ప్రథమాక్షేపము:—
అయోధ్యాకాండలో శ్రీరామపట్టాభిషేకప్రకరణమందు దశరథుఁడు పూర్వము కేకయరాజునొద్దకుఁ బోయి కైకేయి యనుకన్యను దన కి మ్మని ప్రార్థించెను. ఆమెగర్భమందు జనించుపుత్త్రునికి రాజ్య మిచ్చెద నని నీవు ప్రతిజ్ఞ చేసినయెడల నీయభిలాష నేరవేర్తు నని కేకయరాజు నుడువఁ బంక్తిరథుం డట్ల కావించెద నని శపథము చేసి యామెను బెండ్లాడెను. ఈకథ రామాయణార్థోపబృంహకము లయిన పురాణములయందుఁ బ్రసిద్ధము.
| | "పురా భ్రాతః! పితా న స్ప మాతరం తే సముద్వహన్ | |
(అయో. 107. 3.)
కైకేయీవివాహకాలమందే కైకేయికిఁ బుట్టఁబోవుపుత్త్రునికి దశరథునిచే రాజ్యప్రదానము ప్రతిజ్ఞాత మయినట్లు పైశ్లోకమువలనఁ గానవచ్చుచున్నది. కాన దశరథుఁడు తాను గైకేయికిఁ జేసిన వాగ్దానమునకు విరుద్ధముగాఁ జోరవృత్తి నవలంబించి రామాభిషేకసమయమున కనేకదేశములనుండి యనేకరాజులను దూతలద్వారా రప్పించినను గేకయరాజునకు మాత్ర మీవృత్తాంతమును దెలియనీయకయే రామునిఁ బిలువనంపి —
| | "విప్రోషిత శ్చ భరతో యావ దేవ పురా దితః, | (అయో.) |
అని రామునితోఁ జెప్పి రామపట్టాభిషేకమున కుద్యమించెను. దశరథునంతగొప్పవాఁ డి ట్లేల చేయవలయును?
శ్రీరామాయణవ్యాఖ్యాతలు దీని కిట్లు సమాధానము వ్రాసియున్నారు:—
దశరథుఁడు కేవలము నీకుమారునికి రాజ్య మిచ్చెదననియే కైకేయికిఁ బ్రతిజ్ఞ చేసియుండలేదు. మఱేమనఁగా: “సమయమందు నాకు నీవు జ్ఞాపకము చేసినయెడల నీపుత్త్రునికే రాజ్య మిత్తును నీవు మఱచిపోయినయెడల సకలసద్గుణసాగరుఁడు రాజ్యపరిపాలనార్హుఁ డైనమఱియొకపుత్త్రునికి ధర్మశాస్త్రమునకు విరోధము లేకుండ రాజ్య మిచ్చెద” ననియే ప్రతిజ్ఞ చేసెను. అందువలన దశరథుఁడు తనప్రతిజ్ఞ నతిక్రమింపలేదు. కైకేయి యీయంశమును యుక్తసమయమునందు దశరథునికి జ్ఞాపకము చేయకపోవుటచే దశరథుఁ డీసంగతి నాలోచించి భరతుఁ డయోధ్యకు రాకమున్నె శాస్త్రవిహితముగా రాజ్యపరిపాలనార్హుఁ డైనరామునికిఁ బట్టాభిషేక మొనర్ప నిశ్చయించెను. ఇందుచేతనే పట్టాభిషేకమహోత్సవవృత్తాంతమును దెలియఁజేయుటకుఁ గేకయరాజుకు దూతలఁ బంపలేదు. ఈయర్థ ముమాసంహితలో నుమామహేశ్వరసంవాదమం దిటుల పరిష్కరింపఁబడియున్నది. పార్వతి శివు నడుగుచున్నది —
| | "రాజ్ఞో దశరథ స్యాస్య మృషావాదిత్వ మాగతమ్, | |