పీఠిక
శ్లో. | నమస్తస్మై కస్మై చన భవతు నిష్కించనజన | |
ఈశ్వరసృష్టమగు నీసంసారచక్రమునందు బరివర్తమాను లగుసకలచేతనులకు ధర్మార్థకామమోక్షము లను నాలుగు పురుషార్థములు నత్యంతాదరణీయములు. మహాభారతమునందు—
| "ధర్మం చార్ధం చ కామం చ యథావ ద్వదతాంవర! | |
"వక్తలలో శ్రేష్ఠుఁడా! కాలోపయోగముం దెలిసినవిచక్షణుఁడు కాలమును విభజించి ధర్మార్థకామములు సేవింపవలయును. ఈపురుషార్థము లన్నిటిలో మోక్ష మనునది యుత్కృష్టశ్రేయము నిచ్చునది” అని యుధిష్ఠిరునితో భీమసేనుఁడు చెప్పియున్నాఁడు. కావున మోక్ష మితరపురుషార్థములకంటె మిక్కిలిహితకరము ముఖ్యతమము. ధర్మాదులుగూడ మోక్షమునకును సాధనము లగుటవలననే పురుషార్థము లని వ్యవహరింపఁబడుచున్నవి. వీనిలో ధర్మము ప్రవృత్తిరూప మనియు నివృత్తిరూప మనియు ద్వివిధము. ఇందు మొదటిది యిష్టాపూర్తాదికర్మరూపము[1]. ఇది స్వర్గాదిలోకప్రాప్తికి సాధనము. రెండవది, యైహికాముష్మికాల్పాస్థిరసుఖసంధాయకము లగుకర్మలఁ బరిత్యజించి కేవలపరమాత్మానుసంధానపరుఁ డై యుండుట. దీనికిఁ బ్రమాణము—
| "ప్రవృత్తిసంజ్ఞికే ధర్మే ఫల మభ్యుదయో మతః, | |
“ప్రవృత్తిరూపధర్మమువలన స్వర్గాదిపారలౌకికసుఖమును, పశుపుత్త్రవృష్ట్యన్నాదిలాభమును నివృత్తిరూపధర్మమువలన మోక్షమును సంభవించును” ఇ ట్లుభయలోకశ్రేయస్సాధన మగునది ధర్మము; ఇది యతీంద్రియము (చక్షురాదింద్రియాగోచరము.) ఇట్టిధర్మమును బోధించునది వేదము
| "ప్రత్యక్షే ణానుమిత్యా వా య స్తూపాయో న బుధ్యతే, | |
- ↑ యాగము సేయుట, చెఱువులు త్రవ్వించుట మున్నగుపను లిష్టాపూర్తకర్మలు