Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పక్షము. దీనికి సమాధానము. తిలకమాహేశ్వరతీర్థీయగోవిందరాజీయాదివ్యాఖ్యానములఁబట్టి యాలోచింపఁగా:—

"ఇతి లోకసమాకృష్టః పాదే ష్వద్య ప్రపాదయన్,
రామస్య నిపతిష్యామి సీతాయా నిపతిష్య వా.
అంకే భరత మారోప్య ముదితః పరితస్వజే,
తతో లక్ష్మణ మాసాద్య వైదేహీం చ పరంతపః
అభివాద్య తతః ప్రీతో భంతో నామచాబ్రవీత్.

(అయో.)

అనునీశ్లోకములకు యథాశ్రుతార్థము గాక వ్యాఖ్యాత లర్థాంతరమును వ్రాసియున్నారు. ఎట్లన “లోకసమాకృష్ణః” అనుశ్లోకమందు “లక్ష్మణస్య” అనుషష్ఠికి ద్వితీయార్థము. లక్ష్మణుని “ప్రసాదయన్” మంచిమాటలతో వేఁడుకొనుచు "రామస్య సీతాయా శ్చ పాదయో ర్నిపతిష్యామి” “సీతారాములపాదములయందుఁ బడఁగలను”. లేక నాతల్లి చేసినయపకారమును దలఁచి నిర్దోషి నైననాయందు సీతారాములకుఁ గోప ముదయించినయెడల వారిపాదములపయిం బడుదును. అప్పుడు లక్ష్మణుఁడు నాతల్లి పలికినదుర్వాక్యముల నుద్ఘాటనఁ జేసి రామునిమనస్సులో ద్వేషమును బుట్టించినయెడలఁ గనిష్ఠునికాళ్లు జ్యేష్ఠుఁడు పట్టుకొనుట శాస్త్రనిషిద్ధ మైనను లక్ష్మణునికాళ్లమీఁదఁ గూడఁ బడెదను. అంతియె కాని భరతుఁడు లక్ష్మణునికి నమస్కరించె నని యర్థము కాదు. “అంకే భరత మారోప్య ముదితః పరిషస్వజే” అనుశ్లోకమునకుఁ గూడ నర్థము మఱియొకరీతిగాఁ గల్పింపవలెను “భరతుఁడు లక్ష్మణునియొద్దకుఁ బోయి యతనిఁ గౌఁగిలించికొని కుశలప్రశ్న చేసి గారవించి యనంతరము యథాశాస్త్రముగా స్వనామోచ్చారణపూర్వకముగా సీతకు నమస్కరించెను” వాల్మీకియొక్క హృదయాంతరస్థిత మగునీయర్థమునే తత్త్వసంగ్రహరామాయణకర్త లక్ష్మణుఁడే భరతునికి నమస్కరించె నని యీదిగువ వ్రాసినశ్లోకములో స్పష్టముగాఁ జెప్పెను.

"వవంతే భరతో భ్రాతా వైదేహీం చ పరంతపః,
రామేణాపి పరిష్వక్తో లక్ష్మణే నాభివాదితః"

(యుద్ధ. 38 స.)

ఇచ్చట “లక్ష్మణేనాభివాదితః" అని కంఠోక్తిగాఁ జెప్పుటచే లక్ష్మణునికంటె భరతుఁడు జ్యేష్ఠుఁ డన్నసంగతి స్పష్ట మగుచున్నది. అయిన జ్యేష్ఠుఁ డయినభరతుని విడిచిపెట్టి జనకుఁడు కనిష్ఠుఁ డైనలక్ష్మణుని కెట్లు కన్యాప్రదానముఁ జేసెను. ఇది శాస్త్రవిరుద్ధము కాదా యని శంకించవలదు. కన్యాప్రదానసమయమందె జనకుఁడు ధారాపూర్వకముగా శ్రీరామునికి సీత నర్పించి లక్ష్మణభరతశత్రుఘ్నులఁ బిలిచి మీరుమువ్వురు నూర్మిళామాండవీశ్రుతకీర్తులయొక్క పాణిని గ్రహింపుఁడని మాటమాత్రమే చెప్పియుండుటవలనను భరతునికిఁ గన్య నీయకముందు లక్ష్మణుని కిచ్చిన ట్లాశ్లోకముం దుండకపోవుటవలనను విరోధము లేదు. లేక ఏకోదరు లైనవారిలో జ్యేష్ఠుఁడు వివాహము లేకయుండఁగాఁ గనిష్ఠుఁడు పెండ్లి చేసికొనుట నిషిద్ధము గాని