వాలితోఁ జెప్పుమాట:—