Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసెను. పెండ్లి యైనతరువాతఁ బండ్రెండేండ్లు రామునితోఁ గాపురము చేసి సకలసుఖముల ననుభవించి పదునెనిమిదవయేఁట రామునితో నరణ్యమునకుఁ బోయెను. ఈరీతిగాఁ జూచుకొన్నయెడల సీత రావణునితోఁ బలికినప్రకార మామెకుఁ బదునెనిమిదేండ్లును రాముని కిరువదియైదేండ్లును నుపపన్నముగా నున్నవి.

"దశ సప్త చ వర్షాణి జాతస్య తవ పుత్త్రక!
ఆస్థితాని ప్రకాంక్షంత్యా మయా దుఃఖపరిక్షయమ్.”

(అయో. 20.40)

అను కౌసల్యావచనముంబట్టి చూడఁగా వనప్రవేశసమయమునకు రామునికిఁ బదునేడు సంవత్సరముల ప్రాయ మయినట్లు తేలుచున్నది. ఈకౌసల్యావచనమునకును నాభర్త యిరువదియైదేండ్లప్రాయముగలవాఁ డని సీత రావణునితోఁ జెప్పినమాటకును విరోధింపదా యన్నచో విరోధింపదు.

"దశ సప్త చ వర్షాణి జాతస్య తవ పుత్త్రక!" అను శ్లోకములోఁ గౌసల్యచే నుద్దిష్టమయిన కాలము ”జన్మనా జాయతే శూద్రః కర్మణాజాయ తే ద్విజః" అనుశాస్త్రానుశాసనమువలన నుపనయనకాలముమొదలు పదునేడుసంవత్సరములు గాని రామునిజననకాలమునుండి పదునేడేండ్లు కాదు (గోవింద. రా) “గర్భైకాదశేషు రాజస్యమ్” అనుగృహ్యసూత్రములో నున్న గర్భైకాదశీశబ్దముయొక్క బహువచనసారస్యమునుబట్టి క్షత్త్రియునికి గర్భస్థుఁ డైనసంవత్సరము మొదలుకొని తొమ్మిదవసంవత్సరములోఁ గాని పదియవసంవత్సరములోఁ గాని పదునొకండవసంవత్సరములోఁ గాని యుపనయనముఁ జేయవచ్చు నని విధాన ముండుటవలన రామున కెనిమిదవయేఁట నుపనయన మయినచో నాకాలము మొదలుకొని వనప్రయాణసమయమునకుఁ బదునేడేండ్లు కాఁగా రామునివయస్సు సీత చెప్పిన ట్లిరువదియైదేండ్లు కుదిరినది.

5. రావణుని, మొదట నలకూబరుఁడు శపించెనా? బ్రహ్మ శపించెనా?

ఒకకాలమందు నలకూబరునియొద్దకుఁ బోవుచున్న రంభను రావణుఁడు బలాత్కారముగాఁ బట్టుకొని రమింపఁగా నలకూబరుఁ డీవృత్తాంతము రంభవలన నెఱింగి కోపించి 'ఇకమీఁద రావణుఁ డిష్టములేని స్త్రీలఁ జెఱుప నుద్యమించినయెడల వానిశిరస్సు నూఱుముక్క లగుఁగాక" యని శపించె నని యుత్తరకాండము 26వ సర్గలోఁ జెప్పఁబడియున్నది.

“ధర్షణాం తాం పరాం శ్రుత్వా ధ్యానం సంప్రనివేశ హ
తస్య తత్కర్మ విజ్ఞాయ తదా వైశ్రవణాత్మజః.
ముహూర్తా ద్రోషతామ్రాక్షః తోయం జగ్రాహ పాణినా,
గృహీత్వా సలిలం దివ్య ముపస్పృశ్య యథావిధి.
ఉత్ససర్జ తదా శాపం రాక్షసేంద్రాయ దారుణమ్.
యదా హ్యకామాం దుష్టాత్మా ధర్ష యిష్యతి యోషితమ్,
మూర్ధా సహస్రథా తస్య శకలీభవితా తదా.”