వీక్షణంబులు గ్రమ్మఱించుట కొక్కపురుషుఁడైన సమర్థుండు లేఁడు కాంతలం
జెప్పనేల నొక్కసారియైనఁ దత్సాన్నిధ్యాసాన్నిధ్యంబులయందుఁ జక్షుర్మానసం
లచేత నెవ్వండు రామునిం జూడకుండుఁ గరుణాంతరంగితాపాంగవీక్ష
ణంబుల రాముం డెవ్వని విలోకింపకుండు నట్టివాని లోకంబు గర్హించు
నంతియె కా దే నెంత దుర్భాగ్యుఁడ నని తన్నుఁ దాన గర్హించుకొను నీపర
మోదారుండు సకలవర్ణంబులకు సకలజనంబులకు వయోనురూపం బైనదయ
నొసంగుం గావున సర్వజనంబు లితని కనువ్రతు లై యుందు రని యిట్లు పెక్కు
తెఱంగుల వినుతించువారిభద్రవాక్యంబు లాకర్ణించుచు నెల్లవారిని యథా
ర్హంబుగా వీక్షణోక్తిభ్రూవిక్షేపణాంజలులచేతఁ బూజించుచుఁ బితృపితా
మహులచేత నధిష్ఠితం బైనధర్మమార్గంబు ననుసరించి యభిషిక్తుండ వై చిర
కాలంబు రాజ్యం బేలు మనిపలుకు పరమవృద్ధుల యాశీర్వాదంబులు
వీనులం బొలయ నుత్సుకుం డై మనోహర్షకరంబు లైన సుహృజ్జనులహిత
ప్రసంగంబులు వినుచుఁ జైత్యాయతనదేవాగారంబులకుఁ బ్రదక్షిణంబు
సేయుచుఁ గృతపుష్పోపహారం బై నక్షత్రశోభితం బైనయాకాశపథంబు
మాడ్కిఁ జూడికి వేడ్క సేయుచున్న రాజమార్గంబునం జని చని ముందఱ
రత్నజాలపరిష్కృతంబు లైనవర్ధమానగృహంబులచేత శారదాభ్రప్రతీ
కాశంబు లైనవిమానంబులచేతఁ గైలాసశిఖరాకారంబు లైనమహోన్న
తప్రాసాదశిఖరంబులచేత నభిరామదర్శనం బై యున్న రాజభవనంబుఁ గాంచి
హర్షపులకితగాత్రుం డై యమ్మణిమయమందిరంబుఁ బ్రవేశించి కక్ష్యాత్రయం
బతిక్రమించి యచ్చట రథంబు డిగ్గి తేవసంబున నవ్వలికక్ష్యాద్వయంబు
దాఁటి సహచరుల నందఱ నచ్చట నిలువ నియమించి క్రమంబునఁ గక్ష్యాం
తరంబు లన్నియు నతిక్రమించి శుద్ధాంతఃపురంబుఁ బ్రవేశించె జనం
బంతయుఁ జంద్రోదయంబు నాకాంక్షించుసరిత్పతిభంగి రాముని పునరాగమ
నంబుఁ గోరుచు మధ్యమద్వారంబున నుండె రామభద్రుం డట్లు సముచితం
బుగా నంతఃపురంబునకుం జని యందుఁ గైకేయీసహితుండై పర్యంక
మధ్యంబునం బవ్వళించి మొగంబున వైవర్ణ్యంబు దోఁపఁ గన్నుంగవ మోడ్చి
యున్నతండ్రి నవలోకించి తదీయచరణంబులకు నిజనామోచ్చారణపూర్వ
కంబుగా నభివందనంబుఁ గావించి పదంపడి కైకేయిపదంబులకు నమస్కరిం
చిన నద్దశరథుండు మెల్లనఁ గన్నులు విచ్చి కుమారువదనంబు విలోకించి
రామా యని పేర్కొని బాష్పపర్యాకులేక్షణుం డై యతని విలోకించుటకుం
జాలక గ్రమ్మఱ నేత్రంబులు ముకుళించి రామా యనెడు నక్షరద్వయోచ్చార
ణంబుకంటె నధికం బుచ్చరించుటకు భరం బై తోఁచిన నతనితోడ సంభా
షించుటకుం జాల కుండె నివ్విధంబున క్షుభితం బగుసముద్రంబుపగిది నుపప్లు