Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లక్ష్మణభరతులు భిన్నోదరు లగుటచే భరతునికంటె ముందు లక్ష్మణునికిఁ గన్యాప్రదానము చేసినను దోషము లే దని గోవిందరాజీయవ్యాఖ్యానములో సమర్థింపఁబడెను. లేక యీసర్గమందే యుత్తరగ్రంథమందు “చత్వార స్తే చతసౄణాం వసిష్ఠానుమతే స్థితాః, యథోక్తేన తథా చక్రుః” అని చెప్పఁబడియుండుటచేత వసిష్ఠునిచేఁ బ్రేరితులయి భరతలక్ష్మణశత్రుఘ్నులు యథాశాస్త్రముగా జ్యేష్ఠానుక్రమము ననుసరించి పెండ్లియాడి రనునర్థము సమంజసముగా నున్నట్లు తోఁచుచున్నది.

"సీతా మాదాయ గచ్ఛ త్వ మగ్రతో భరతాగ్రజ!
పృష్ఠతో౽హం గమిష్యామి సాయుధో ద్విపదాంవర!"

(అయో. 55. స.)

ఇది రాముఁడు లక్ష్మణునితో నన్నమాట, ఇచట “భరతాగ్రజ!” అనుసంబుద్ధికి భరతుఁ డగ్రజుఁడుగాఁ గలవాఁడని తాత్పర్యము గాని భరతుని కగ్రజుఁ డని కాదు. (గోవింద. వ్యా. చూడు.) కావునఁ బైన వ్రాసినయుక్తులచే భరతుఁడే లక్ష్మణునికంటె బెద్దవాఁ డని నిశ్చయింపఁబడుచున్నది. లక్ష్మణునికి రామానుజుఁ డని వ్యవహార మున్నట్లు భరతానుజుఁ డనికూడ నున్నది.

"హిమవాన్ మందరో మేరు స్త్రైలోక్యం వా సహామరైః,
శక్యం భుజాభ్యా ముద్ధర్తుం న సంఖ్యే భరతానుజః.”

(యు. 59.112.)

ఇందువలన భరతుఁడు లక్ష్మణునికంటే బెద్దవాఁ డని నిశ్చయముగాఁ జెప్పవచ్చును.

3. రాముఁ డేకపత్నీకుఁడా? బహుపత్నీకుఁడా?

కైకేయి మంధరతోఁ జెప్పుమాట:—

“హృష్టాః ఖలు భవిష్యంతి రామస్య పరమాస్స్త్రియః,
అప్రహృష్టా భవిష్యంతి స్నుషా స్తే భరతక్షయే.”

(అయో. 8. 12.)

“రామునకుఁ బట్టాభిషేకము గాఁగా నతనిస్త్రీలు సంతోషము గలవా రగుదురు. భరతునిగృహమం దుండెడునీకోడండ్రు హర్షహీన లగుదురు.” దశరథవిలాపములో;

"య స్సుఖే షూపధానేషు శేతే చందనరూషితః,
వీజ్యమానో మహార్హాభి స్స్త్రీభిర్మమ సుతోత్తమః.”

(అయో. 42.15.)

"ఏనాకుమారుఁడు చందనముఁ బూసికొని యుత్తమస్త్రీలచే వీవఁబడుచున్నవాఁ డయి సుఖకర మైనశయ్యలపైఁ బవళించునో?”

సీత రామునిఁగూర్చి తనలోఁ దా ననుకొనుమాట:—

"పితు ర్నిదేశం నియమేన కృత్వా వనా న్నివృత్త శ్చరితవ్రత శ్చ,
స్త్రీభి స్తు మన్యే విపులేక్షణాభిః స్త్వం రంస్యసే వీతభయః కృతార్థః."

(సుంద. 28. 14.)