"ప్రత్యక్షానుమానప్రమాణములచే బోధింపఁబడనియుపాయము దేనిచేఁ దెలియఁబడునో దానికి వేద మనిపేరు." ఇట్టిమూలప్రమాణమగు వేదము పౌరుషేయమువలె భ్రమవిప్రలిప్సాదిదోషజుష్టముగాక యపౌరుషేయమును స్వతఃప్రమాణము నయి యనాదినిధనావిచ్ఛిన్నసంప్రదాయప్రవర్తమానము నయి యున్నది. "యః కల్పస్య కల్పపూర్వః" అనున్యాయము ననుసరించి యీసంసార మనాది. సర్వజ్ఞుం డగునీశ్వరుండు గతకల్పమందలి వేదము నీకల్పాదియందు స్మరించి "యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తసె” అనుప్రమాణానురోధముగఁ బ్రథమజుఁ డగుచతుర్ముఖున కుపదేశించి నతఁడు మరీచ్యాదులకును, వారు తమశిష్యసంఘమునకును, నుపదేశింప నీరీతి నుపదేశపరంపరాప్రాప్త మయ్యె నని పూర్వమీమాంసకులసిద్ధాంతము. మఱికొందఱు శాస్త్రజ్ఞులు (నైయాయికులు) వేదము లీశ్వరప్రణీతము లందురు. "అస్య మహతో భూతస్య నిశ్వసిత మేత దృగ్వేదో యజుర్వేద స్సామవేదః" అనునది వారికిఁ బ్రమాణము.
ఇట్టి వేదము కర్మభాగ మనియు బ్రహ్మభాగ మనియు భాగద్వయాత్మకము. ఇందుఁ గర్మభాగము భగవదారాధన క్రమమును, బ్రహభాగము భగవత్స్వరూపరూపగుణవిభూతులను దెల్పుచున్నవి. ఇట్లు భగవత్ప్రతిపాక మగునీవేదము సంసారిచేతనులకు దత్త్వజ్ఞానము నొదవించుటయందు ముఖ్యసాధనము. తత్త్వజ్ఞాన మనఁగా; సర్వస్మాత్పరుఁ డైనశ్రీమన్నారాయణునకు సర్వప్రకారములఁ బరతంత్రము లగునీయాత్మలకు స్వరూపానురూపపురుషార్థ మగుభగవత్ప్రాప్తిని నిరోధించు ననాదికర్మసంబంధమును నివర్తింపఁ జేయునుపాయము. ఇది యర్థపంచకజ్ఞానమూలము. అర్థపంచకజ్ఞాన మనఁగా: స్వస్వరూప పరస్వరూప పురుషార్థస్వరూ పోపాయస్వరూప విరోధిస్వరూపముల యథార్థముగ నెఱుంగుట. వీనిలో స్వస్వరూప మాత్మస్వరూపము. (ఆత్మలక్షణ మిట్టిదని యెఱుంగుట. ) పరస్వరూప మీశ్వరస్వరూపము. పురుషార్థస్వరూపము మోక్షలక్షణము. ఉపాయస్వరూపము కర్మజ్ఞానభక్తిప్రపత్తిలక్షణము. విరోధిస్వరూపము భగవత్ప్రాప్తిప్రతిబంధకీభూతానాదికర్మబంధము ఇ ట్లర్థపంచకజ్ఞానపూర్వకముగఁ బరతత్త్వమగు శ్రీమన్నారాయణుని పాదారవిందములయందు నన్యస్తాత్మరక్షణభరుండై యతని కత్యర్థప్రియుఁడై మెలఁగుటయే మోక్షసాధనములలో మౌళీభూత మని సర్వవేదాంతతాత్పర్యము.
అనంతశాఖాంచితచతుర్దశవిద్యాస్థానోపబృంహిత మై దుర్జ్ఞేయార్ధప్రతిపాదక మగు వేదమును గూలంకషముగ జదివినఁ గాని పరబ్రహ్మతత్త్వనిర్ణయసామర్థ్యముఁ దత్త్వజ్ఞానముఁ గలుగదనియు, రాఁబోవుకలియుగమునందలిజను లల్పాయువులు, రోగపీడితులు నగుటచే నిట్టిదుర్ఘటజ్ఞానమును సంపాదింపఁజాల రనియు నూహించి సకలభూతానుకంపాసంపన్నచిత్తులుఁ, బరావరతత్త్వయాధాత్మ్యవిదులు, దేవతాపారమ్యవేత్తలు నగుపరాశరవ్యాసవాల్మీకాది మహర్షులు “ఇతిహాసపురా